నన్నే నిలదీస్తాడా.. సంగతేంటో చూడండి: ఏపీ మంత్రి

14 Sep, 2017 08:46 IST|Sakshi

మంత్రిని ప్రశ్నించినందుకు రూ.3 వేల ఫైన్‌
► గ్రామ కట్టుబాటుకు టీడీపీ రంగు


సాక్షి, తోటపల్లి గూడూరు: గ్రామ సమస్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తికి గ్రామ పెద్దలు రూ.3 వేల జరిమానా విధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని వెంకన్నపాళెం పట్టపుపాళెం గ్రామంలో ఈనెల 11న ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలపై వారు స్పందన అడిగారు. అనంతరం రామాంజనేయ ఆలయ ప్రాంగణంలో మంత్రి ప్రసంగించారు.

ఈ సందర్భంలో గ్రామానికి చెందిన పేటంగారి ఆదిశేషయ్య అనే వ్యక్తి టీడీపీ మూడేళ్ల పాలనలో గ్రామానికి ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అర్హులకు ఇళ్లు, పింఛన్లు మంజూరు కావడం లేదని, వెంకన్నపాళెంలో చెరువు డొంకకు కల్వర్టు నిర్మించడంలో జాప్యం చేస్తున్నారని మంత్రి ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు. దీంతో కంగుతిన్న మంత్రి తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేసి వెనుదిరిగారు. ఆ తరువాత గ్రామ టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘మీ గ్రామానికి వస్తే ఇచ్చే మర్యాద ఇదా. అతిథిగా వస్తే నన్నే నిలదీస్తారా. అతడి సంగతేంటో చూడండి’ అని హుకుం జారీ చేసినట్టు తెలిసింది.

మంత్రి ఒత్తిడికి తలొగ్గిన గ్రామ పెద్దలు మంత్రి సోమిరెడ్డిని ఓ సామాన్య వ్యక్తి ఇలా నిలదీయడం మంచి పద్ధతి కాదంటూ ఆదిశేషయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ కట్టుబాటు ప్రకారం ఆదిశేషయ్య రూ.3 వేలు చెల్లించాలంటూ కట్టుబాట్ల పేరుతో బుధవారం జరిమానా విధించారు. మంత్రిని ప్రశ్నించినందుకు జరిమానా విధించడమేంటని, గ్రామ కట్టుబాటుకు రాజకీయ రంగు పులమడం సరికాదని గ్రామానికి చెందిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం గ్రామంలో వర్గపోరుకు దారితీసింది.

మరిన్ని వార్తలు