వింజమూరి అనసూయాదేవి కన్నుమూత

25 Mar, 2019 02:03 IST|Sakshi

‘జయజయజయ ప్రియ భారత’ పాటకు బాణీ కట్టిన వింజమూరి 

సాక్షి, అమరావతి: ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని, ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు వింజమూరి అనసూయాదేవి (99) వయోభారంతో అమెరికాలోని హ్యూస్టన్‌లో ఆదివారం కన్నుమూశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన దేశభక్తి గీతం ‘జయజయజయ ప్రియ భారత‘ పాటకు బాణీ కట్టింది అనసూయనే. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920లో మే 12న జన్మించిన అనసూయాదేవి ఆలిండియా రేడియో ద్వారా జానపద గీతాలకు ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. జానపద గేయాలు రాయడం, బాణీలు కట్టడంలో, పాడడంలో అనసూయా దేవిది అందెవేసిన చేయి. హార్మోనియం వాయించడంలోనూ ఆమెకు అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. 1977లో ఆమెకు ఆంధ్రా విశ్వవిద్యాలయం ’కళాప్రపూర్ణ’ అనే బిరుదును, గౌరవ డాక్టరేట్‌ను ఇచ్చి సన్మానించింది.

అనసూయాదేవి అమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు. పారిస్‌లోనూ అనసూయాదేవికి ‘క్వీన్‌ ఆఫ్‌ ఫోక్‌’అనే బిరుదును ప్రదానం చేశారు. ఆమె రాసిన భావ గీతాలు, జానపద గేయాలు అనే రెండు పుస్తకాలను ఆమెకు 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా చెన్నైలో 2008 ఏప్రిల్‌ 12లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. జానపద సంగీతంపై ఆమె ఏడు పుస్తకాలను రచించారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఆమె పాట రికార్డ్‌ అయ్యింది. స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ, సుభాస్‌ చంద్రబోస్, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ లాంటి వారి సమక్షంలో అనుసూయాదేవి దేశభక్తి గీతాలు పాడారు. ఆమెకు ఐదుగురు సంతానం. అనసూయాదేవి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. అనసూయాదేవి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, దేశభక్తి గీతాలు, జానపద గీతాలాపనతో కళామతల్లికి సేవ చేశారని చంద్రబాబు కొనియాడారు.  

అనసూయదేవి మృతిపై సీఎం కేసీఆర్‌ సంతాపం 
సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ జానపద కళాకారిణి, రేడియో వ్యాఖ్యాత వింజమూరి అనసూయాదేవి(99) మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనడంతో పాటు వివిధ సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన అనసూయాదేవి రేడియో వ్యాఖ్యాతగా సుపరిచితురాలని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

వింజమూరి అనసూయాదేవి మృతికి జగన్‌ సంతాపం 
ప్రఖ్యాత తెలుగు గాయని డాక్టర్‌ వింజమూరి అనసూయాదేవి మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. విషాదంలో ఉన్న అనసూయాదేవి కుటుంబీకులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

మరిన్ని వార్తలు