డబుల్‌ లైన్‌కు పట్టాభిషేకం

9 Aug, 2019 11:04 IST|Sakshi
ఆకివీడు వద్ద కొత్తగా వేసిన ట్రాక్‌

నేటి నుంచి ప్రారంభం

ఆకివీడు నుంచి మోటూరు వరకూ పనులు పూర్తి  

ట్రయల్‌ రన్‌ కూడా సక్సెస్‌

సాక్షి, ఆకివీడు: ఇది ఎన్నాళ్లో వేచిన ఉదయం.. విజయవాడ–నరసాపురం బ్రాంచి మార్గంలో డబుల్‌ ట్రాక్‌ దశాబ్దాల కల.. అది ఈనాటికి సాకారమవుతోంది. తొలిదఫాగా ఆకివీడు– మోటూరు మధ్య డబుల్‌ ట్రాక్‌ పనులు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి రెండు పట్టాలపై రైళ్లు దౌడుతీయనున్నాయి. నరసాపురం– విజయవాడ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. ఈ మార్గంలో తొలిదఫాగా ఆకివీడు– మోటూరు మధ్య డబుల్‌ ట్రాక్‌ పనులు పూర్తయ్యాయి. ఆశించిన మేరకు నిధులు విడుదల కావడంతో పనులు వేగవంతంగా జరిగాయి. గురువారం ట్రయల్‌ రన్‌ విజయవంతంగా ముగిసింది. దీంతో శుక్రవారం నుంచి రైళ్లను రెండో లైన్‌పైనా నడిపించనున్నారు. దీంతో విజయవాడ నుంచి భీమవరం వైపు వచ్చే రైళ్లు రెండో ట్రాక్‌పైన, భీమవరం నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు పాత ట్రాక్‌పైనా వెళ్లనున్నాయి.  నరసాపురం మాజీ ఎంపీ కనుమూరు బాపిరాజుతోపాటు ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ డబుల్‌ లైన్‌ కోసం ప్రత్యేక కృషి చేశారు.

సందడే సందడి 
డబుల్‌ లైన్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుండడంతో 38కిలోమీటర్ల మార్గంలో ఉన్న రైల్వే స్టేషన్లలో సందడి వాతావరణం నెలకొంది. గురువారం ట్రయల్‌ రన్‌ను ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భారీగా తరలివచ్చి తిలకించారు.

8 దశాబ్దాల చరిత్రగల బ్రాంచి లైన్‌
నరసాపురం– విజయవాడ బ్రాంచి రైల్వే లైన్‌కు 8 దశాబ్దాల చరిత్ర ఉంది. బ్రిటిష్‌ కాలంలోనే విజయవాడ నుంచి నరసాపురం బ్రాంచి రైల్వేలైన్‌ ఏర్పడింది. సముద్ర తీరంలో ఉన్న నర్సాపురం ప్రాంతం నుంచి రైలు మార్గం కోసం బ్రాంచి లైన్‌ను మొదట మీటర్‌గేజ్‌గా నిర్మించారు. స్వాతంత్య్రానంతరం బ్రాడ్‌గేజ్‌గా అభివద్ధి చేశారు. అప్పటి నుంచి బ్రాంచి రైల్వే లైన్‌ అభివద్ధి అంగుళం కూడా కదల్లేదు. చెక్క స్లీపర్లపై పట్టాలను ఏర్పాటుచేసి రైళ్లు నడిపారు. దశాబ్దాలుగా బొగ్గు రైళ్లను ఈ ప్రాంతంలో నడిపారు. 1990లో బ్రాంచి రైల్వే లైన్‌లో డీజిల్‌ ఇంజిన్లతో రైళ్ళను నడిపారు. బ్రాంచి లైన్‌లో మొట్టమొదటిగా కాకినాడ–మద్రాసు సర్కార్‌ఎక్స్‌ప్రెస్‌ను నడిపారు. బొగ్గుతో నడిచే సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ లైన్‌లో కేవలం 20 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లేది. సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఈ ప్రాంతంలో కొంత చరిత్ర కూడా ఉంది. జై ఆంధ్ర ఉద్యమంలో ఉద్యమకారులు సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ చక్రాల్ని పీకేసి, పట్టాని కూడా ఊడబీకి, పక్కనే ఉన్న రైల్వే కొలిమిలో పారవేశారు.

కోస్తాలో బ్రాంచి రైల్వే లైన్లు
కోస్తా ప్రాంతాల్ని అభివద్ధి చేయడంలో భాగంగా 1936–38 ప్రాంతంలో విజయవాడ నుంచి ఆయా మార్గాలకు రైలు సౌకర్యాన్ని కల్పించారు. మొట్టమొదటిగా  విజయవాడు–నరసాపురం లైన్‌ నిర్మించారు.  ఆ తరువాత విజయవాడ–మచిలీపట్నం, విజయవాడ–గుడివాడ, భీమవరం–నిడదవోలు బ్రాంచి రైల్వే లైన్లను మీటర్‌ గేజ్‌లో ఏర్పాటు చేశారు.2013లో కేంద్ర ప్రభుత్వం బ్రాంచి రైల్వేలైన్ల ఆధునికీకరణకు రూ.1,850 కోట్లు కేటాయించింది.
నాలుగు విభాగాలుగా టెండర్లు
బ్రాంచి రైల్వే లైన్లు విద్యుదీకరణ, డబులింగ్‌ పనులను ముక్కలుగా విభజించి టెండర్లు పిలిచారు. మొదట్లో విజయవాడ–గుడివాడ, గుడివాడ–భీమవరం, భీమవరం–నిడదవోలు, విజయవాడ–మచిలీపట్నం, భీమవరం–నరసాపురం ప్రాంతాల అభివద్ధికి నిధులు కేటాయించి, టెండర్లు పిలిచారు. తొలుత విజయవాడ–గుడివాడ, గుడివాడ–నరసాపురం మధ్య పనులు మొదలుపెట్టారు. అయితే కాంట్రాక్టర్‌ కొంతమేర పనులు చేసి చేతులెత్తేయడంతో మళ్లీ పనులు స్తంభించిపోయాయి. ఆ తరువాత మళ్లీ టెండర్లు పిలవడంతో గుడివాడ–భీమవరం మధ్య నాగార్జున కనస్ట్రక్షన్‌ పనులు దక్కించుకుని వేగవంతం చేసింది.

హౌరాకు రైలు నడపాలి
బ్రాంచి రైల్వేలైన్‌ ఆధునికీకరణ చేయడంతో కొత్త రైళ్లు నడిపేందుకు అవకాశం ఉంది. వ్యాపారాభివృద్ధికి రైల్వే దోహదపడాలి. హౌరా, బెంగళూరు ప్రాంతాలకు కొత్త రైళ్లను నడపాలి. డబులింగ్, విద్యుదీకరణతో రైళ్ల వేగం పెరిగి, కొత్త రైళ్లు వచ్చే అవకాశం ఉంది. – సిహెచ్‌.నాగరాజు, ఆకివీడు

ఆనందదాయకం 
బ్రాంచి రైల్వే లైన్‌ అభివృద్ధిలో ఆకివీడు–మోటూరు వరకూ పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం జరగడం హర్షదాయకం.  ఈ ప్రాంతానికి చెందిన అప్పటి ఎంపీ కనుమూరి బాపిరాజు కృషి వల్ల డబులింగ్, విద్యుదీకరణ పనులకు నిధులు మంజూరయ్యాయి.  – నేరెళ్ల పెదబాబు, రైల్వే బోర్డు సభ్యుడు, ఆకివీడు

మరిన్ని వార్తలు