సవాళ్లని అధిగమించి ఫలితాలు సాధిస్తాం

14 May, 2020 09:16 IST|Sakshi

మద్యం, ఇసుక అక్రమాలను నివారించి సీఎం జగన్‌ లక్ష్యాలను నెరవేరుస్తాం

ఎస్‌ఈబీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వినీత్‌ బ్రిజ్‌లాల్‌

డీజీపీ కార్యాలయంలో విధుల్లోకి కొత్త టీమ్‌

సాక్షి, అమరావతి: మద్యం, ఇసుక అక్రమాలను అడ్డుకోవడం తమ ముందున్న పెద్ద సవాళ్లని, వీటిని అధిగమించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశించిన లక్ష్యాలను సాధిస్తామని స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ–లిక్కర్‌ అండ్‌ శాండ్‌) కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ స్పష్టం చేశారు. మంగళగిరిలోని డీజీపీ ప్రధాన కార్యాలయంలో బ్రిజ్‌లాల్‌తోపాటు ఏడుగురు ఐపీఎస్‌లతో ఏర్పాటు చేసిన ఎస్‌ఈబీ కొత్త టీమ్‌ బుధవారం విధులు చేపట్టింది. ఈ సందర్బంగా వినీత్‌ బ్రిజ్‌లాల్‌ సాక్షితో మాట్లాడారు. (సీఎస్‌గా నీలం సాహ్ని కొనసాగింపు!)

► రాష్ట్రంలో మద్య నియంత్రణ, మద్యం అక్రమ రవాణా, మద్యం అక్రమ తయారీతోపాటు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు స్వయం ప్రతిపత్తి గల ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశాలతో ఎస్‌ఈబీ ఏర్పాటైంది.
► మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయం కేంద్రంగా డీజీపీ సవాంగ్‌ పర్యవేక్షణలో ఎస్‌ఈబీ పనిచేస్తుంది.  
► ఈ టీమ్‌లోకి త్వరలో మరో 11 మంది ఐపీఎస్‌లు కూడా రానున్నారు. రాష్ట్రంలో మొత్తం 18 పోలీస్‌ యూనిట్‌ (జిల్లాలు, అర్బన్‌ ప్రాంతాలు)లకు ఎస్‌ఈబీ టీమ్‌ లీడర్‌లను ఏర్పాటు చేస్తాం.
► నేరుగా పోలీస్‌ శాఖ రంగంలోకి దిగి పనిచేసే ఎస్‌ఈబీలో ఎక్సైజ్‌ శాఖ నుంచి కూడా అధికార సిబ్బందిని నియమిస్తాం. ఆయా జిల్లాల
పోలీసులను కూడా ఈ టీమ్‌లు వినియోగించుకుంటాయి. పోలీస్, ఎక్సైజ్, మైనింగ్‌ సిబ్బందితో కలసి మంచి ఫలితాలు సాధిస్తాం.

యువ ఐపీఎస్‌లకు జిల్లాల బాధ్యతలు
2015, 2016 బ్యాచ్‌లకు చెందిన ఏడుగురు యువ ఐపీఎస్‌ అధికారులకు జిల్లాల బాధ్యతలు కేటాయించారు. కె.ఆరిఫ్‌ హఫీజ్‌ (గుంటూరు రూరల్‌), గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ (తూర్పు గోదావరి), రాహుల్‌దేవ్‌ సింగ్‌ (విశాఖపట్నం రూరల్‌), అజిత వేజెండ్ల (విశాఖపట్నం సిటీ), గౌతమి శాలి (కర్నూలు), వకుల్‌ జిందాల్‌ (కృష్ణా), వై.రిషాంత్‌ రెడ్డి (చిత్తూరు) బాధ్యతలు కేటాయించారు.
  

మరిన్ని వార్తలు