విజయవాడ మున్సిపల్‌ కౌన్సిల్‌లో గందరగోళం

3 Nov, 2018 18:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడ మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్‌ హాల్‌లో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటం ఉండటంపై విపక్షనేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటం కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మేయర్‌ అనుమతితో అధికారులు అంబేడ్కర్‌ చిత్ర పటం పక్కనే చంద్రబాబు చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తూ, ప్రజల కోసం రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ హెలీకాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన వైఎస్సార్‌ చిత్రపటాన్ని కూడా కౌన్సిల్‌ హాల్‌లో ఉంచాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. అటువంటి నాయకున్ని స్పూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కౌన్సిల్‌లో తమ అభిప్రాయం వ్యక్తం చేయడానికి ప్రయత్నించారు. దీంతో మేయర్‌తోపాటూ టీడీపీకి చెందిన కార్పొరేటర్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు. కేవలం చంద్రబాబు చిత్రపటానికి మాత్రమే కౌన్సిల్‌ హాల్‌లో స్థానం కల్పిస్తాం తప్ప వైఎస్సార్‌ చిత్రపటాన్ని కౌన్సిల్‌ హాల్‌లో పెట్టడానికి అంగీకరించమంటూ తేల్చిచెప్పారు.

దీంతో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార విపక్ష కార్పొరేటర్ల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. మేయర్‌ తనకున్న అధికారాన్ని ఉపయోగించి ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను సస్పెండ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మేయర్‌ ఏకపక్ష విధానాలతో, టీడీపీ అధికారాన్ని ఉపయోగించి తమపై దౌర్జన్యానికి పాల్పడుతుందంటూ కౌన్సిల్‌ హాల్‌లో తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌లందరూ కౌన్సిల్‌ హాల్‌ బయట తమ నిరసన తెలిపారు.

మరిన్ని వార్తలు