ఆగ్రహం!

1 Mar, 2018 12:57 IST|Sakshi
తహసీల్దార్‌పై దాడికి పాల్పడుతున్న నిర్వాసితులు

హిరమండలం తహసీల్దార్‌పై దాడి

ప్యాకేజీ అవకతవకలపై దుగ్గుపురం వాసుల నిలదీత

దాడికి పాల్పడిన ఏడుగురు అరెస్టు

హిరమండలం: వంశధార నిర్వాసితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఓ అధికారిపై దాడికి కారణమైంది. దుగ్గుపురం గ్రామానికి చెందిన నిర్వాసితులు బుధవారం మండల తహసీల్దార్‌ ఎం.కాళీప్రసాద్‌పై దాడికి పాల్పడ్డారు. ప్యాకేజీ పరిహారం, యూత్‌ప్యాకేజీ చెల్లింపుల్లో అర్హులకు అన్యాయం చేసి అనర్హులకు పెద్దపీట వేశారని ఆరోపిస్తూ మడపాన భాస్కరరావుతో పాటు సుమారు 40 మంది తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. అర్హులను కాదని అనర్హులకు పరిహారం ఎలా చెల్లిస్తారంటూ తహసీల్దార్‌ ఎం.కాళీప్రసాద్‌ను నిలదీశారు. గ్రామానికి సంబంధించి సుమారు 35 ఎకరాల డీ పట్టా భూములకు నష్టపరిహారం ఇవ్వవలసి ఉన్నా ఇంతవరకు ఎందుకూ ఇవ్వలేదని, యూత్‌ప్యాకేజీలో అర్హులకు అన్యాయం ఎలా జరిగిందని ప్రశ్నించారు. తాజాగా కూడా కొంతమంది అనర్హులకు ప్యాకేజీ చెక్కులు పంపిణీ చేశారని, కొంత మంది వృద్ధులకు ఆప్‌ ప్యాకేజీ పేరుతో పెంపింగ్‌ ఉంచారని.. ఆ విషయాన్ని ఆరు నెలలు గడుస్తున్నా ఎందుకు పట్టించుకోలేదని, వృద్ధులు చనిపోయే స్థితిలో ఉన్నారని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తహసీల్దార్, నిర్వాసితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. 

సహనం కోల్పోయిన కొంతమంది నిర్వాసితులు తహసీల్దర్‌ కాళీప్రసాద్‌పై   దాడికి పాల్పడి పిడిగుద్దులు గుదా రు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయలంలో ఉన్న రికార్డులు, బళ్లలు చెల్లా చెదురయ్యాయి.  ఒక్కసారిగా కేకలు వినబడటంతో రెవెన్యూ సిబ్బంది ఉలిక్కపడి అక్కడకు చేరుకొని ఆందోళనకారుల నుంచి తహసీల్దార్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. పోలీసులకు సమాచారం అందించి.. గాయపడిన తహసీల్దార్‌ను హిరమండలం మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వైద్యాధికారి నీలిమ  చికిత్సను అందించారు. అనంతరం జిల్లా అదనపు ఎస్పీ పనసారెడ్డి తన వాహనంలో తీసుకొని శ్రీకాకుళంలోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

పాతపట్నం సీఐ ప్రకాష్, సారవకోట ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల కేంద్రంలో బందోబస్తు నిర్వహించారు. కాగా గాయపడిన తహసీల్దార్‌ కాళీప్రసాద్‌ను జిల్లా కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి,  పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ హిరమండలం ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న సమయంలో పరామర్శించారు. ఈ సంఘటన దురదృష్టకరమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దాడికి బాధ్యులైన వారిని గుర్తించి చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని సీఐ ప్రకాశరావును క ఆదేశించారు. నిర్వాసితులకు ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకు వచ్చినట్‌లైతే పరిష్కరించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం మంచిది కాదన్నారు.

తహసీల్దార్‌పై దాడులు అమానుషం
జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షుడు పి.వేణుగోపాలరావు గాయపడిన తహసీల్దార్‌ కాళీప్రసాద్‌ను పరామర్శించారు. విధుల్లో ఉన్న అధికారులపై ఇటీవల దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను అభ్యర్ధించారు. ఆయన వెంట సరుబుజ్జిలి, భామిని, ఎల్‌ఎన్‌పేట, మండలాల తహసీల్దార్లు ఉన్నారు.

ప్రణాళిక ప్రకారమే...
దుగ్గుపురం గ్రామానికి చెందిన వంశధార నిర్వాసితులు తహసీల్దార్‌ కాళీప్రసాద్‌ పై దాడికి  వ్యూహత్మకంగానే వచ్చారని కార్యాలయానికి వచ్చారని పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి అన్నారు. తనను హత్య చేసేందుకు వచ్చారని తహసీల్దార్‌ ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న 9 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరితో పాటు మరో 30 మంది దాడికి పాల్పడిన వారున్నారని.. వారిని గుర్తిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం, ప్రభుత్వ అధికా రి విధుల నిర్వహణకు ఆటంకం కలిగించడం, దాడికి పాల్పడటం వంటి 307, 332, 452 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వివరించారు.

ఏడుగురి అరెస్టు
తహసీల్దార్‌పై దాడికి పాల్పడిన సంఘటనలో దుగ్గుపురం గ్రామానికి చెందిన ఏడుగురిని అరెస్టు చేసినట్లు సీఐ బీఎస్‌ ప్రకాష్‌ తెలిపారు. మడపాన భాస్కరరావు, జావాన మోహన్‌రావు, కాత బుడ్డు, చింతాడ దండాసి, చింతాడ కాంతారావు, చింతాడ రామారావు, లోతుగడ్డ లక్ష్మణరావు లను అరెస్టు చేశామని, గురువారం పాతపట్నం కోర్టులో హజరు పరుస్తామన్నారు. 

‘నిర్వాసితులకు న్యాయం చేయాలి’
వంశధార నిర్వాసితులకు పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించలేదని, వారికి న్యాయంచేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు అన్నారు. మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. తహసీల్దార్‌ కాళీప్రసాద్‌పై దాడిని ఖండించారు. నిర్వాసిత గ్రామాల్లో పూర్తిస్థాయిలో.. సక్రమంగా పరిహార ప్యాకేజీలు చెల్లిస్తే ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేవికాదన్నారు. రాజకీయ పార్టీ నాయకుల ఒత్తిళ్లకు, లంచాలకు తలొగ్గి అధికారులు అనర్హులకు ప్యాకేజీలు చెల్లించారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్యాకేజీ, పరిహార పంపిణీలపై జిల్లా అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి అక్రమాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన వారికి న్యాయం చేయాలని కోరారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు