ఆరు నెలల్లో చేసింది శూన్యం

27 Dec, 2014 01:08 IST|Sakshi
ఆరు నెలల్లో చేసింది శూన్యం

ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు    
 
 పరోక్షంగా మంత్రి ఉమాపై నిప్పులు
‘ఆయన’ అధికారులతో మాట్లాడితే సరిపోతుందా!?
పోలీసు కమిషనర్‌పైనా వాగ్బాణాలు
సొంత కీర్తి కోసం పాకులాడుతున్నారని ధ్వజం
అధికారులు తమ లాభం కోసం పనిచేస్తున్నారు
ఆ మంత్రిని మినహా ఎవరినీ పట్టించుకోరా!?
అవును... సమన్వయం పెరగాలి : మంత్రి నారాయణ

 
విజయవాడ బ్యూరో : ‘ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రజలు టీడీపీని గెలిపించారు. ముఖ్యమంత్రి 18 గంటలు కష్టపడుతున్నారు. అయినా ఆరు నెలలుగా నగరానికి చేసిందేమీ లేదు. అధికారులు ఎక్కడికక్కడ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. అసలు మమ్మల్ని లెక్క చేసే పరిస్థితి లేదు. అధికారులు తీసుకుంటున్న బఫూన్ నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. జిల్లా మంత్రిగారికి చెబుతున్నా (దేవినేని ఉమాను ఉద్దేశించి) మీరే అధికారులతో మాట్లాడుకుని, మీరే నిర్ణయాలు తీసుకుంటే కుదరదు..’ అంటూ విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) అధికారులు, సొంత పార్టీకే చెందిన మంత్రిపై విరుచుకుపడ్డారు. ఆటోనగర్‌లో సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ శంకుస్థాపన సభ శుక్రవారం జరిగింది. ఈ సభలో ఎంపీ కేశినేని మాట్లాడుతూ మంత్రులు నారాయణ, దేవినేని ఉమాల సమక్షంలోనే పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నగరంలో పర్యటించి చూస్తే ఎక్కడి చెత్త  అక్కడే పేరుకుపోయి ఉందని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఇంతమందిమి ఏం చేస్తున్నామని నాని ప్రశ్నించారు.

సీఎం కాలువల సుందరీకరణ గురించి చెబితే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని, కృష్ణా నది, కాలువల్లోకి మురుగంతా చేరుతుంటే సుందరీకరణ ఎలా సాధ్యమని నిలదీశారు. రూ.8 కోట్లతో ఇప్పుడు శంకుస్థాపన చేసిన సీవేజీ ప్లాంట్ వల్ల కూడా  ఉపయోగం ఉండదని తేల్చిచెప్పారు. రాజకీయ నాయకులు, అధికారులకు మధ్య సమన్వయలోపం వల్ల ఎంత డబ్బు ఖర్చు చేసినా నగరం బాగుపడటంలేదని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం పనులు చేస్తే ఉపయోగం ఉండదని, నగరాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. తనకు తెలిసి ఏ అధికారి సరిగా పనిచేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరానికి సంబంధించి ఇప్పటివరకూ అధికారులు తీసుకున్న నిర్ణయాల్లో ఒక్క విషయంలోనూ తమతో సంప్రదించలేదని మండిపడ్డారు. ‘జిల్లా మంత్రి గారు అధికారులతో మాట్లాడుకుని, ఆయనే నిర్ణయాలు తీసుకుంటే ఎలాగని ప్రశ్నించిన ఆయన... ప్రజాప్రతినిధులను అన్నింటిలో భాగస్వాములను చేయాలి’ అని కేశినేని నాని సూచించారు. ప్రజలు తమకు ఓట్లేసి గెలిపించారని, వారికి తాము సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. అధికారులు ఇవాళ వస్తారు.. రేపు వెళ్తారని.. కానీ, తాము ఎప్పుడూ ఇక్కడ ఉండే వాళ్లమని చెప్పారు.
 సీపీ సొంత కీర్తి కోసం పనిచేస్తున్నారు

కాశ్మీర్, ముంబయి, ఢిల్లీలో కూడా లేనివిధంగా నగరంలో ‘నైట్ డామినేషన్’ పేరుతో పోలీస్ కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ నాని ఆరోపిం చారు. దీనివల్ల నగరానికి అంతర్జాతీయ క్రైం సిటీగా చెడ్డపేరు వస్తోందని, ఢిల్లీలో చాలామంది తనను దీని గురించి అడుగుతున్నారని చెప్పారు. సీపీ తన కీర్తి కోసం ఇవన్నీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరితో మాట్లాడి ఆయన ఇవన్నీ చేస్తున్నారని, ఆయనకు ముందు నగరంలో శాంతిభద్రతలు లేవా.. అని నిలదీశారు. అధికారులు తీసుకునే బఫూన్ చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సయోధ్య కుదర్చాల్సిన బాధ్యత జిల్లా మంత్రిపై ఉందని, అయితే ఆయన ఆ విధంగా వ్యవహరించడంలేదని నాని పేర్కొన్నారు. ఒక ఎంపీగా తాను ఇలా మాట్లాడుతున్నానంటే ఎంత ఆవేదనతో చెబుతున్నానో అర్థం చేసుకోవాలని కోరారు. సభలోనే ఉన్న మంత్రి నారాయణ స్పందిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం మరింత పెరగాల్సి ఉందని చెప్పారు.  
 
జిల్లా ఉమా జాగీర్ కాదు
 
‘జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జాగీరేం కాదు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమావేశాలకు ప్రజాప్రతినిధులను పిలవకుండానే ముగిస్తున్నారు. పార్టీ కోసం చంద్రబాబు సహా అందరూ కష్టడితేనే అధికారంలోకి వచ్చామని గుర్తుంచుకుని ఉమా తన తీరు మార్చుకోవాలి..’ అని శుక్రవారం విద్యాధరపురంలోని టీడీపీ ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు ఇంటికి విందుకు వచ్చిన ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు