-

ఆక్రమణలపై గ్రామస్తుల ఉక్కుపాదం

12 Jun, 2019 09:48 IST|Sakshi
సంతచెరువు ఆక్రమణలు తొలగిస్తున్న పెద్దింపేట గ్రామస్తులు

పెద్దింపేట సంతచెరువులో ఆక్రమణలను తొలగించిన గ్రామస్తులు

సాక్షి, బలిజిపేట (విజయనగరం): మండంలోని పెద్దింపేటలో కబ్జాకు గురైన సంతచెరువులో ఆక్రమణలను గ్రామస్తులు మంగళవారం తొలగించారు.  గ్రామంలో కొందరు బడాబాబులు చేస్తున్న దురాక్రమణల వల్ల చెరువు గర్భాలు తగ్గుతున్నాయని, ఆయకట్టుదారులకు సాగునీరు అందడం లేదని, చెరువుల్లో చేపలు పెంచుకునేవారికి తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని భావించి ఆక్రమణలను తొలగించారు. పెత్తనందారులు చేస్తున్న ఆక్రమణలకు అంతూపొంతూ లేకుండా పోతోందని బాధితులు టి సూర్యనారాయణ, మజ్జిరావు, సాంబయ్య, ఎస్‌ అప్పలస్వామి, సత్యం, బి పోలీసు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్వే నంబర్‌.69లో ఉన్న సంతచెరువు గర్భం 11.66 ఎకరాలు, ఆయకట్టు సుమారు 400 ఎకరాల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఈ చెరువు దిగువన పెద్దింపేట, పోలినాయుడువలస, గౌరీపురం గ్రామాలకు చెందిన రైతుల ఆయకట్టు భూమి ఉందన్నారు. అటువంటి చెరువు గర్భంలో సుమారు 8ఎకరాల వరకు దురాక్రమణలు జరిగాయని తెలిపారు. చెరువు గర్భంలో ఉండే గట్టును జేసీబీతో తొలగించి దురాక్రమణ చేయడం దారుణమని తెలిపారు. సంతచెరువు, పద్మనాభం చెరువు, పనసోడు చెరువులను మూడు సంవత్సరాలకు చేపలు పెంచుకునేందుకు లక్ష రూపాయలకు పాడుకున్నామని అటువంటి చెరువును దురాక్రమణ చేస్తున్నారని తెలిపారు.

మూడు చెరువుల్లో చేపలు పెంచుకుంటూ 50 కుటుంబాలు జీవిస్తున్నాయి. చెరువు కొమ్మును తొలగించి ఆక్రమణదారుల పంటపొలాలకు నీరు మళ్లించేందుకు కాలువలు ఏర్పాటు చేసుకున్నారని బాధితులు తెలిపారు. అధికారులు ఇటీవల నీటివనరులపై సర్వే నిర్వహించారు. కానీ ఎన్ని చెరువులు ఆక్రమణలో ఉన్నాయి, వాటివల్ల ఎంతమేర ఆయకట్టు భూమికి నష్టం వాటిల్లుతుందో పర్యవేక్షించలేదని బాధితులు ఆరోపించారు. మండలంలో 24 పంచాయతీల్లో 428 ఇరిగేటెడ్‌ చెరువులు ఉన్నట్లు సర్వేలో తేలింది.

పరిశీలించి తగు చర్యలు తీసకుంటాం
ఆక్రమణలో ఉండే చెరువులను పరిశీలిస్తాం. ఈ చెరువు ఇప్పటికే కబ్జా అయిందని గుర్తించాం. గట్టు కూడా వేయడం జరిగింది. ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించి పరిశీలిస్తాం. ఆక్రమణలు రుజువైతే చర్యలు తీసుకుంటాం.
–రాణి అమ్మాజీ, తహసీల్దార్, బలిజిపేట

మరిన్ని వార్తలు