మెరిట్‌ జాబితాపై  కసరత్తు

23 Sep, 2019 08:00 IST|Sakshi

సాక్షి, ఏలూరు (టూటౌన్‌) : గ్రామ, వార్డు సచివాలయ నియామక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు మెరిట్‌ జాబితా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకూ ఈ జాబితా రూపకల్పనలో జిల్లా యంత్రాంగం తలమునకలైంది. ఈ జాబితాపై జిల్లా అధికారులతో పాటు జిల్లాపరిషత్‌ ఉద్యోగులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 1 నుంచి 8వ తేదీ వరకూ జిల్లాలోని మొత్తం 19 రకాల పోస్టులకు 14 రకాల పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లావ్యాప్తంగా 9,576 పోస్టులకు 1,41,806 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పరీక్షలకు 1,28,268 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం కేవలం 11 రోజుల్లోనే వెలువరించి రికార్డు నెలకొల్పింది.  జిల్లాలకు సంబంధించి  జాబితాను ఈ నెల 21నే పంపినా.. రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్ల వారీగా తుది మెరిట్‌ జాబితా రూపకల్పన ప్రక్రియలో జిల్లా అధికారులు తలమునకలయ్యారు.

దీనికి సంబంధించి ఆయా శాఖల సిబ్బంది శనివారం అర్ధరాత్రి వరకూ కష్టపడి ఒక జాబితాను రూపొందించారు. దీనిని ఆదివారం ఉదయం కలెక్టర్‌ ముత్యాలరాజుకు సమర్పించారు. దీనిని పరిశీలించిన కలెక్టర్‌ దీనిలో లోపాలు కనిపిస్తున్నాయని,  వాటిని సరిచేసిన తర్వాతనే అభ్యర్థులకు కాల్‌ లెటర్లు పంపించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆదివారం అయినా జిల్లా యంత్రాంగం పూర్తి సమయాన్ని జాబితాల రూపకల్పనపైనే పెట్టింది.  ఆదివారం మధ్యాహ్నం కలెక్టర్‌ స్వయంగా జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలోనే ఉండి జాబితా రూపకల్పన ప్రక్రియను సమీక్షించారు. అధికారుల అనుమానాలు నివృత్తి చేశారు. రాత్రి పొద్దుపోయే వరకూ అధికారులు జాబితా రూపకల్పనలోనే నిమగ్నమయ్యారు.  

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా