వంశధార నదిలో ఘర్షణ

6 May, 2018 10:52 IST|Sakshi
నదిలో రెండు గ్రామాలకు చెందిన వారు ఘర్షణ పడుతున్న దృశ్యం

పలువురికి గాయాలు  

నరసన్నపేట: వంశధార నదిలో ఇసుక తవ్వకాల విషయంలో నరసన్నపేట మండలం పోతయ్యవలస గ్రామస్తులకు గార మండలం బూరవల్లి గ్రామస్తులకు మధ్య శనివారం ఘర్షణ జరిగింది. దీంట్లో రెండు గ్రామాలకు చెందిన ఆరుగురి వరకూ గాయపడ్డారు. పోతయ్యవలసకు చెందిన అరవల జంగమయ్య, అరవల ఆది నారాయణ, బొబ్బాది చలపతిరావు, అలిగి గనేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పోతయ్యవలస వద్ద కలెక్టర్‌ ధనంజయరెడ్డి విశాఖలో అవసరాలకు  వీలుగా ఇసుక ర్యాంపును మంజూరు చేశారు. వీరు తవ్వకాలు చేస్తున్నప్పుడు పరిధి దాటి బూరవల్లి బౌండరీకి వచ్చి ఇసుక తవ్వకాలు చేస్తున్నారని గతంలో అభ్యంతరం తెలిపారు. దీనిపై ఆర్డీఓ దయానిధి, నరసన్నపేట సీఐ పైడిపునాయుడు, మైన్స్‌ అధికారులు వచ్చి వివా దాన్ని పరిష్కరించారు. మళ్లీ ఈ వివాదం రెండు రోజులుగా రేగింది. శనివారం రెండు గ్రామాలకు చెందిన వారు బాహీబాహీ అయ్యారు. అప్పటికే పథకం ప్రకారం కర్రలతో వచ్చిన బూరవల్లి వాసులు పోతయ్యవలసకు చెందిన వారిపై దాడి చేశారు.

పోతయ్యవలస వాసులు 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వగా నరసన్నపేట సీఐ పైడిపినాయుడు, ఎస్‌ఐ నారాయణ స్వామిలు సంఘటనా స్థలానికి వెళ్లి వివా దం అదుపు చేయడానికి ప్రయత్నించారు. వీరి సమక్షంలోనే మరో సారి ఘర్షణ జరిగింది. కాగా ఈ వివాదాన్ని ప్రశాంతంగా పరిష్కరించాలని పోతయ్యవలస గ్రామస్తులు కోరుతున్నారు.  శనివారం జరిగిన వివాదంపై నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది. రాత్రి వరకూ రెండు వర్గాల పెద్ద మనుషుల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు