సచివాలయ వ్యవస్థ అద్భుతం 

19 Nov, 2019 04:36 IST|Sakshi
సోమవారం విశాఖ జిల్లా చోడవరం సచివాలయం వద్ద విదేశీ ప్రతినిధుల బృందం

విశాఖ జిల్లా చోడవరం సచివాలయాన్ని సందర్శించిన 19 దేశాల ప్రతినిధులు

ప్రజలకు చేరువగా గ్రామీణ పాలన ఉందంటూ ప్రభుత్వంపై ప్రశంసలు  

చోడవరం: గ్రామ సచివాలయ వ్యవస్థపై విదేశీ ప్రతినిధుల అధ్యయన బృందం ప్రశంసల జల్లు కురిపించింది. గ్రామీణ ప్రజల అభివృద్ధి, అవసరాలు తీర్చడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పాలన చాలా బాగుందని అభినందించింది. జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డీఆర్‌డీఏ సౌజన్యంతో 19 దేశాలకు చెందిన 23 మంది ప్రతినిధులు సోమవారం విశాఖపట్నం జిల్లా చోడవరం గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ప్రతినిధి బృందంలో శ్రీలంక, బంగ్లాదేశ్, బోట్సువానా, బురుండీ, కెమెరూన్, ఈజిప్ట్, ఇథియోపియా, ఘనా, ఇరాక్, కెన్యా, మారిషస్, నైజీరియా, దక్షిణ సూడాన్, తజికిస్థాన్, టాంజానియా, ఉజ్బెకిస్థాన్, జాంబియా తదితర దేశస్తులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పాలన వ్యవస్థ, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సేవలు, గ్రామీణాభివృద్ధిపై వీరు అధ్యయనం చేశారు. 11 ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది సేవలందించేందుకు ప్రజలకు చేరువగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం చాలా బాగుందన్నారు. సచివాలయ కార్యాలయం ఏర్పాటు, ఉద్యోగుల నియామకంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ వ్యవస్థ గురించి తమ దేశాల ప్రభుత్వాలకు సూచిస్తామని చెప్పారు. చోడవరం ఎమ్మెల్యే తరఫున స్పెషలాఫీసర్‌ వెంకటేశ్వర్లు, ఈవోపీఆర్‌డీ చైతన్య, పంచాయతీ ఈవో లోవరాజు, వైఎస్సార్‌సీపీ నేతలు విదేశీ బృందాన్ని ఘనంగా సత్కరించారు.

పాలనా వ్యవస్థ బాగుంది 
భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు, పాలనా వ్యవస్థ బాగున్నాయి. గ్రామీణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ప్రజలకు ప్రభుత్వం చాలా మేలు చేస్తుండటం అభినందనీయం. ప్రజలు చూపించే ప్రేమాభిమానాలకు చాలా సంతోషిస్తున్నాం. 
–అగిసన్యంగ్‌కౌప, బోట్సువానా ప్రతినిధి

గ్రామీణ వ్యవస్థ బలంగా ఉంది 
ప్రభుత్వ ఆధీనంలో గ్రామీణ పరిపాలనను సాగిస్తుండటం బాగుంది. అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది గ్రామ స్థాయిలోనే అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు చాలా పథకాలు అందించడం వల్ల గ్రామీణ వ్యవస్థ బలంగా ఉంది.
 –ఎన్‌చుఫర్‌ క్రిస్టోఫర్, కెమెరూన్‌ ప్రతినిధి 
 
ప్రజలకు దగ్గరగా గ్రామీణ వ్యవస్థ 
ప్రజల అవసరాలకు దగ్గరగా గ్రామీణ వ్యవస్థ ఉంది. ప్రభుత్వం వృద్ధులకు పింఛన్లు ఇచ్చి ఆదుకోవడం మంచి విధానం. దారి్రద్యరేఖకు దిగువన ఉన్న వారిని ప్రభుత్వం ఆదుకోవడం అభినందనీయం.
– ఒజయ్‌కుమార్‌ హల్డార్, బంగ్లాదేశ్‌ ప్రతినిధి 

మరిన్ని వార్తలు