'కరోనా' కదన రంగంలోకి వలంటీర్లు

11 Mar, 2020 04:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించే బాధ్యతలు వారికే

వ్యాధి లక్షణాలున్న వారి కోసం 428 ప్రత్యేక పడకలు

రాష్ట్రంలో ఇప్పటివరకు 43 నమూనాల పరిశీలన

36 మందికి వైరస్‌ లేదని తేల్చిన యంత్రాంగం

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ఇకపై గ్రామ, పట్టణ వలంటీర్లు రంగంలోకి దిగనున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను గ్రామ వలంటీర్ల ద్వారా సేకరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ, పట్టణ వలంటీరు ఉంటారు కాబట్టి విదేశాల నుంచి ఆయా గ్రామాలకు వచ్చిన వారిని తేలిగ్గా గుర్తించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 10 తర్వాత విదేశాలకు వెళ్లి వచ్చిన వారుగానీ, లేదా అంతకుముందే వెళ్లి ఫిబ్రవరి 10 తర్వాత ఇక్కడకు వచ్చిన వారి వివరాలుగానీ సేకరించి వైద్య ఆరోగ్యశాఖకు ఇవ్వాలని ఆదేశించారు. 

ఎన్నికల నుంచి ఆరోగ్యశాఖ సిబ్బందికి మినహాయింపు
రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. వార్డు, గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఏఎన్‌ఎంలకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా. కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వీరిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని.. అలా తీసుకుంటే కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి చేపడుతున్న చర్యలకు అవరోధం ఏర్పడుతుందని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 43 మంది అనుమానితులకు వైద్య పరీక్షలకు నిర్వహించగా, 36 మందికి లేదని తేలింది. మిగిలిన ఏడుగురి ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా వైరస్‌ లక్షణాలున్న వారి కోసం 428 ప్రత్యేక పడకలు, 55 వెంటిలేటర్లు ఏర్పాటుచేశారు. 

నెల్లూరు యువకుడికి కరోనా? 
నెల్లూరుకు చెందిన ఓ యువకుడికి కరోనా(కోవిడ్‌–19) వైరస్‌ సోకినట్టుగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఇటలీలోని మిలాన్‌లో ఇంజనీరింగ్‌ చదువుతున్న 22 ఏళ్ల యువకుడు ఈ నెల 6న చెన్నై మీదుగా స్వస్థలం నెల్లూరుకు వచ్చాడు. తీవ్రమైన జ్వరం, దగ్గుతో బాధపడుతుండటంతో వైద్య అధికారులు ఈ నెల 7న నెల్లూరులోని బోధనాసుపత్రిలో రక్త నమూనాలు సేకరించి తిరుపతికి పంపారు. ప్రాథమికంగా పాజిటివ్‌ (‘ప్రిజమ్‌టీవ్‌ పాజిటివ్‌) అని వచ్చింది. దీంతో తదుపరి పరీక్షల కోసం రక్త నమూనాలను పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం ఆ యువకుడు నెల్లూరు బోధనాసుపత్రిలోని ఐసొలేటెడ్‌ వార్డులో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఇటలీ నుంచి వచ్చిన వారు ఇంటి వద్దే 14 రోజులపాటు ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌ జవహర్‌రెడ్డి ఓ ప్రకటనలో సూచించారు.  

మరిన్ని వార్తలు