కొండంత అండగా ఉంటా..

15 Feb, 2015 00:16 IST|Sakshi
కొండంత అండగా ఉంటా..

గిరిగ్రామాల్లో తిరిగిన ఎంఎల్‌ఏ కిడారి వారి సమస్యలపై ఆరా
 గిరిజనులతో మమేకం
తుపాను బాధితులకు భరోసా

 
అరకులోయకు 7 కిలోమీటర్ల దూరంలో చినలబుడు పంచాయతీ, దొరవలస గ్రామం. 60 కుటుంబాలు నివశిస్తున్నారు. వీధి రోడ్లు, మురుగుకాలువల్లేవు. వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. అరకులోయకు 10 కిలోమీటర్ల దూరంలో మాదల పంచాయతీ నందివలస గ్రామం ఉంది. ఇక్కడి మెదర్‌సోలాలో తుఫాన్‌కు సర్వం కోల్పోయిన 5 కుటుంబాలు ప్రభుత్వ పాఠశాల రేకుల షెడ్డులో తలదాచుకుంటున్నారు.  వీరికి ఎటువంటి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంఎల్‌ఎ కిడారి సర్వేశ్వరరావు సాక్షి రిపోర్టరుగా మారి వీరందరి సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ రెండు గ్రామాల్లో ఎమ్మెల్యే కలియతిరిగారు.కష్టనష్టాలను కళ్లారా చూశారు.  - అరకులోయ
 
 నాయకులు కేవలం ఓట్ల కోసం ఎన్నికల సమయంలోనే గ్రామాలకు వెళ్లి వంగి వంగి దండాలు పెడుతుంటారు. ఎన్నికలు ముగిస్తే ముఖం చాటేస్తుంటారు. పగ్గాలు చేతికి రాగానే ఇక ప్రజ లతో ఏముందిలే... అన్న ధోరణిలో వ్యవహరిస్తుంటారు. ఈ కారణంగానే దశాబ్దాలు గడిచినా ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేకపోతున్నాయి. ఇన్నాళ్లు వీరి సమస్యలపై అక్షర యజ్ఞం చేస్తు న్న ‘‘సాక్షి’’ దినపత్రిక ‘ప్రజలకు-ప్రజాప్రతినిధుల’కు మధ్య వారధిగా నిలిచి, వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపే ప్రయత్నం చేసింది. ఆంధ్రఊటీ అరకులోయ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన కిడారి సర్వేశ్వరరావు సాక్షి రిపోర్టర్‌గా అవతారమెత్తారు. హుద్‌హుద్ ప్రభావానికి కొండచరియలు విరిగిపడి  అయిదుగురు సజీవసమాధి అయిన మెదర్‌సోలా ఆదిమజాతి గిరిజనులకు ఏర్పాటు చేసిన నందివలస పునరావాస కేంద్రంతోపాటు కాఫీ, మిరియాలు, సిల్వర్‌ఓక్ చెట్లు పడిపోయి తీవ్ర నష్టాన్ని మిగిల్చిన చినలబుడు పంచాయతీ, దొరవలస గ్రామాలకు వెళ్లారు. పీటీజీల చీకటి బతుకులను కళ్లారా చూశారు. కిలో మీటరు దూరం నడిచి కొండలెక్కి నష్టాన్ని పరిశీలించారు. అంగన్ వాడీ కేంద్రాలే కాదు...ప్రతీ గడపకు వెళ్లి ప్రజల కష్ట సుఖాలను ఓపిగ్గా విన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి  కృషి చేస్తానంటూ భరోసా ఇచ్చారు. ఆయనే ఈ వారం మన ‘వీఐపీ రిపోర్టర్’    
 
 ఎ కిడారి సర్వేశ్వరరావు: నాన్నా ఎలా ఉన్నావ్?  హుద్‌హుద్ తుఫాన్‌కు ఏ పంటలకు నష్టం వాటిలింది?
ముసిరి సింహాద్రి: కాఫీ, మిరియాలు, సిల్వర్ ఓక్ చెట్లకు తీవ్ర నష్టం వాటిల్లింది సారూ..
ఎ కిడారి : ఎన్నెకరాల్లో కాఫీ వేశారు? నష్ట పరిహారమేమైనా అందిందా?
సింహాద్రి: మూడు ఎకరాల్లో కాఫీ వేశానయ్యా.. ఎకరన్నరలో కాఫీ పర్తిగా పోయింది. సిల్వర్ ఓక్ చెట్లు 200కు పైగా నేలకొరిగాయి.మిరియాలు తీగలు పడిపోయాయి. పరిహారం ఇస్తామని అధికారులు అన్నారుగానీ పైసా ఇవ్వలేదు.
 
ఎ కిడారి: అమ్మా బాగున్నారా? పిల్లలకు అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందుతుందా?  
కొర్రా గున్నమ్మ:  ఊళ్లో మిని అంగన్‌వాడీ కేంద్రముంది. అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి గతంలో చాలాసార్లు కొలతలు తీసారు. నేటి
భవనం కట్టలేదు. వర్షాకాలంలో చిన్నారులు, అంగన్‌వాడీలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నాం.
ఎ కిడారి:  అంగన్‌వాడీ భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటా.
 
ఎ కిడారి : అమ్మా, గ్రామంలో సమస్యలేమైనా ఉన్నాయా? ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్నారా?
వంతాల కొండమ్మ: తాగడానికి నీళ్లు లేవయ్యా.మురికి కాలువలు లేవు.. వీధి రోడ్లు లేవు. వర్షమొస్తే సేనా కష్టంగా ఉంటాది. ఇందిరమ్మ బిల్లులు ఇవ్వలేదు. ఇళ్లు అలాగే ఉండిపోయాయి. సీహెచ్‌డబ్ల్యుగా పనిచేస్తున్నాను. ఏడాదిన్నర నుండి జీతం లేదు.
ఎ కిడారి : అధికారులతో మాట్లాడి వేతనాలు అందించేలా చూస్తాను. తాగునీటి సమస్య, మురుగు కాలువలు, వీధి రోడ్లు నిర్మించేందుకు చర్య తీసుకుంటాను.
 
ఎ కిడారి : నాన్న బాగున్నావా! ఏంటీ నీ సమస్య?
కొర్రా రామన్న: ఈ ఏడాది వరితోపాటు కూరకాయలు సాగు చేశాం. పంటలన్ని పోయాయి. కాఫీ తోటలు ధ్వంసమయ్యాయి. పైసా పరిహారం ఇవ్వలేదు. పిల్లల చదువుకు కష్టంగా మారింది.
 
ఎ కిడారి : హుద్‌హుద్‌కు దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వ పరిహారం అందిందా?
అప్పన్న: సార్ తుఫాన్‌కు ఆరు ఇళ్లు పడిపోయాయి. అధికారులు వచ్చి ఫోటోలు తీశారు. వివరాలు రాసుకువెళ్లారు. పైసా పరిహారం ఇవ్వలేదు.
ఎ కిడారి : ఈ సమస్యను జగన్‌మోహాన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాను. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
 
ఎ కిడారి :ఆరోగ్యం ఎలా ఉంది ? పరిహారం అందిందా?
గెమ్మెలి రామన్న: ఆరోగ్యం పరవాలేదు సార్, ప్రభుత్వం నుండి రూ. 5 లక్షలు ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డిబాబు రూ. 2.50 లక్షలు ఇచ్చారు.  
ఎ కిడారి : తుఫాన్ తరువాత మీ ఊరొచ్చాను, గుర్తుందా?  రూ. 7 లక్షలు పరిహారం ఇవ్వాలి కదా..
గెమ్మెలి రామన్న : మీరు మా ఎమ్మెల్యే.. బియ్యం గట్రా ఇచ్చారు, ఎలా మరుస్తాం సారూ! పరిహారం కోసం ఏమీ చెప్పలేదు సార్.
ఎ కిడారి : రోడ్డు మీద వంటలు చేసుకుంటున్నారు. మోడల్ కాలనీ నిర్మించలేదా?
గెమ్మెలి రామన్న : ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు కలిసి మోడల్ కాలనీ నిర్మిస్తామని జాగా చేశారు. కానీ ఏం జరగలేదు. పునరావాస కేంద్రంలో రోడ్డుపైనే వంటలు చేసుకొని వరండాలోనే పడుకుంటున్నాము..
 
ఎ కిడారి : అమ్మా ఈ ఇళ్లు ఎప్పుడు కట్టావు, డబ్బు ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా?
గెమ్మెలి సొర్రుబుడ్డి: అయ్యా తుఫాన్‌కు ఇళ్లు కూలిపోయింది. పరిహారం ఇస్తామంటే అప్పు చేసి లింటల్ వరకు నిర్మించుకున్నాము. పైసా పరిహారం ఇవ్వలేదు. పైకప్పు వేసుకోలేక ఉపాధి పథకం ద్వారా ఇచ్చిన తార్పలిన్ పైన వేసుకొని ఉంటున్నాం.
 
 
ఎ కిడారి : ఏం బాబు ఏంటీ నీ సమస్య?
- గెమ్మెలి అప్పన్న:  నా కొడుక్కి ఫించన్ ఇవ్వలేదు. మానసిక వికలాంగుడు. ఫించన్ కోసం చాలాసార్లు దరఖాస్తు చేసినం. మంజూరు చేయలేదు.
ఎ కిడారి : ఫించన్ వచ్చేలా చూస్తాను.  
 
దొరవలస గ్రామమంతా చూశాను....ప్రజల సమస్యలు తెలుసుకున్నాను. తుపాను భాదితులకు పరిహారం ఇవ్వలేదని, అంగన్‌వాడీ భవనం లేదని, పంట నష్ట పరిహారం అందించలేదని...గ్రామంలో వీధి రోడ్లు, మురుగుకాలువలు లేవని, ఇలా ప్రతీ ఒక్కరూ తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు.  నందివలస పునరావాస కేంద్రంలో నివాస ముంటున్న మొదర్‌సోలాలో హుద్‌హుద్ బాధితులకు పరిహారం పూర్తిగా అందలేదు.  మోడల్ కాలనీ నిర్మిస్తామని చెప్పి నేటికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో స్వయంగా నివాస గృహాలు నిర్మించుకుంటున్నామని బాధితులు చెప్పారు.  ఈ గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా... అధికారులతో మాట్లాడతా...గుర్తించిన సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా...
 - కిడారి సర్వేశ్వరరావు, ఎమ్మెల్యే, అరకులోయ.
 

మరిన్ని వార్తలు