భయం భయంగా

9 Mar, 2017 16:17 IST|Sakshi
భయం భయంగా

► నాగసానిపల్లెలో సర్వే నేపథ్యంలో గ్రామస్తుల్లో ఆందోళన
► ఖనిజ నిక్షేపాల పేరుతో గ్రామం ఖాళీ చేయాల్సి వస్తుందేమోనని భయం
► ఎవ్వరూ సరైన సమాచారం ఇవ్వడం లేదంటున్న గ్రామస్తులు


ఖాజీపేట మండలం నాగసానిపల్లె గ్రామంలో యురేనియం, అల్యూమినియం నిల్వలు ఉన్నాయని తెలియడంతో గ్రామంలోని ప్రజలు గత 20 రోజులుగా భయం భయంగా జీవిస్తున్నారు. ఏ క్షణంలో గ్రామం వదిలి వెళ్లాల్సి వస్తుందోననే భయం వారిని వెంటాడుతోంది. గ్రామంలో కొత్త వ్యక్తి  కనిపిస్తే చాలు సార్‌ ఎందుకొచ్చారు.. అంటూ ఆరా తీస్తున్నారు. ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ జరుగుతోంది.

ఖాజీపేట: నాగసానిపల్లె పంచాయతీలో సుమారు 1600 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ నాగసానిపల్లె, జయరాంపేట, సుగాలీతాండా, భాగ్యనగరం గ్రామాలు ఉన్నాయి. ఇక్కడి పరిసర ప్రాంతాల్లో భారీగా ఖనిజ నిక్షేపాలు ఉన్నాయన్న  ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.  అధికారులు ఇక్కడ 20 రోజులు మకాం వేసి  సర్వే చేపట్టడం ఇందుకు బలం చేకూరుస్తోంది. యురేనియం నిల్వలు ఎంత మేరకు ఉన్నాయి ? ఎంత విస్తీర్ణంలో ఉన్నా యి ? నాణ్యమైన ఖనిజాలు ఉన్నాయా ? అసలు తవ్వకాలు జరుగుతాయా ? తవ్వకాలు జరిగితే ఎంతవరకు జరుగుతాయి ? నాగసానిపల్లె గ్రామం ఉంటుందా లేక ఖాళీ అవుతుందా ? పంటపొలాలు వది లేసి వెళ్లిపోవాల్సిందేనా? ఇలా పలు రకాల ప్రశ్నలు వెంటాడుతున్నాయి. కొందరు స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గరకు వెళ్లి అడుగుతుంటే తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని వారు చెబుతున్నారు. దీంతో వారి లో ఆందోళన మరింత ఎక్కువవుతోంది.

నాగసానిపల్లెలో మేలు రకం పంట భూములు: నాగసానిపల్లె చుట్టూ సారవంతమైన భూములు ఉన్నాయి. ఎక్కువగా వేరుశనగ, బొప్పాయి, మిరప, టమాటా, బెండకాయలు, శనగలు, వరి, పసుపు, ఇలా అనేక రకాల పంటలు సాగుచేస్తారు. ఏటా రెండు రకాల పంటలు పండిస్తూ మంచి దిగుబడి సాధించి లాభాలను ఆర్జిస్తున్నారు. అయితే ఇంతటి సారవంతమైన భూములను వదిలేయాల్సి వస్తుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.

డీకేటీ భూములు ఎక్కువగా ఉన్నాయి: నాగసానిపల్లె పరిసరాల్లో డీకేటీ భూములు అధికంగా ఉన్నాయి. ఇక్కడ 8,293 ఎకరాల భూమి ఉంది. అందులో సర్వేనెంబర్‌ 330లో 645 ఎకరాలు, సర్వేనెంబర్‌ 323లో 64ఎకరాలు, సర్వేనంబర్‌ 333లో ఫారెస్ట్‌ భూమి 6149 ఎకరాలు, మాచుపల్లెలో 11 నెంబర్లు ఉన్నాయి, అందులో ఒక్క 11వ నెంబరులోనే సుమారు 2470 ఎకరాల భూమి ఉంది. అయితే ఈ భూమి తమదంటే తమదంటూ ఫారెస్టు, రెవెన్యూ అధికారులు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం కోర్టులో వివాదం నడుస్తోంది. అయితే ఇప్పటికే ఆభూమి అంతా స్థానికులు పూర్తిగా సాగు చేసుకుంటున్నారు. అయితే ఇందులో ఎంతమేరకు భూమిని ప్రభుత్వం ఖనిజ తవ్వకాలకు తీసుకుంటుంది అనే దానిపై గ్రామస్తులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

అధికారులు సమాచారం ఇవ్వాలి: అసలు మా గ్రామంలో ఏం జరుగుతోంది. ఖనిజనిక్షేపాలు ఉన్నాయా లేవా అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలి. మాకున్న భయాందోళనలు తొలగించాలి.  ---- నక్కా సుబ్రమణ్యం, నాగసానిపల్లె

 ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ: మా గ్రామంలోకి ఎవ్వరు వచ్చినా సర్వే గురించే అడిగి తెలుసుకుంటున్నాం. కొందరు వ్యక్తులు వచ్చి మా గ్రామం ఉండదని అంటున్నారు. దీంతో ఆందోళన చెందుతున్నాం.   --- పిట్టా గురవయ్య, భాగ్యనగరం

సాగు భూములు ఉంటాయా పోతాయా: సర్వే జరిగినప్పటి నుంచి మా గ్రామం ఖాళీ చేయాలనే ప్రచారం నడుస్తోంది. గతంలో తెలుగుగంగ ముంపు ప్రాంతాలనుంచి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటో..  --- పెద్దపోతు నారాయణ, భాగ్యనగరం

పంటపొలాలు వదిలేయాల్సిందేనా?: బంగారం లాంటి పంటపొలాలను వదిలేయాల్సిందే అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎవ్వరిని అడిగినా సరైన సమాధానం చెప్పడంలేదు. --- నక్కా వెంకటయ్య, నాగసానిపల్లె

మరిన్ని వార్తలు