‘స్వైన్’విహారం

18 Oct, 2013 04:34 IST|Sakshi

నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: జిల్లాలో స్వెన్‌ఫ్లూ చాపకింద నీరు లా విస్తరిస్తోంది. ఆ పేరు వింటేనే సామాన్యులు గజగజ వణుకుతున్నారు. ముఖ్యం గా నియోజకవర్గం తూడుకుర్తి గ్రామంలో ఈ అంటువ్యాధి పంజా విసురుతోంది. ఈ గ్రామానికి చెందిన వెంకట్‌రాజు(58), పుష్పావతమ్మ(40) అనే మరో ఇద్దరు స్వైన్‌ఫ్లూ వ్యాధి బారినపడినట్లు జిల్లా వైద్యాధికారులు గుర్తించారు. కాగా, ఇదే గ్రామానికి చెందిన ఆనంద్ అనే యువకుడు వ్యాధి బారినపడి ప్రస్తుతం హైదరాబాద్‌లో వైద్యచికిత్సలు పొందుతున్న విష యం తెలిసిందే.. ఆయన తండ్రి రాంచంద్రయ్యకు కూడా ప్రస్తుతం అక్కడే వైద్యం తీసుకుంటున్నాడు.
 
 తాజాగా, అదే గ్రా మంలో మరో ఇద్దరిలో స్వెన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో గ్రామస్తులు కలవరపడుతున్నారు. దీంతో అప్రమత్తమైన వైద్యశాఖ అధికారులు రెవెన్యూ, పంచాయతీ అధికారులు గ్రామంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. కాగా, మొదట వ్యాధిప్రబలిన వారితో పాటు వారి కుటుంబసభ్యులు, వారికి అత్యంత చనువుగా ఉండే నలుగురి రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. వారిలో సమీప ఇళ్లకు చెందిన వెంకట్‌రాజు, పుష్పావతమ్మను వ్యాధి పీడితులుగా గుర్తించినట్లు జిల్లా వైద్యాధికారిణి(డీఎంహెచ్‌ఓ) రుక్మిణమ్మ తెలిపారు.
 
 ప్రస్తుతం వీరికి జిల్లా ఆస్పత్రిలోని ప్రత్యేకవార్డులో వైద్యచికిత్సలు అం దజేస్తున్నామని వెల్లడించారు. తాజాగా వ్యాధి గుర్తించిన వారికి ఇక్కడే చికిత్సచేస్తామని, పరిస్థితిని బట్టి అవసరమైతే హైదారాబాద్‌కు రెఫర్ చేస్తామన్నారు. తూడుకర్తి గ్రామంలో బుధవారం ఇంటిం టి సర్వే నిర్వహించామని, తీవ్రంగా దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారెవరూ లేరని తేలిందని ఆమె పేర్కొన్నారు. అయి నా అనుమానం ఉన్న వారికి మందులు ఇస్తున్నామని, అలాంటి వారిని నిత్యం పరిశీలించి పరిస్థితిని అంచనా వేస్తామని డీఎంహెచ్‌ఓ చెప్పారు.
 
 ఆందోళన చెందొద్దు: కలెక్టర్
 కలెక్టరేట్: జిల్లాలో స్వైన్‌ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందొద్దని, ఇందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ సమీప ఆరోగ్యం కేంద్రంలో సంప్రదించి రక్షణపొందాలని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ విజ్ఞప్తిచేశారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో జిల్లా వైద్యరోగ్యశాఖతోపాటు, కొలంబియా గ్లోబల్ సెంటర్ ప్రతినిధులతో మాతా శిశు మరణాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల తూడుకుర్తి గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తికి స్వైన్‌ఫ్లూ ప్రబలడంతో హైదరాబాద్‌లోని యశో ఆస్పత్రిలో చికిత్సపొం దుతూ కోలుకుంటున్నాడని తెలిపారు. అతని తండ్రి రాంచంద్రయ్యను గాంధీ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ ఇద్దరుక్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.

 

తూడుకుర్తి గ్రామంలో వైద్యబృందాలు అప్రమత్తంగా ఉన్నాయని, ప్రతి ఇంటికెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మాతాశిశు మరణాలను తగ్గించడంతోపాటు, గర్భిణులు ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవం అయ్యేవిధంగా జిల్లాలో నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికచేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ రుక్మిణమ్మ, కొలంబియా గ్లోబల్ సెంటర్ తరుపున శుబ్రా కుమార్, శ్రీనివాస్‌రావు, ఎస్‌వీఎస్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు