‘అరకు రైలుకు మరిన్ని విస్టాడోమ్‌ కోచ్‌లు కావాలి’

18 Mar, 2020 14:04 IST|Sakshi

రాజ్యసభలో రైల్వే మంత్రికి  ఎంపీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ : విశాఖపట్నం-అరకులోయ మధ్య నడిచే పర్యాటక రైలుకు అదనంగా ఐదు విస్టాడోమ్‌ కోచ్‌లను ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వేమంత్రికి విజ్ఞప్తి చేశారు.  రాజ్యసభలో బుధవారం ప్రత్యేక ప్రస్తావన (స్పెషల్‌ మెన్షన్‌) ద్వారా ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. బీచ్‌లు, గుహలు, జలపాతాలు, ఘాట్‌లతో విశాఖపట్నం జిల్లా పర్యాటకుల స్వర్గధామంగా విరాజిల్లుతోందని అన్నారు. ‘తూర్పు కోస్తాకు మణిహారంగా విశాఖ జిల్లా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో పర్యాటకానికి విశేష ఆకర్షణగా నిలిచిన వాటిలో విస్టాడోమ్‌ కోచ్‌ ఒకటి. ప్రస్తుతం పర్యాటక రైలుగా పరిగణించే విశాఖపట్నం-అరకు లోయ రైలుకు అనుసంధానించిన ఈ విస్టాడోమ్‌ కోచ్‌లో ప్రయాణం పట్ల పర్యాటకులు అమితమైన ఆసక్తి చూపుతున్నారు​’ ఆయన అన్నారు.

తూర్పు కనుమల్లో విస్తరించిన సువిశాలమైన ఆకుపచ్చని అడవులు, లోయలు, టన్నెల్స్‌ వంటి ప్రకృతి దృశ్యాలను పర్యాటకులు నిలువెత్తు అద్దాల గుండా నలుదిక్కులా వీక్షించే విధంగా ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన విస్టాడోమ్‌ కోచ్‌ ప్రారంభించిన రోజు నుంచే పర్యాటకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నట్లు ఆయన చెప్పారు. అమిత ప్రజాదరణ పొందిన విస్టాడోమ్‌ కోచ్‌కు అనూహ్యమైన డిమాండ్‌ ఏర్పడినప్పటికీ రైలులో కేవలం ఒకే ఒక కోచ్‌ అందుబాటులో ఉండటం పర్యాటకులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని అన్నారు.

‘విస్టాడోమ్‌ కోచ్‌లో ప్రయాణానికి టిక్కెట్ల కోసం ప్రతి రోజు సుదీర్ఘమైన వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంటోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం-అరకులోయ  రైలుకు కనీసం మరో అయిదు విస్టాడోమ్‌ కోచ్‌లను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసి పర్యాటకుల అవసరాన్ని తీర్చాలి. అదనంగా ఏర్పాటు చేసే విస్టాడోమ్‌ కోచ్‌ల వలన విశాఖపట్నంలో పర్యాటక రంగానికి మరింత ఊపు ఇచ్చినట్లువుతుంది. అలాగే రైల్వేలకు కూడా దండిగా ఆదాయం లభిస్తుంది’ అని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ కారణాల దృష్ట్యా అరకు రైలుకు  అదనంగా అయిదు విస్టాడోమ్‌ కోచ్‌ల ఏర్పాటు కోసం తగిన చర్యలు చేపట్టవలసిందిగా రైల్వే మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు