రాజయోగం

13 Aug, 2014 03:17 IST|Sakshi

 విజయవాడ : నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో వేసిన పునాది రాయి నేడు ఆంధ్ర రాజధాని ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. గన్నవరం ప్రాంత అభివృద్ధి కోసం 2006లో కేసరపల్లి వద్ద ఐటీ పార్కు(మేధ) నిర్మాణానికి వైఎస్ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి గన్నవరం ప్రాంతం దశ తిరిగింది. బీడు భూములు బంగారు గనులుగా మారాయి.

 ఇప్పుడు తాత్కాలిక రాజధాని విజయవాడలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎయిర్‌పోర్టు ఎదురుగా ఉన్న మేధా టవర్‌లో రాష్ట్రస్థాయి కార్యాలయాలు కొన్ని కొలువుదీరనున్నాయి. ఇప్పటికే జిల్లా అధికారులు ఆయా కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రస్థాయి కార్యాలయాలు  ఐటీ పార్కులో ఖాళీగా ఉన్న టవర్లలో ఏర్పాటుచేయడం వల్ల గన్నవరం ప్రాంతానికి మహర్దశ పట్టనుంది.

దీంతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఐటీ పార్కుకు వేసిన పునాదిరాయితో గన్నవరం ప్రాంతం దినదినాభివృద్ధి చెందిందని ప్రజలు ఆయన్ను స్మరించుకుంటున్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన సెంట్రల్ జైలు నిర్మాణాన్ని నిలిపివేసి వైఎస్ ఐటీపార్కు నిర్మించారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఐటీ పార్కు వల్ల వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని శంకుస్థాపన సమయంలో వైఎస్సార్ చెప్పారని,  ఆయన మాటలు నిజమవుతున్నాయని హర్షం వ్యక్తంచేస్తున్నారు.

 బంగారు గనులుగా గన్నవరం భూములు  
 ఐటీ పార్కు ఏర్పాటుకు ముందు గన్నవరం ప్రాంతంలో భూములు తొండ గుడ్లు పెట్టేందుకు కూడా పనికిరాకుండా మరుగున పడి ఉండేవి. అయితే 2006 నుంచి భూముల విలువలు అమాంతం పెరిగాయి. గన్నవరం, కేసరపల్లి, సావారిగూడెం, కొండపావులూరు, గోపవరపుగూడెం, ముస్తాబాద, సూరంపల్లి గ్రామాల్లో భూముల ధరలు వంద రెట్లు పెరిగాయి. గన్నవరం నుంచి హనుమాన్‌జంక్షన్ వరకు భూముల ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో సన్న, చిన్నకారు రైతులు తమ పొలాలను, స్థలాలను అధిక రే ట్లకు విక్రయించి అప్పుల ఊబి నుంచి బయటపడ్డామని సంబరపడుతున్నారు.

>
మరిన్ని వార్తలు