విజయవాడ టూ ఒంగోలు.. వయా గుంటూరు

5 Nov, 2014 02:20 IST|Sakshi

ఒంగోలు క్రైం : ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ఇద్దరిని ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఒంగోలు డీఎస్పీ పి.జాషువా మంగళవారం తన కార్యాలయంలో వన్‌టౌన్ సీఐ కె.వెంకటేశ్వరరావు, ఎస్సై ఎస్‌కే నాయబ్స్రూల్‌తో కలిసి విలేకరులకు వెల్లడించారు.

డీఎస్పీ కథనం ప్రకారం.. ఒంగోలు గంటాపాలేనికి చెందిన పాండ్రంటి గిరిబాబు స్థానిక గాంధీరోడ్డులో బంగారం పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఆయన్ను హత్య చేసేందుకు విజయవాడకు చెందిన అల్లు మురళీ, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన కూనంరెడ్డి పవన్‌కుమార్‌లు పథకం రచించారు. మురళీ కూడా గిరిబాబుతో పాటు బంగారం పని చేస్తూ ఉండేవాడు. ఈ వృత్తి వల్లే ఇద్దరికీ పరిచయమైంది.

ఒంగోలుకు చెందిన పద్మ అనే యువతిని మురళీకిచ్చి గిరిబాబు వివాహం జరిపించాడు. ఈ పరిచయంతో విజయవాడ వెళ్లినప్పుడల్లా గిరిబాబు తరచూ మురళీ ఇంటికి వెళ్లేవాడు. అక్కడ ఆయన భార్య పద్మతో చనువుగా ఉండేవాడు. ఇది నచ్చని మురళీ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. గిరిబాబును హత్య చేయించేందుకు డి గ్రీ మూడో సంవత్సరం చదువుతున్న కూనంరెడ్డి పవన్‌కుమార్‌తో రూ. 2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అందులో భాగంగా తొలివిడతగా రూ. 30 వేలు అడ్వాన్సు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో మురళీ, గిరిబాబు కొంతకాలం విడిపోయి ఆరు నెలల కిందట తిరిగి దగ్గరయ్యారు. ఎలాగైనా గిరిబాబును మట్టుబెట్టాలని మురళీ మళ్లీ నిర్ణయించుకున్నాడు. బంగారం పనిలో వాడే సైనైడ్ ఇంజెక్షన్ ఎక్కించి అంతమొందించాలనుకున్నాడు. అతడు గమనిస్తాడేమోనని అనుమానించి టూత్‌పేస్ట్‌లో సైనైడ్ ఎక్కించాడు. పేస్టు రంగు మారటంతో దానితో నోరు శుభ్రం చేసుకోకుండా గిరిబాబు పక్కనబెట్టాడు. అంతటితో వారి పథకం బెడిసి కొట్టింది.

ఇదంతా పాత కథ..
 ఇదీ.. తాజాగా జరిగింది
 పవన్‌కుమార్ సోమవారం ఒంగోలు వచ్చి స్థానిక 60 అడుగుల రోడ్డులోని సాయి లాడ్జిలో మకాం వేశాడు. గంటాపాలెం గిరిబాబు ఇంటి సమీపంలో రెండుమూడు సార్లు అనుమానాస్పదంగా తిరిగాడు. దీంతో అక్కడి బడ్డీకొట్టు నిర్వాహకునికి అనుమానం వచ్చిచి గిరిబాబుకు సమాచారం అందించాడు. ఆయన వెంటనే వన్‌టౌన్ ఎస్సై ఎస్‌కే నాయబ్స్రూల్‌కు ఫిర్యాదు చేశాడు.

ఎస్సై తన సిబ్బందితో రంగంలోకి దిగి పవన్‌కుమార్‌ను అదుపులోకి తీసున్నారు. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని మురళీని కూడా ఎస్సై ఆధ్వర్యంలోని బృందం మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకొని ఒంగోలు తెచ్చింది. నిందితులను అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపరచనున్నారు. వారి నుంచి సైనైడ్ ప్యాకెట్, సిరంజి, గ్లౌజులు స్వాధీనం చేసుకున్నారు. కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన వన్‌టౌన్ పోలీసులను డీఎస్పీ జాషువా అభినందించారు.

మరిన్ని వార్తలు