దార్శనిక వ్యవస్థ

26 May, 2020 03:54 IST|Sakshi

ఐఏఎస్‌ల శిక్షణా సిలబస్‌లో గ్రామ సచివాలయాలు 

సాక్షి, అమరావతి:  ‘స్థానిక సుపరిపాలన సాధన దిశగా ఏపీ ప్రభుత్వం వినూత్న పరిపాలన విధానాన్ని రూపొందించింది. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. స్థానిక సుపరిపాలన అందించడానికి 1993లో పార్లమెంటు చేసిన 73, 74 రాజ్యాంగ సవరణల లక్ష్య సాధనకు అవసరమైన వ్యవస్థను దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం 2019లో ఏర్పాటుచేసింది’.

ఇదీ ఎవరో అన్న మాట కాదు.. దేశ పరిపాలన వ్యవస్థలో అత్యంత కీలకమైన ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌) అధికారుల శిక్షణ సిలబస్‌లో పేర్కొన్న అంశం. ఐఏఎస్‌లుగా ఎంపికైన వారికి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ప్రత్యేక శిక్షణనిస్తారు. దేశంలో సమర్థవంతమైన పరిపాలన అందించడానికి ఉన్న చట్టాలు, వివిధ వ్యవస్థల గురించి వివరిస్తారు. మన రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ గురించి ఐఏఎస్‌ శిక్షణ సిలబస్‌లో చేర్చడం విశేషం. 2019 బ్యాచ్‌లో శిక్షణపొందిన మొత్తం 185 మంది ట్రైనీ ఐఏఎస్‌లకు మన గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ గురించి పూర్తి అవగాహన కల్పించారు. స్థానిక సుపరిపాలన పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దార్శనికతకు ఇది గుర్తింపుగా నిపుణులు భావిస్తున్నారు. ఈ వ్యవస్థ గురించి యువ ఐఏఎస్‌లకు శిక్షణలో ఏం చెప్పారంటే..

► భారత రాజ్యాంగం పేర్కొన్న స్థానిక సుపరిపాలన స్ఫూర్తిని ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రతిబింబిస్తోందని ఐఏఎస్‌ల శిక్షణా సిలబస్‌లో పేర్కొన్నారు.
► స్థానిక సంస్థలకు విశేషాధికారాలు కట్టబెడుతూ 73, 74 రాజ్యాంగ సవరణలు అయితే చేశారు కానీ.. అందుకవసరమైన వ్యవస్థను ఏర్పాటుచేయలేకపోయారు.
► కానీ, దేశంలో తొలిసారిగా అటువంటి వ్యవస్థను ఏపీలో ఏర్పాటు చేశారు. అదే గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ. 
► పూర్తిస్థాయిలో పరిపాలన వికేంద్రీకరణకు వ్యవస్థ సరైన ఉదాహరణగా నిలిచింది. 
► అంటే.. రాష్ట్రస్థాయిలో సచివాలయం నిర్వహించే విధులన్నింటినీ క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలు చేస్తాయి. 
► ఈ వ్యవస్థ ద్వారా ఏపీ ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిజమైన లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయి.
► గ్రామ, వార్డు స్థాయిలోనే వివిధ పత్రాల జారీ, రెవెన్యూ, విద్యుత్, వైద్య–ఆరోగ్య, విద్య సంబంధిత అంశాలను పరిష్కరిస్తున్నారు. 
► ఈ వ్యవస్థ విజయవంతమై దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. 

స్థానిక సుపరిపాలన సాధనలో వినూత్న వ్యవస్థ
ఏపీ ప్రభుత్వం చేసిన వినూత్న వ్యవస్థే గ్రామ, వార్డు సచివాలయాలు. రాష్ట్రస్థాయిలోని వ్యవస్థను క్షేత్రస్థాయికి తీసుకురావడమన్నది గొప్ప ఆలోచన. కరోనాను ఏపీ ఈ వ్యవస్థతోనే సమర్థంగా కట్టడి చేయగలుగుతోంది. 
– కట్టా సింహాచలం, ప్రొబెషనరీ ఐఏఎస్‌

నిజమైన పరిపాలన వికేంద్రీకరణ అంటే ఇదే
పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే సమర్థవంతమైన పాలన అందించగలం. ఈ వ్యవస్థతో పారదర్శకత, జవాబుదారీతనం సాధించగలుగుతాం. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
– చాహత్‌ బాజ్‌పాయ్, ప్రొబెషనరీ ఐఏఎస్‌ 

ఈ వ్యవస్థ గురించి శిక్షణలో ప్రత్యేకంగా చెప్పారు
ముస్సోరీలో మాకు ఇచ్చిన శిక్షణలో ఏపీలోని వలంటీర్ల వ్యవస్థ గురించి ప్రత్యేకంగా వివరించారు. మహాత్మాగా«ంధీ ఆకాంక్షించిన గ్రామ స్వరాజ్యం ఇలాంటి వ్యవస్థతోనే సాధ్యపడుతుంది.
– సి. విష్ణుచరణ్, ప్రొబెషనరీ ఐఏఎస్‌  

మరిన్ని వార్తలు