పల్లె నుంచి పరీక్షల అధికారి వరకూ..

22 Jun, 2019 09:45 IST|Sakshi

రాష్ట్ర విద్యాశాఖ జాయింట్‌  డైరెక్టర్‌ సుబ్బారెడ్డి ప్రస్తానమిది..

సాక్షి, కడప ఎడ్యుకేషన్‌: మనసుండాలే గాని మార్గముంటుందంటారు. చదువుకోవాలనే ధ్యాస ఆ వ్యక్తిని ఉన్నతాధికారి స్థాయికి తీసుకెళ్లంది. మన జిల్లాలోని వల్లూరు మండలం గంగాయపల్లెలో ఓ రైతు ఇంట జన్మించి బడి ముఖమే చూడకుండా 1 నుంచి 5 వరకు ఓ ప్రైవేటు వ్యక్తి వద్ద చదివారు. తరువాత 6 నుంచి ప్రభుత్వ స్కూలులో చదివారు. ఆయనెవరో కాదు. మన రాష్ట్ర విద్యాశాఖ జాయింట్‌  డైరెక్టర్‌ సుబ్బారెడ్డి. టెట్, సర్వశిక్ష అభియాన్‌ బోర్డులకు కూడా సేవలందిస్తున్నారు. సుబ్బారెడ్డి గంగాయపల్లె గ్రామంలోని ఓ ప్రైవేటు వ్యక్తి వద్ద ప్రాథమిక విద్య నేర్చుకున్నారు. చదువుపై ఆది నుంచి ఆసక్తి చూపేవరు.6 నుంచి 10వ తరగతి వరకు గంగాయపల్లె జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదివారు.

కడపలోని రామక్రిష్ణా జూనియర్‌ కళాశాలో, డిగ్రీని కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో పీజీని శ్రీక్రిష్ణదేవరాయ యూనివర్సీటీ పూర్తి చేశారు. ఈయన 2000లో విద్యను పూర్తి చేసి  మొట్టమొదటి సారిగా సెకండ్‌గ్రేడ్‌ టీచర్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తరువాత డీఎస్సీ రాసి 2001లో స్కూల్‌ అసిస్టెంట్‌ ఎంపికైయ్యారు.  2007లో జేఎల్‌ పరీక్షను రాసి జూనియర్‌ లెక్చరర్‌గా ఎంపికయ్యారు. 2008లో ఏపీపీఎస్సీ పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకును సాధించారు. డిప్యూటీ డీఈఓగా ఎంపికయ్యారు. సొంత జల్లా అయిన కడపకు వచ్చారు. అనంతరం 2012లో డీఈఓగా పదోన్నతిపై హైదరాబాదకు వెళ్లారు. తరువాత రాçష్ట్రం విడిపోవడంతో కృష్ణా జిల్లా డీఈఓగా బదిలీపై  వచ్చారు.

తరువాత విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది విద్యాశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు.  దీంతోపాటు 2018 నుంచి ప్రభుత్వ పరీక్షల జాయింట్‌ డైరెక్టర్‌గా,  సర్వశిక్ష అభియాన్‌ బోర్డు డైరెక్టర్‌గా కూడా సేవలందిస్తున్నారు. సుబ్బారెడ్డి తల్లితండ్రులు బాలిరెడ్డి, సుబ్బమ్మలది వ్యవసాయ కుటుంబం.

విద్యాశాఖలో మార్పులు
సుబ్బారెడ్డి ప్రభుత్వ పరీక్షల రాష్ట్ర ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విద్యాశాఖలో పలు సమూల మార్పులు తెచ్చారు. పదవ తరగతి విద్యార్థులకు మార్కుల జాబితాను ఫలితాలు వెలువడిన వెంటనే ఆన్‌లైన్‌ పెట్టించేలా చర్యలు తీసుకున్నారు.  పదవ తరగతి విద్యార్థులకు ఇంటర్నల్‌ మార్కులను ఎత్తివేయించడంలో కీలక భూమిక పోషించారు. గతంలో విద్యార్థి హాల్‌టికెట్‌ నెంబరు కొడితే కేవలం వ్యక్తిగత మార్చులు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు స్కూల్‌ కోడ్‌ కొట్టగానే విద్యార్థులకు సంబంధించిన అందరి ఫలితాలు ఒకేసారి వస్తాయి. ఇదీ ఆయన కృషేనని చెప్పాలి.

రాష్ట్రవ్యాప్తంగా 12 రకాల స్కూల్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన 11,890 స్కూల్స్‌ గుర్తింపుతోపాటు అడిషి నల్‌ తరగతుల వివరాలను అన్‌లైన్‌లో నమోదు చేయించారు. ప్రైవేటు పాఠశాలల గుర్తిం పు వివరాలను కూడా ఆన్‌లైన్‌లో పెట్టించారు. పదవ తరగతి విద్యార్థులకు సం బంధించిన నామినల్‌ రోల్స్‌ను కూడా జూన్‌లోనే ఆన్‌లైన్‌ చేస్తున్నారు.  గతంలో నవంబర్‌ నెలలో నామినల్‌ రోల్స్‌ను అన్‌లైన్‌ చేసేవారు. ఆలాంటిది ఇప్పడు జూన్‌లోనే చేయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మహిళలు ఆర్థిక స్వావలంబనకు కుట్లు, అల్లికలు, మ్యూజిక్‌ వంటి వృత్తి విద్యా కోర్సలను సంబంధించిన శిక్షణా కేంద్రాన్ని కడపలో ఏర్పాటు చేయించారు.  

మరిన్ని వార్తలు