మద్యం దుకాణం వద్దంటూ ఆందోళన

3 Sep, 2019 10:39 IST|Sakshi
గుంపర్రులో మద్యం దుకాణం వద్దని షాపు వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులు

సాక్షి, యలమంచిలి: గుంపర్రు గ్రామంలో మద్యం దుకాణం ప్రారంభించవద్దని గ్రామస్తులు, డ్వాక్రా మహిళలు ఆదివారం బ్రాందీ షాపు వద్ద ఆందోళన చేశారు. గుంపర్రు, కడిమిపుంత రోడ్డులో ఏర్పాటుచేసిన కొత్త మద్యం దుకాణం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు, రైతులు ఆరోపించారు. పొలాల మధ్య ఉన్న ఈ దుకాణంలో రాత్రి పూట కొందరు మద్యం సేవించి ఖాళీ సీసాలను పక్కనున్న చేలలో పడేస్తున్నారని రైతులు ఆరోపించారు. గ్రామానికి దగ్గరగా మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని గ్రామంలో షాపు పెట్టవద్దని మహిళలు నినాదాలు చేశారు.

విషయం తెలుసుకున్న ఎస్సై కొప్పిశెట్టి గంగాధరరావు, ఎక్సైజ్‌ ఎస్సై దుర్గాప్రసాద్‌ ఆందోళనకారులతో మాట్లాడారు. ఇది ప్రభుత్వ దుకాణమని ఇక్కడ ఆందోళన చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో విషయాన్ని రాజకీయ నాయకులకు తెలియజేస్తామని ఆందోళన కారులు వెనుతిరిగారు. ఈ ధర్నాకు మహిళలు యల్లమిల్లి రాజేశ్వరి, గంగులూరి శ్యామల, గొల్లమందుల కుమారి గ్రామస్తులు పితాని స్వామి, కడలి శ్రీనివాస్, కవురు వెంకటేశ్వరరావు, గుడాల నరసింహమూర్తి, చెల్లుబోయిన ఏడుకొండలు, కడలి నరసింహస్వామి నాయకత్వం వహించారు.

>
మరిన్ని వార్తలు