విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి తుళ్లూరు!

29 Dec, 2014 01:33 IST|Sakshi

విజయవాడ సిటీ: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోకి రాజధాని ప్రతిపాదిత ప్రాంతమైన తుళ్లూరు సబ్ డివిజన్‌ను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కమిషనరేట్ విస్తరణపై చర్చించేందుకు కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోంమంత్రి చినరాజప్ప, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బి.ప్రసాదరావు, రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు, నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొని కమిషనరేట్ స్వరూప స్వభావాలపై చర్చించారు.
 
 ఆదివారం నగరానికి వచ్చిన డీజీపీ కూడా సీపీతోపాటు గుంటూరు జిల్లా పోలీసు అధికారులతో మరోసారి ఈ విషయంపై ప్రత్యేకంగా మాట్లాడారు. రాజధాని ఏర్పాటు నేపథ్యంలో తుళ్లూరు ప్రాంతాన్ని విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో కలపాల్సిన ఆవశ్యకతపై ఇక్కడి అధికారులు గతంలోనే నివేదిక ఇచ్చారు. కమిషనరేట్ పరిధితోపాటు పోలీసుల సంఖ్య పెంపు, వాహనాలు, ఆయుధాలు, ఇతర విభాగాల ఏర్పాటు తదితర అంశాలపై తయారుచేసిన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. మరోవైపు తుళ్లూరు గుంటూరు జిల్లాలో ఉన్నందున గుంటూరు కేంద్రంగా పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుచేయాలని అక్కడి అధికారులు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రెండు నివేదికలను పరిగణనలోకి తీసుకొని సోమవారం నగర పోలీసు కమిషనరేట్‌లో జరిగే సమావేశంలో డీజీపీ రాముడు విధానపరమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. తుళ్లూరు ప్రాంతాన్ని నగర పోలీసు కమిషనరేట్‌లో విలీనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
 రెండు ప్రతిపాదనలు...
 రాజధాని ప్రతిపాదిత ప్రాంతం గుంటూరు జిల్లాలో ఉంది. ఆ ప్రాంతం విజయవాడకు సమీపంలో ఉంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రభుత్వం ముందుకు రెండు ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు సమాచారం. నగర పోలీసు కమిషనరేట్ పరిధి విస్తరణలో భాగంగా తుళ్లూరు ప్రాంతాన్ని కలపడం వాటిలో మొదటిది. గుంటూరును సైబరాబాద్ కమిషనరేట్ తరహాలో విస్తరించడం రెండో ప్రతిపాదన. హైదరాబాద్ కమిషనరేట్‌లో రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా పలువురు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది.
 

మరిన్ని వార్తలు