జ్వరం..కలవరం

22 Dec, 2018 12:32 IST|Sakshi
కిటకిటలాడుతున్న చిన్న పిల్లల వార్డు

చిన్నారులపై వాతావరణ మార్పుల ప్రభావం

కిటకిటలాడుతున్న ఆసుపత్రులు

తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : శీతాకాలం ప్రారంభం కావడంతో కొన్ని రోజుల నుంచి వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కొన్ని రోజులగా జిల్లాలో పగలు ఎండ, రాత్రి విపరీతమైన చలి వేస్తోంది. వేకువ జామున విపరీతమైన మంచు కూడా కురుస్తుంది. వీటి కారణంగా వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వస్తున్నాయని, న్యూమోనియా, బ్రాంకైటిస్‌ వాంటి వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. చలి, పొగ మంచు కారణంగా ఇవి వ్యాపిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటుమలేరియా, చికెన్‌పాక్స్‌ (పొంగు) కూడా సోకుతున్నాయి. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో చిన్న పిల్లల ఓపీ బాగా పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. గతంలో రోజు 100–140 మంది చిన్నారులుగా రాగా 10 రోజుల నుంచి రెట్టింపు సంఖ్యలో ఓపీకి వస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని ఆస్పత్రిలోని వార్డులో అడ్మిట్‌ చేస్తున్నారు. పిల్లల సంఖ్య పెరగడంతో ఒక్కో మంచంలో ఇద్దరిని పడుకోబెడుతున్నారు. చిన్న పిల్లలే గాక వృద్ధులు, చాలా మంది మహిళలు జ్వరంతో బాధపడుతున్నారు. ప్రొద్దుటూరులోని అనేక ప్రైవేట్‌ ఆస్పత్రులు కూడా చిన్న పిల్లలతో కిటకిట లాడుతున్నాయి. ప్రొద్దుటూరుతో పాటు ఎర్రగుంట్ల, మైదుకూరు, దువ్వూరు, రాజుపాళెం, కమలాపురం, కొండాపురం, ముద్దనూరు తదితర మండలాల నుంచి చిన్న పిల్లలను తీసుకొని వస్తున్నారు.

కిటకిటలాడుతున్న ల్యాబ్‌లు
జ్వరం సోకిన చిన్న పిల్లలతో ల్యాబ్‌లు కిటకిట లాడుతున్నాయి. వ్యాధి నిర్ధారణకు వైద్యులు రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించడంతో అందరూ పరీక్షల కోసం ల్యాబ్‌లకు పరుగులు తీస్తున్నారు. ప్రైవేట్‌ ల్యాబ్‌లు జ్వర పీడితులతో కిక్కిరిసి పోయాయి. వేల రూపాయలు రక్త పరీక్షల కోసం ధార పోస్తున్నారు.

వ్యాధుల లక్షణాలు
శ్వాసకోశ వ్యాధులైన బ్రాంకైటీస్, బ్రాంకోన్యూమోనియాతో ఎక్కువ మంది చిన్నారులు బాధపడుతున్నారు. జలుబు, శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండటం ఈ వ్యాధుల లక్షణాలు. వ్యాధి ముదిరితే శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చికెన్‌పాక్స్‌ వ్యాధికి గురైతే జ్వరం వస్తుంది. ఒళ్లంతా దద్దుర్లుతో కూడిన పొక్కులు వస్తాయి. విపరీతమైన దురద జలుబు కూడా ఉంటుంది. మలేరియా వ్యాధి బారిన పడిన వారికి జ్వరం కొంత సేపు ఉండి తగ్గిపోవడం, మళ్లీ రావడం జరుగుతుంది. రాత్రి సమయాల్లో చలి, వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలిచిన్నారుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
పిల్లలను ఎక్కువగా చలిలో తిరగకుండా చూడాలి.
ఫ్రిజ్‌ నీరు కాకుండా గోరువెచ్చని నీటిని తాగించాలి.
చల్లని పదార్థాలు, శీతల పానియాల జోలికి వెళ్లకుండా చూడాలి.
దోమలు కుట్టకుండా దోమతెరలు, ఇతర నివారణ సాధనాలు వాడాలి.
కలుషిత నీరు తాగకుండా చూసుకోవాలి.

జ్వరం కేసులుఎక్కువగా వస్తున్నాయి
కొన్ని రోజుల నుంచి చిన్న పిల్లల్లో జ్వరం, జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నాయి. చాలా మందిలో తట్టు కూడా ఉంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో చిన్న పిల్లల్లో ఈ తరహా వ్యాధులు ప్రబలుతున్నాయి. పిల్లల్లో జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. పిల్లల ఆరోగ్యంపై అశ్రద్ధ చేయవద్దు.– డేవిడ్‌ సెల్వన్‌రాజ్, చిన్న పిల్లల వైద్యుడు, ఆర్‌ఎంఓ, జిల్లా ఆస్పత్రి, ప్రొద్దుటూరు

మరిన్ని వార్తలు