ముగిసిన పరీక్ష..ఫలితంపై ఉత్కంఠ

9 Sep, 2019 12:04 IST|Sakshi
కర్నూలు సిల్వర్‌జూబ్లీ కళాశాలలో సచివాలయ పరీక్షకు హాజరైన అభ్యర్థులు

‘సచివాలయ’ పరీక్షలు ముగిశాయి. ‘కీ’లు కూడా విడుదలయ్యాయి. మార్కులు ఎన్ని వస్తాయన్న దానిపై దాదాపు స్పష్టత వచ్చేసింది. ‘అర్హత’ మార్కులకు మించి స్కోర్‌ చేసిన అభ్యర్థులు అప్పుడే ‘కటాఫ్‌’ అంచనాల్లో తలమునకలయ్యారు. తమకు వచ్చే మార్కులను బట్టి పోస్టు వస్తుందా, రాదా అంటూ పోటీ పరీక్షల నిపుణులను వాకబు చేస్తున్నారు. పోస్టులు చాలా ఎక్కువగా ఉండడంతో మెజార్టీ అభ్యర్థుల్లో ధీమా కన్పిస్తోంది. ఈ ‘ఉద్యోగ జాతర’లో తమ లక్ష్యం నెరవేరుతుందన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.  

సాక్షి కర్నూలు(అర్బన్‌) :  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. ఆరు రోజుల పాటు సాగిన ఈ పరీక్షలకు మొత్తం 89.52 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. నిరుద్యోగ సమస్యను తగ్గించడంతో పాటు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన పేదలకు అందించాలని, ప్రభుత్వ సేవల్లో జాప్యం జరగరాదనే సదుద్దేశంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో పనిచేసేందుకు అవసరమైన ఉద్యోగుల నియామకానికి ఈ నెల ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు (2, 5 తేదీల్లో ప్రభుత్వ సెలవులు) ఆరు రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 676 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. 19 రకాల పోస్టులకు 14 రకాల ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహించారు.  

1,80,728 మంది హాజరు 
జిల్లాలో 19 రకాల పోస్టులకు సంబంధించి  2,01,886 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,80,728 మంది పరీక్షలకు హాజరయ్యారు. 21,158 మంది గైర్హాజరయ్యారు. ఈ నెల ఒకటో తేదీన ఉదయం జిల్లాలోని 444 కేంద్రాల్లో జరిగిన మొదటి పరీక్ష (కేటగిరీ–1)కు ఏకంగా 1,15,531 మంది దరఖాస్తు చేసుకోగా..    1,06,257 మంది హాజరయ్యారు. అదే రోజు మధ్యాహ్నం జరిగిన డిజిటల్‌ అసిస్టెంట్‌ పరీక్షకు 28,948 మందికి గాను 26,910 మంది హాజరయ్యారు. చివరి రోజైన ఆదివారం (8వ తేదీ) ఉదయం జరిగిన వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ పరీక్షలకు 5,506 మందికి గాను 4,626 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ, వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ పరీక్షలకు 16,349 మందికి గాను 13,310 మంది హాజరయ్యారు. 

పకడ్బందీగా నిర్వహణ 
1.80 లక్షల మంది హాజరైన  గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను జిల్లా అధికార యం త్రాంగం అత్యంత పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించడంవిశేషం. మొదటి రోజు ఉదయం జరిగిన పరీక్షకు సంబంధించి వేంపెంట, పత్తికొండలోని పరీక్ష కేంద్రాల్లో ఓఎంఆర్‌ షీట్లు తారుమారు కావడం, ఒకరిద్దరు అభ్యర్థులు అస్వస్థతకు గురి కావడం, రవాణా సౌకర్యాల్లో కొంత జాప్యం  మినహా ఎక్కడా ఎలాంటి ఆటంకాలూ తలెత్తలేదు. ముఖ్యంగా దివ్యాంగులకు ఇబ్బంది లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో  స్క్రైబ్స్‌ను ఏర్పాటు చేశారు. వారికి సాయపడడానికి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఎన్‌సీసీ వలంటీర్లను అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ప్రాంతాల్లోనూ గట్టి పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు. ఓఎంఆర్‌ షీట్లు, ప్రశ్నపత్రాలను భద్రపరిచిన జెడ్పీలోని డీపీఆర్‌సీ భవనాన్ని జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ప్రతి రోజూ తనిఖీ చేశారు. అక్కడే విధుల్లో ఉన్న జెడ్పీ సీఈఓ ఎం.విశ్వేశ్వరనాయుడు, డీపీఓ కేఎల్‌ ప్రభాకర్‌రావు, పరీక్షల ప్రత్యేకాధికారి శంకర్‌నాయక్‌కు పలు సూచనలు, సలహాలు ఇస్తూ పరీక్షలు సజావుగా జరిగేలా కృషి చేశారు. 

ఉద్యోగ భరోసా కల్పించారు 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ భరోసా కల్పించింది. బీటెక్‌ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నా. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్‌లు విడుదల చేయలేదు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే సచివాలయ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి  రాత పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కేటగిరీ–1 పరీక్ష బాగా రాయడంతో ఉద్యోగం వస్తుందని భావిస్తున్నా. 
– సుబహాన్, ఉయ్యాలవాడ
 
ఉద్యోగం వస్తుందని భావిస్తున్నా..
నేను పీజీ (ఎకనామిక్స్‌) 2012–14లో  పూర్తి చేశా. అప్పటి నుంచి ఉద్యోగాలకు కోచింగ్‌ తీసుకుంటున్నా. గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు రాక ఉద్యోగం సాధించలేకపోయా. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి కేటగిరీ–1 పరీక్ష రాశా. ఫైనల్‌ కీలో 85 మార్కులు వచ్చాయి. ఉద్యోగం వస్తుందని భావిస్తున్నా.  
– అంగం చక్రపాణి, అవుకు  

మరిన్ని వార్తలు