మెరుపులు..మరకలు

21 Apr, 2018 11:48 IST|Sakshi
వి.వినయ్‌చంద్‌

కలెక్టర్‌గా వినయ్‌చంద్‌ వచ్చి నేటికి ఏడాది

విద్య, వైద్యంపై దృష్టి 

ఉపాధి కల్పనపై శ్రద్ధ

ప్రజలకు అందుబాటులో అంతంత మాత్రమే

జెడ్పీ సమావేశాలకు దూరం

ఒంగోలు కార్పొరేషన్‌పై కొరవడిన శ్రద్ధ

ఒంగోలు టౌన్‌ : జిల్లా కలెక్టర్‌గా వి.వినయ్‌చంద్‌ బాధ్యతలు స్వీకరించి నేటికి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది సమయంలో పూర్తిస్థాయిలో  క్రియాశీలకంగా పనిచేయలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యల పరిష్కారంలో చొరవ చూపలేకపోయారు. జిల్లా పాలనలో తనదైన ముద్ర ఇది..అని చెప్పుకోదగినవేవీ లేవు.  అయితే గతంలో నిరుపయోగంగా ఉన్న మినరల్‌ ఫండ్‌ నిధులను సద్వినియోగం చేశారు.  ఆ నిధులతో   రిమ్స్‌లో ప్లేట్‌లెట్‌ మిషన్‌ కొనుగోలు చేయించడంలో కీలకపాత్ర పోషించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రులకు సంబంధించిన వైద్య పరికరాల కొనుగోలు చేయించడంలో కూడా  శ్రద్ధ తీసుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత 

ఆర్ధిక సంవత్సరంలో 4.05 లక్షల కుటుంబాలకు ఉపాధి పనులు కల్పించడంలో కలెక్టర్‌ ముఖ్య భూమిక పోషించారు. 106.1 శాతం లేబర్‌ బడ్జెట్‌ సాధించి జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేశారు. జిల్లాలో  2.39 కోట్ల పనిదినాలు కూలీలకు కల్పించి రూ.601 కోట్ల ఖర్చు చేయడం ద్వారా జిల్లాను రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిపారు.  జిల్లాలో 540 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో కూడా చొరవ తీసుకున్నారు. అదేవిధంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ ఏర్పాటు విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కార్పొరేట్‌ స్కూల్స్‌కు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యను అందించేందుకు కృషి చేశారు.   

జెడ్పీ సమావేశాలకు దూరం: 
జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత కీలకమైన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాలకు వినయ్‌చంద్‌ దూరంగా ఉంటూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో  కలెక్టర్‌ లేకుండా జిల్లా పరిషత్‌ సమావేశాలు ఏమిటంటూ సభ్యులు బాయ్‌కాట్‌ చేసిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ వినయ్‌చంద్‌ జెడ్పీ సర్వసభ్య సమావేశాలకు దూరంగానే ఉంటున్నారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాగునీటిని అందించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా వందల కోట్ల రూపాయలతో ప్రతిపాదనల కోసం కలెక్టర్‌ అధ్యక్షతన సంబంధిత శాసనసభ్యులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధికార తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను మాత్రమే పిలిచి, ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యులకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఇదే విషయమై ఇటీవల జరిగిన ఒక సమావేశంలో సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్‌ జిల్లా యంత్రాంగం తీరును ఎండగడుతూ శాసనసభా కమిటీ ప్రివిలైజేషన్‌ కమిటీ దృష్టికి తీసుకువెళతానని స్పష్టం చేశారు.  

ఏడాదిలో ఒక్క విలేకరులసమావేశమూ లేదు..
కలెక్టర్‌గా వినయ్‌చంద్‌ బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలో ఒక్కసారి కూడా పాత్రికేయుల సమావేశం నిర్వహించకపోవడం విశేషం. ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలకు సంబంధించి కింది స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించే సమయంలో పాత్రికేయుల సమావేశాలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేయాలని పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఆయన వంతు వచ్చేసరికి మాత్రం ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. 

ఒంగోలు కార్పొరేషన్‌పై దృష్టేదీ..
ఒంగోలు మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ దానిపై ఆయన ముద్ర కనిపించలేదు. మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో చేపట్టే పనుల్లో అధికారపార్టీ నేతలు అడ్డగోలుగా టెండర్లు దక్కించుకొని పనులు చేసుకుంటున్నప్పటికీ వాటిని నియంత్రించడంలో వినయ్‌చంద్‌ మౌనంగా ఉండటం చర్చనీయాంశమైంది. అదేవిధంగా పర్చూరు మండలంలోని దేవరపాలెం దళితుల భూములను నీరు–చెట్టు కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వారిని భూముల్లో నుంచి వెళ్లగొట్టిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ సమయంలో జిల్లా కలెక్టర్‌ తగిన రీతిలో స్పందించలేదన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. 

కలెక్టర్‌ సమీక్షలంటే జాప్యమే..
కలెక్టర్‌ వినయ్‌చంద్‌ సమీక్ష సమావేశాలు ఉన్నాయంటే అధికారులు హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సమీక్ష సమావేశానికి సకాలంలో హాజరైతే ఆ సమావేశం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అధికారులు గంటల తరబడి ఫైళ్లు చేతిలో పెట్టుకొని ఎదురు చూడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో ఉదయం నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అధికారులు ఎదురు చూసిన ఘటనలు ఉన్నాయి. జిల్లా అధికారుల్లో అనేకమంది షుగర్‌తో బాధపడుతున్నారు. అన్ని గంటలపాటు వారు ఎదురుచూసే సమయంలో వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది.

ఎవరైనా ఆ ఒక్కరోజే!
జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ గోడు చెప్పుకునేందుకు ఎవరైనా వస్తే ఒక్కరోజు మాత్రమే ఆయనను కలుసుకునే అవకాశం ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం జరిగే మీకోసం కార్యక్రమంలోనే ప్రజలు  కలెక్టర్‌ను కలవాలని, మిగిలిన రోజుల్లో కలిసేందుకు మాత్రం అనుమతి ఉండటం లేదు. ఏదైనా అత్యవసర సమయాల్లో కలెక్టర్‌ను కలిసేందుకు ప్రయత్నించి విఫలమైన సందర్భాలు అనేకం చోటు చేసుకున్నాయి.  

మరిన్ని వార్తలు