జిల్లాకూ మహర్దశ

5 Sep, 2014 01:23 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: విజయవాడ పరిసరాల్లో కొత్త రాజధాని ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం తో సరిహద్దునే ఉన్న గుంటూరు జిల్లాకు మహర్దశ పట్టనుంది. రెండు నెలల క్రితమే ఎయిమ్స్, జాతీయ విపత్తు నివారణ సంస్థలను మంగళగిరిలో, వ్యవసాయ యూనివర్సిటీని గుంటూరు సమీపంలోని లాంలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
 
 కొత్తగా ఎయిర్‌పోర్టు, మెట్రోరైలు, టెక్స్‌టైల్ పార్కు, టూరిజం సర్క్యూట్ వంటి మరి కొన్నింటిని ప్రకటించింది. - వీటికితోడు విజయవాడ-గుంటూరు మధ్య అనేక రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన స్థలాలు, భవనాలు ఉన్నాయని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపింది.
 
 అరగంటలో రాజధానికి చేరుకోవడానికి 16వ నంబరు జాతీయ రహదారి, రైలు మార్గం ఉండటంతో గుంటూరు సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు.
 అభివృద్ధిని వికేంద్రీకరించడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా గుంటూరులోనూ అనేక ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు రూపొందిం చినట్టు చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు.
 
 ముఖ్యంగా తీర ప్రాంతంలో ఆక్వా, మెట్టప్రాంతాల్లో వాణిజ్య పంటల సాగుకు అనువైన పరిస్థితులు ఉండటంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫుడ్‌పార్కులు ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు.
 
 ఇప్పటికే ప్రకటించిన ఎయిమ్స్‌ను మంగళగిరికి సమీపంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభయ్యాయి. దీనికోసం రాష్ట్ర  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తోపాటు ఉన్నతాధికారులు మంగళగిరి టీబీ శానిటోరియం స్థలాన్ని పరిశీలించి అక్కడి పరిస్థితుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
 
 రూ.1500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్ లో వంద సీట్లతో మెడికల్ కళాశాల, 500 పడకల ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల, పలు పరిశోధనా కేంద్రాలు ఉంటాయి. 200 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. అలాగే జాతీయ ప్రకృతి విపత్తుల దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఏర్పాటుకు ఇప్పటికే శానిటోరియంలో 50 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.
 గుంటూరుకు సమీపంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉన్న లాంఫారం పక్కనే 500 ఎకరాల్లో వ్యవసాయ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించి, రూ.100 కోట్లు కేటాయించింది.     
 
 మెట్రోరైలుకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారీ బాధ్యతలను వీజీటీఎం ఉడా నెల రోజుల క్రితమే చేపట్టింది. ఉడా పరిధిలో రైలు మార్గానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని  కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థకు నివేదికను కూడా పంపినట్టు చెబు తున్నారు.
 
  అదే విధంగా 50 కిలోమీటర్ల రేడియస్ సర్కిల్‌లో కృష్ణా, గుం టూరు జిల్లాల్లోని వివిధ గ్రామాల మీదుగా అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ రింగ్ రోడ్డు పరిధిలో విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి ప్రాంతాలు ఉంటాయి.
 కొత్తగా ప్రకటించిన ఎయిర్ పోర్టు, టూరిజం సర్క్యూట్‌లతోపాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అనుకూలంగా ఉండటంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫుడ్‌పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
 
 రేపల్లె, నిజాంపట్నంలో ఆక్వాసాగు, మెట్ట ప్రాంతాల్లో పత్తి, పొగాకు, పసుపు వంటి వాణిజ్య పంటల సాగుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.    అధిక విస్తీర్ణంలో పత్తి సాగుతో పాటు అనేక స్పిన్నింగ్ మిల్లులు ఉండటంతో టెక్స్ టైల్‌పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.ప్రభుత్వం ప్రకటించినవన్నీ కార్యరూపం దాల్చితే అభివృద్ధిలో గుంటూరు రాజధానితో పోటీ పడే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక రంగనిపుణులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు