ఉద్యోగదాత జగనన్నకు రుణపడి ఉంటాం..

2 Oct, 2019 13:07 IST|Sakshi

సాక్షి, కాకినాడ: ‘తండ్రి విద్యనందిస్తే...తనయుడు ఉద్యోగం అందించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది అలాంటి ఉద్యోగదాత జగనన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ద్వారా నాకు ఓ బంగారు భవిష్యత్‌ను అందించారని’ విలేజ్‌ సర్వేయర్‌గా ఎంపికైన విజయదుర్గ తెలిపింది. 

తూర్పు గోదావరి జిల్లా కరప గ్రామంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయదుర్గ మాట్లాడుతూ..‘మా నాన్నగారు సామాన్య ఆటో డ్రైవర్‌. నేను రెండో తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ ఆస్తమా పేషెంట్‌ అయినా... ఆమె మందుల ఖర్చును పక్కనపెట్టి మా చదువుల కోసం వెచ్చించి పదో తరగతి వరకూ చదివించింది. ఇక పై చదువులు చదవలేనని అనుకుంటున్న సమయంలో... మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. తండ్రిగారు విద్యనందిస్తే...తనయుడు ఉద్యోగం అందించారు. ఎల్లప్పుడూ రుణపడి ఉంటా’ అని పేర్కొంది.

నన్ను ఉద్యోగవంతుడిని చేశారు..
మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంలో తాము భాగస్వామ్యులు కావడం ఆనందంగా ఉందని... గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతిరహిత పాలనను అందించేలా తమ వంతు కృషి చేస్తామని వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌గా ఎంపికైన సాయి మణికంఠ తెలిపాడు. ‘తండ్రి విద్యకు సహకారం అందించి విద్యావంతుడ్ని చేస్తే... ఆయన తనయుడు జగనన‍్న సచివాలయ ఉద్యోగం ఇచ్చి... ఉద్యోగవంతుడిని చేశారు. దేశ, రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే ఇన్నివేల ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగులంతా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాం.

తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 13వేలమందిమి ఎంపిక అయ్యాం. గత మూడేళ్లుగా పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నా. లక్షల ఉద్యోగాలను ఎంతో పారదర్శకంగా చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదే. ఆయన ‘చెప్పిందే చేస్తాను... చేసేదే చెబుతాను’ అంటూ... మేనిఫెస్టోనే భగవద్దీత, ఖురాన్‌, బైబిల్‌గా పేర్కొన్నారు. ‘నేను విన్నాను...నేను ఉన్నాను’ అని వైఎస్‌ జగన్‌ ఎలా చెప్పారో..అలాగే సచివాలయ ఉద్యోగులుగా మేము కూడా అలానే పని చేస్తాం.’ అని మణికంఠ స్పష్టం చేశాడు.

నా బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తా..
డిజిటల్‌ అసిస్టెంట్‌ మంగాదేవి మాట్లాడుతూ...మా నాన్నగారు సాధారణ రైతు. మేం నలుగురు సంతాపం. చెల్లి, ఇద్దరు తమ్ముళ్లు. మా నాన్నగారు చదవించే స్థాయిలో లేనప్పుడు... వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా చదువుకున్నాం. గవర్నమెంట్‌ ఉద్యోగం చేయడం నా కల. దాన్ని సాకారం చేసుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహకారం అందించారు. 

టాలెంట్‌ అందరికీ ఉంటుంది. అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు. ఆ అవకాశం ఉపయోగించుకుని నేను మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యాను. బాబు వస్తే జాబ్‌ వస్తుందని చెప్పి...మాట తప్పిన ముఖ్యమంత్రిని చూపాం. అయితే... చెప్పింది చేసి చూపించిన ముఖ్యమంత్రి మన ముందు ఉన్నారు. ఉద్యోగ నిర్వహణలో.. నిష్పక్షపాతంగా, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నా బాధ్యతను నిర్వర్తిస్తాను’ అని తెలిపింది. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన విజయదుర్గ, సాయి మణికంఠ, మంగాదేవికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

చదవండి: సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు 

మరిన్ని వార్తలు