ఓట్లు మేము వేస్తే.. రోడ్లు రాజులకేస్తారా?

1 Nov, 2018 12:33 IST|Sakshi
జి.వేమవరం పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులు

జి.వేమవరంలో ప్రజా ప్రతినిధులను నిలదీసిన గ్రామస్తులు

పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా, ఉద్రిక్తత

తూర్పుగోదావరి, తాళ్లరేవు (ముమ్మిడివరం): జి.వేమవరం పంచాయతీలో నాన్‌లేఔట్‌ స్థలంలో లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులతో రహదారి నిర్మాణం చేపట్టడం పట్ల గ్రామస్తులు బుధవారం తీవ్ర ఆందోళన చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్దకు గ్రామస్థులు అధిక సంఖ్యలో చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓట్లు మేము వేయాలా...రోడ్లు రాజులకు వేస్తారా అంటూ ప్రజా ప్రతినిధులను నిలదీశారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అక్కడకు చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు గండి వీరబాబు, గండి సత్యనారాయణ, యర్రంనీడి అప్పారావు, అనుకూలి శ్రీనివాసరావు, పుణ్యమంతుల శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ గ్రామానికి ఏమాత్రం ఉపయోగ పడని సుబ్బరాజు అనే వ్యక్తి కోసం ఉపాధి, ఎస్‌డీఎఫ్‌ నిధులు వెచ్చించడం భావ్యమా అని ప్రశ్నించారు. ఈ రహదారి నిర్మాణానికి స్థానిక ఎంపీటీసీ కొబ్బరికాయ కొట్టడం దారుణమన్నారు.

చర్చల సమయంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు అనుకూలి శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే సమక్షంలో కోరంగి ఎస్సై సుమంత్‌ దురుసుగా ప్రవర్తించడాన్ని గ్రామస్తులు తప్పుబట్టారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.  గ్రామంలో అన్ని పరిస్థితులు తెలిసినా పట్టించుకోకుండా ప్రైవేటు వ్యక్తులకు రోడ్డు నిర్మించడంలో ఏఎంసీ చైర్మన్‌ మందాల గంగ సూర్యనారాయణ పాత్ర ప్రత్యక్షంగా ఉందన్నారు. నాన్‌ లేఅవుట్‌ స్థలంలో ప్రభుత్వ  నిధులతో రహదారిని నిర్మించేందుకు సహకరించిన మండల ఇంజినీర్‌ నున్న వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై గంగ సూర్యనారాయణ మాట్లాడుతూ ఆ నిధులను రద్దు చేసి స్థానిక శ్మశాన వాటికకు వెళ్లే రహదారిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు గండి లోవరాజు, అనుకూలి రాము, శ్రీపాదం శ్రీనివాస్, గండి అప్పన్న, సీకాల రాంబాబు, అనుకూలి దుర్గారావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు