ఆ కలెక్టర్‌ పేరుతోనే వెలిసిన శ్రీహరిపురం ఊరు

15 Mar, 2020 12:09 IST|Sakshi
జీవీఎంసీ 58వ వార్డు వ్యూ 

నాటి కలెక్టర్‌ శ్రీహరిరావుపేరుతో..  

నాడు 50 కుటుంబాలే నివాసం.. నేడు 20 వేల మంది ఓటర్లు 

సాక్షి, ములగాడ (మల్కాపురం): కలెక్టర్‌ పేరు మీద వెలిసిన ఓ గ్రామం ఇప్పుడు దినదినాభివృద్ధి సాధిస్తూ జీవీఎంసీ 58వ వార్డుకు తలమానికంగా మారింది. 1909లో గుల్లలపాలెం ఏర్పడింది. గ్రామం ఏర్పడిన నాటికి కేవలం 50 కుటుంబాలు మాత్రమే ఇక్కడుండేవి. కాలక్రమంలో ఒకొక్క గ్రామం ఇక్కడ వెలిసింది. 1963–67 సంవ్సరంలో అప్పటి కలెక్టర్‌ శ్రీహరిరావు సింధియా నుంచి జింక్‌ వరకూ గల మట్టి రోడ్డును తారు రోడ్డుగా అభివృద్ధి చేశారు.

అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామస్తులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో కలెక్టర్‌ శ్రీహరిరావు ఈ ప్రాంతీయులకు ఆత్మీయుడయ్యారు. దీంతో కలెక్టర్‌ శ్రీహరిరాజు పేరుతో శ్రీహరిపురం అని గ్రామానికి పేరు పెట్టారు. గుల్లలపాలెం, శ్రీహరిపురం, శ్రీనివాసనగర్, రాంనగర్, కోడిపందాల దిబ్బ, ఎదురవానిపాలెం, ములగాడ, పిలకవానిపాలెం, గొందేశిపాలెం ఇప్పుడు జీవీఎంసీ 58వ వార్డులో ఉన్నాయి. జీవీఎంసీ 58వ వార్డుకు ప్రధాన ప్రాంతం శ్రీహరిపురమే.
 
కాలుష్య సమస్యకు కారణమవుతున్న అలూఫ్లోరైడ్‌ పరిశ్రమ

1983లో వార్డుగా... 
అప్పటి వరకూ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం 1983లో వార్డుగా రూపాంతరం చెందింది. అప్పుడు 46వ వార్డుగా గుర్తించారు. 2020లో ఆ వార్డు కాస్తా 58వ వార్డుగా మారింది. 46వ వార్డులో ఉన్నప్పుడు ఓటర్లు 12 వేల మంది ఉన్నారు. ప్రస్తుతం 17 వేల మంది ఓటర్లు ఉండగా..జనభా 20 వేలకుపైగా ఉంది. 

వార్డులో ప్రధాన సమస్యలు  
వార్డులో కోరమండల్, అలూఫ్లోరైడ్‌ వంటి పరిశ్రమలు ఉన్నాయి. ఆయా పరిశ్రమల నుంచే వచ్చే కాలుష్యంతో ములగాడ, గుల్లలపాలెం, కోడిపందాల దిబ్బ, ఎదురవానిపాలెం, ములగాడ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. అలాగే ఈ గ్రామాల్లో చాలా మంది యువత నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ప్రధాన గెడ్డలు ఆక్రమణకు గురి కావడంతో దిగువ ప్రాంత గ్రామాలు వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయి.

మరిన్ని వార్తలు