గ్రామ స్థాయిలో అమలుకు నోచని ‘విలేజ్ పోలీస్’

19 Sep, 2013 03:15 IST|Sakshi
గ్రామ స్థాయిలో శాంతిభద్రతల పర్యవేక్షణ, పరిరక్షణ తప్పనిసరనే మేధావుల సూచనలు జిల్లాస్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదు. స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే గ్రామాల్లోకి వెళుతున్నారు. అంగ, అర్థబలం ఉన్న వారు చెప్పిందే శాసనంగా నడిచే  గ్రామాలు జిల్లాలో వందకు పైగా ఉన్నాయని స్వయంగా పోలీసువర్గాలే చెబుతుండటం గమనార్హం. పెదకూరపాడు, తాడికొండ, తెనాలి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఇప్పటికీ కొందరు మోతుబరి ఆసాములు జమీందారీ తరహా వ్యవస్థను నడిపిస్తున్నారు. ఇక పల్నాడులో ఫ్యాక్షన్‌గ్రామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో గ్రామానికో పోలీసు విధులు నిర్వహించగలిగితే బాధితులకు రక్షణగా నిలవచ్చు. కానీ జిల్లాలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
 
 గుంటూరు, న్యూస్‌లైన్ : గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు సేవలు క్షేత్రస్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘విలేజ్ పోలీసు’ విధానం రికార్డులకే పరిమితమైంది. గ్రామ రాజకీయాలు పోలీసు వ్యవస్థను సైతం శాసిస్తాయని చెప్పడానికి ఇంతకంటే  నిదర్శనమే అవసరం లేదు.  క్షేత్రస్థాయిలో పోలీసు సేవలు ప్రజలకు అందుబాటులోకి రావాలంటే ప్రతి గ్రామానికి స్థాయిని బట్టి ఒకరు లేక ఇద్దరు చొప్పున కానిస్టేబుళ్లను కేటాయిస్తారు. ఆ గ్రామాలను కానిస్టేబుళ్లు దత్తత తీసుకుని అక్కడ జరుగుతున్న వ్యవహారాలను పై అధికారులకు తెలియజేస్తుండాలి. వీరి నేతృత్వంలో ఆ గ్రామాల్లో  పరిస్థితిని పూర్తిస్థాయిలో చక్కబెట్టేందుకు అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఆ కానిస్టేబుల్‌కు పూర్తి అవగాహన కలిగి వుండడం వల్ల  సమస్య తక్షణం పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది.
 
 జరుగుతుందిలా.. గ్రామస్థాయిలో కీలకమైన ఈ ‘విలేజ్ పోలీసు’ విధానంతో రాజకీయపెత్తనం తగ్గే ప్రమాదం ఉండటంతో ఆయా సామాజిక వర్గాలకు చెందిన కానిస్టేబుళ్లనే కేటాయించాలనే ఒత్తిళ్ళు రావడం, కొన్ని స్టేషన్లలో సిబ్బంది కొరత ఉండటంతో విలేజ్ పోలీసు వ్యవస్థకు తూట్లుపడ్డాయి. స్టేషన్ల పరిధిలోని ఐడీ పార్టీ, కోర్టు విధులు, నాయకులు వద్ద ప్రొటోకాల్ కోసం, కొన్ని కేసుల్లో రికవరీలకు వెళ్లేందుకు అలవాటుపడిన కొంతమంది కానిస్టేబుళ్లు కూడా విలేజ్ పోలీసుగా బాధ్యతలు తీసుకుంటే ఆ గ్రామాలకు పరిమితం కావాల్సి వస్తుందని వెనుకాడుతున్నారు.  రికార్డుల్లో మాత్రం ఆయా గ్రామాలకు పూర్తి బాధ్యత మీదేనంటూ  కానిస్టేబుళ్ల పేర్లు నమోదు చేశారు.
 
 గ్రామాల్లో పట్టు కోల్పోతున్న పోలీస్..
 సిబ్బంది కొరత... పనిభారంతో గ్రామాల్లో పోలీసు పట్టు సడలుతున్నట్టు కొన్ని సంఘటనలు చెబుతున్నాయి. పిడుగురాళ్ల పరిధిలో కొందరు ఆగంతకులు  వృద్ధులు, మహిళలను దోచుకుంటున్నా మూడు నెలల తరువాత పోలీసులకు తెలిసింది. స్టూవర్టుపురం గ్రామంలో ఇటీవల తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని రెండు చోట్ల ర్యాపులు కొనసాగించినప్పటికీ పోలీసులకు 15రోజుల తరువాత తెలియడంతో బాధితులు నష్టపోయారు. అర్బన్ పరిధిలో ట్రావెల్స్ నిర్వహకుడుని కిడ్నాప్ చేసి రెండు రోజులు పాటు శ్రీశైలం, మాచర్లలో తిప్పుకుంటూ తీవ్రంగా కొట్టారు. అతనిని హత్య చేయకుండా ఉండేందుకు నగదు ఇవ్వాలని డిమాండ్ చేసి, నగదు ఇచ్చిన తరువాత బాధితుడిని వదిలిపెట్టారు. బాధితుడు చికిత్సకు వెళ్లిన తరువాతే ఈ  సంఘటన పోలీసుల దృష్టికి వెళ్లింది. ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్టవేయాలంటే విలేజ్ పోలీస్ తప్పని సరనే వాదన ఆ వర్గాల నుంచే వినిపిస్తోంది.
 
మరిన్ని వార్తలు