మన‘సారా’ మానేశారు

14 Sep, 2019 09:00 IST|Sakshi

 సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులు

సీఎం జగన్‌ కార్యాచరణతో స్ఫూర్తి

మద్యానికి దూరంగా పల్లెలు

నాన్న రోజూ తాగొచ్చి ఇంట్లో వాళ్లందరినీ తిడుతుండేవారు.. ఇప్పుడా బాధ లేదు.. వచ్చిన డబ్బంతా తాగడానికే నా భర్త తగలేసేవాడు.. ఇప్పుడు ఇంటికిస్తున్నాడు.. నాన్న తాగుతూ ఉండేవారు. ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నావు.. ఏం చదువుతున్నావు.. అని సాయంత్రం ఇంటికొచ్చి నన్నడుగుతుంటే ఎంతో ఆనందంగా ఉంది.. ఓ కుమార్తె.. ఓ భార్య.. ఓ కుమారుడి ఆనందానికి అక్షర రూపమిది. ఇళల్లో గొడవలు లేవు. ఊరిలో అరుపులు, కేకలు లేనేలేవు. మద్యానికి దూరమవుతున్నారు. కుటుంబానికి దగ్గరవుతున్నారు. భార్య, బిడ్డలను అక్కున చేర్చుకుంటున్నారు. దశలవారీగా మద్య నిషేధం విధించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి విజయనగరం జిల్లా స్పందిస్తోంది. ఊరూవాడా మద్యపానం వల్ల కలిగే అనర్థాలపై చైతన్యవంతమవుతోంది.
-సాక్షి, విజయనగరం

మాటంటే మాటే..
సాలూరు రూరల్‌: మద్యపాన నిషేధానికి కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పిలుపుతో సాలూరు మండలంలోని మెట్టవలస గిరిజన గ్రామం స్పందించింది. జగనన్న పిలుపుతో ఊరు ఊరంతా చైతన్యవంతమైంది. ఇప్పుడా ఊరిలో మద్యం మాటే లేదు. మెట్టవలస పూర్తిగా గిరిజనులుండే గ్రామం. అత్యధికంగా ఉపాధ్యాయులు, వైద్యులు, పశువైద్యులు, వ్యవసాయాధికారులు, రైతులున్నారు. గ్రామంలో దాదాపు 2500 జనాభా ఉంటుంది. గ్రామాన్ని కొన్నేళ్లుగా సారా మహమ్మారి పట్టి పీడిస్తోంది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే మద్య నిషేధానికి తీసుకున్న చర్యలతో గ్రామస్తులు స్ఫూర్తి పొందారు. రెండు నెలల క్రితం సారా, మద్యం గ్రామంలో అమ్మరాదని తీర్మానించుకున్నారు. దీన్ని ఆ గ్రామానికి పరిమితం చేయకుండా.. తోణాం పంచాయతీ దిగువ మెండంగి, హనుమంతువలస, మావుడి వలస గ్రామాలతో పాటు ఇంకా కొన్ని గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు.

అక్కడి స్వయం సహాయక సంఘాలతో చర్చించారు. గ్రామపెద్దలు, గ్రామంలోని యువకులతో కలిసి మహిళలు పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం మద్యం అమ్మకం లేకుండా తీర్మానించుకున్నారు. గిరిజనులు ఓ మాట అంటే ఎంతగా కట్టుబడి ఉంటారో ఈ గ్రామాన్ని చూస్తే తెలుస్తుంది. అప్పటికే మద్యం అలవాటు ఉన్నవారు కూడా మానుకున్నారు. మహిళలతో కలిసి ఉద్యమించిన యువతలో కూడా కొందరు మద్యం సేవించేవారున్నారు. వారంతా ఇప్పుడు మద్యానికి దూరంగా ఉంటున్నారు. ఎంతగా తెలుసా? పండగలు.. శుభకార్యాలు జరిగినా కూడా అక్కడి యువత మద్యం ముట్టుకోవడం లేదు. తామే పెద్దలుగా నిలిచి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నామని.. అందుకే తామే ముందుగా ఆదర్శంగా నిలవాలని యువత అనుకున్నారు. అలా యువత, మహిళలు సంయుక్తంగా మద్యాన్ని గ్రామానికి దూరం చేశారు. 

రూ.5 వేలు జరిమానా
గ్రామంలో మద్యం లేదా సారా దొరకదు.. కానీ బయటి ప్రాంతాలకు వెళ్లి వారు ఒక వేళ తాగి వచ్చే అవకాశం ఉంది. అందుకే అలా ఎవరైనా తాగి వస్తే వారికి రూ.5 వేలు జరిమానా విధిస్తున్నారు. తాగిన వారు ఏ గొడవా చేయకుండా ఉంటే పరవాలేదు. కానీ ఇంటికి వెళ్లి భార్య, పిల్లలతో లేదా గ్రామస్తులతో గొడవ పడితే రూ.5 వేల జరిమానా విధిస్తారు. 

గస్తీ కాశాం
మద్యం గ్రామంలో ఎక్కడా ఉండకూడదని తీర్మానం చేసుకున్నాం. తీర్మానం చేసుకున్న తరువాత కొద్దిరోజులు యువతంతా రాత్రులు గ్రామ చివార్లో గస్తీ కాశాం. అప్పటి నుంచి ఎవరూ మద్యం జోలికి పోవడం లేదు. 
– మువ్వల, విజయ్‌కుమార్, యూత్‌ కమిటీ ప్రెసిడెంట్,

గ్రామం ప్రశాంతంగా ఉంది
ఎప్పుడైనా సాయంత్రం అయితే పిల్లలు, ఆడవాళ్లు భయపడేవాళ్లు. ఎటు నుంచి ఏ గొడవ వస్తుందో.. ఇంటినుంచి వెళ్లిన వారు ఏ తగవు తెస్తారో అని ఆందోళన చెందేవాళ్లం. ఇప్పుడా సమస్య ఎక్కడా లేదు.
– కొండగొర్రి లక్ష్మి, కార్యదర్శి, స్వయం సహాయక సంఘం, మెట్టవలస.

సారా మహమ్మారిని తరిమేశారు
కొత్తవలస (శృంగవరపుకోట): ఒకప్పుడా గ్రామంలో సారా తయారీ మూడు పీపాలు.. ఆరు సీసాలుగా సాగేది. మద్యం మత్తులో భర్తలు జోగుతుంటే.. ఇల్లు గడవడానికి గృహిణులు కూలి పనులకు వెళ్లేవారు. బడి ఈడు పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా తల్లికి సాయంగా ఇంట్లో ఉండేవారు. ఇదంతా గతం.. ఉపాధ్యాయిని దంతులూరి కృషికి తోడు.. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే సంపూర్ణ మద్య నిషేధానికి శ్రీకారం చుట్టడంతో మద్యానికి దూరమైందా గ్రామం. అదే.. కొత్తవలస మేజరు పంచాయతీ దిగువ ఎర్రవానిపాలెం.

నిలిచిన సారా తయారీ
ఒకప్పుడు సారా మహమ్మారి గ్రామంలో తాండవం చేస్తుండేది. ఏ ఇంటిలో కూడా ఇల్లాలు ప్రశాంతంగా ఉండేది కాదు. నిత్యం గొడవలతో  గ్రామం అగ్గిలా ఉండేది. ఇప్పుడు గ్రామంలో సారా తయారీ నిలిచిపోయింది. పిల్లా పాపలతో సంతోషంగా ఉంటున్నాం. సంపూర్ణ మద్య నిషేధానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆనందంగా ఉంది.
– దుంగ ఎర్నమ్మ, దిగువ ఎర్రవానిపాలెం 

బతుకులు బాగు
గతంలో సారా పూటుగా తాగి భార్యల్ని కొట్టడమే కాకుండా ఆరోగ్య సమస్యలతో బాధలు పడేవాళ్లం. ఇప్పుడు సారా మానేసి కూలి పనులకు వెళ్తూ హాయిగా బతుకుతున్నాం. స్వచ్ఛ గ్రామంగా తీర్చి దిద్దుకున్నాం.
– దుంగ అప్పారావు, దిగువ ఎర్రవానిపాలెం

జగనన్న స్ఫూర్తితో మద్య నిషేధం
బాడంగి (బొబ్బిలి) : సంపూర్ణ మద్య నిషేధానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్ననిర్ణయంతో ఆకులకట్ట గ్రామ మహిళలు స్ఫూర్తి పొందారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. నాలుగైదు నెలల క్రితం గ్రామంలో మ ద్యం బెల్టు దుకాణం ఉండేది. నవరత్నాల్లో ఒకటైన దశల వారీ మద్య నిషేదం హామీని వైఎస్‌ జగన్‌ ప్రకటించడంతో మహిళలు బెల్టు దుకాణంపై దండెత్తి మూసి వేయించారు. అప్పటినుంచి గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మినా.. తాగినా రూ.10 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుందని చాటింపు వేశారు. దీంతో ఆ గ్రామం మద్యనిషేధంలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో సుమారు 900మంది జనాభా ఉంటే.. మహిళలే అధికం కావడం విశేషం.


ఆకులకట్ట గ్రామం

జగనన్న హామీతో మేలు
రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధిస్తానని జగనన్న హామీ ఇచ్చారు. అది జరిగితే మాలాంటి కుటుంబాలకు మేలు జరుగుతుంది. గ్రామంలోని పలు స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్ల భర్తలు మద్యానికి బానిసలవుతూ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. అందుకే మహిళలందరం ఏకమై తిరగబడి బెల్టు దుకాణాలను మూయించి వేశాం. మద్య నిషేధాన్ని పాటిస్తున్నాం.
– రావిపల్లి కామేశ్వరి,  ఆకులకట్ట, బాడంగి. 

స్వచ్ఛంద నిషేధం
సీతానగరం (పార్వతీపురం): సంపూర్ణ మద్యపానానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకుంటున్న చర్యలతో మండలంలోని తాన్న సీతారాపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామస్తులు రెండేళ్లుగా స్వచ్ఛందంగా మద్య నిషేధం పాటిస్తున్నారు. రాష్ట్రీయ రహదారిని ఆనుకున్న గుచ్చిమి పంచాయతీ మధుర గ్రామం తాన్న సీతారాంపురంలో సుమారు 60 కుటుంబాలున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో ప్రశాంతత
గ్రామంలో మహిళలందరం ఐకమత్యంతో మద్యంపై దండెత్తి బెల్ట్‌ దుకాణాన్ని మూయించి వేశాం. అప్పటినుంచి గ్రామంలో ఎలాంటి తగాదాలు లేవు. ప్రశాంతంగా గడుపుతున్నాం. ఎవరైనా గ్రామంలోకి తెచ్చి తాగినా.. అమ్మినా జరిమానా ఉన్నందున భయపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కూడా సంపూర్ణ మద్య నిషేధానికి కంకణం కట్టుకోవడం మాకెంతో ధైర్యాన్నిస్తోంది.   – గొట్టాపు రాజేశ్వరి, ఆకులకట్ట, బాడంగి.       

నిషేధానికి జగనన్న భరోసా
గజపతినగరం: మండలంలోని సీతారామపురం గ్రామంలో 2016లోనే మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టింది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే విడతల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని ప్రకటించడంతో మరింత చైతన్యవంతమైంది. మద్య నిషేధానికి ముఖ్యమంత్రి ప్రారంభించిన కార్యాచరణతో గ్రామస్తులకు భరోసా దొరికింది. 

ధైర్యం వచ్చింది
మా గ్రామంలో మద్యం అమ్మరాదని తీర్మానించినా మద్యపానాన్ని అరికట్టలేకపోయాం. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే మద్యపాన నిషేధానికి తీసుకుంటున్న చర్యలతో మాకు ధైర్యం వచ్చింది. ఇక బయట కూడా మగవారు తాగి రాకూడదని తీర్మానం చేసుకుంటాం. 
– గెద్ద చంద్ర, సీతారామపురం

ఆనందంగా ఉంది
గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టాం. గ్రామంలో ఎలాంటి మద్యం క్రయవిక్రయాలు జరపరాదని తీర్మానించున్నాం. ఇంతలో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ మద్యపానాన్ని పూర్తిగా నిషేధించనున్నట్టు ప్రకటించడం మాకెంతో ఆనందంతా ఉంది.
– గెద్ద బంగారమ్మ, సీతారామపురం

>
మరిన్ని వార్తలు