అమ్మో.. జ్వరం

29 Sep, 2019 09:34 IST|Sakshi
గుంటూరు జీజీహెచ్‌లో జ్వరంతో చికిత్స పొందుతున్న చిన్నారులు

జిల్లా వ్యాప్తంగా జ్వరాలతో అల్లాడుతున్న చిన్నారులు 

దోమలు, అపరిశుభ్రమైన వాతావరణమే కారణం

జీజీహెచ్‌లో ప్రతి రోజూ  20 మందికి పైగా చికిత్స

సాక్షి, గుంటూరు : ఇంటిల్లిపాదిని సందడి చేస్తూ ఉండాల్సిన పిల్లలు జ్వరాలతో మంచం పడుతున్నారు. స్నేహితులతో పాఠశాలలకు ఉల్లాసంగా వెళ్లాల్సిన చిన్నారులు ఆస్పత్రుల గడప తొక్కుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పిల్లలు జ్వరాలతో బాధ పడుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం విష జ్వరాలతో ముప్పాళ్ల మండలం, నరసరావుపేట పట్టణాల్లో ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు.  

జీజీహెచ్‌లో ప్రతి రోజూ 20 పిల్లలు
గుంటూరు జీజీహెచ్‌లో ప్రతి రోజూ 20 మంది పిల్లలు వివిధ రకాల జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్‌ ఫీవర్, నిమోనియా సమస్యలతో ఆస్పత్రిలో చేరుతున్నారు. గుంటూరు జిల్లాలో చిన్నపిల్లల వైద్య నిపుణులు 215 మంది ఉన్నారు. ప్రతి వైద్యుడి వద్దకు రోజూ 60 నుంచి 100 మంది పిల్లలను జ్వరాల చికిత్స కోసం తీసుకొస్తున్నారు.  

జ్వరాల లక్షణాలు
చలి జ్వరం, జాయింట్‌ నొప్పులు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, శరీరంపై ఎర్రటి గుల్లలు, కడుపులో నొప్పి, బీపీ తగ్గిపోవటం, మూత్రం సక్రమంగా రాకపోవటం, నీరసం తదితర లక్షణాలు జ్వరాల బారిన పడిన పిల్లల్లో కనిపిస్తాయి.  జ్వరం సోకిన పసి కందులు సరిగ్గా తల్లిపాలు తాగలేక ఏడుస్తుంటారు. మూత్ర సమస్య వస్తుంది.    
జ్వరం మూడు రోజులకు మించితే.. 
సాధారణంగా జ్వరం మూడు రోజులు ఉంటుంది.  వైద్య పరీక్షలు జ్వరం వచ్చిన మూడు రోజుల తరువాత మాత్రమే చేయించాలి. ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్‌లెట్స్‌ తగ్గుతాయి. సాధారణంగా 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్‌లెట్స్‌ ఉంటాయి. వీటి సంఖ్య 40 వేలకన్నా తక్కువగా ఉన్నా ప్రమాదం ఉండదు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడి అవి పగిలి రక్తం రావడం, మూత్రంలో రక్తం కారడం, దగ్గుతున్నప్పుడు రక్తం పడడం, పళ్లు తోముకుంటున్నప్పుడు రక్తం రావడం, ముక్కులో నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తే ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాల్సి ఉంటుంది.

జీజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలు 
జ్వరాలు సోకిన పిల్లలకు జీజీహెచ్‌లో ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్నాం పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్‌ పెనుగొండ యశోధర తెలిపారు. ప్రతి రోజూ 20 మంది వరకు జ్వరాలు సోకిన పిల్లలు వస్తున్నారన్నారు. ఆగస్టులో 85 మందికి, సెప్టెంబర్‌లో 181 మంది జ్వరాలు సోకిన పిల్లలకు సేవలందించామని తెలిపారు. నాతోపాటు అసోసియేట్‌ ప్రొఫెసర్లు  బీ దేవకుమార్, ఎలిజబెత్, రామిరెడ్డి, పేరం ఝాన్సీరాణి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు శివరామకృష్ణ, చాందిని, వీరేష్, బ్రహ్మయ్య, కరిముల్లా, దీపక్, సునీత, వాణీభాయ్,  పీజీ వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు.

జాగ్రత్తలు పాటించండి
జ్వరం వారం రోజులపాటు ఉంటుంది. జ్వరం తగ్గినా 48 గంటల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లేట్‌లెట్లు, బీపీ తగ్గిపోవడం, మూత్రం రాకపోవడం వంటి లక్షణాలు జ్వరం తగ్గిన 48 గంటల తర్వాత బయటపడతాయి. కొబ్బరి నీరు, మజ్జిగ, పండ్ల రసాలు, ఓఆర్‌ఎస్‌ ద్రావణం పిల్లలకు తాగించాలి. జ్వరం వచ్చిన మూడు, లేదా నాలుగో రోజు మాత్రమే వైద్య పరీక్షలు చేయించాలి. వైద్యుల సలహా లేకుండా మందులు వాడకూడదు. ఇంట్లో, స్థానికంగా అందుబాటులో ఉండే అర్హత లేని వారితో సెలైన్లు పెట్టించి పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టవద్దు. అందుబాటులో ఉన్న మెరుగైన వైద్యశాలలో మాత్రమే పిల్లలకు చికిత్స తీసుకోవాలి. 
– డాక్టర్‌ తిమ్మాపురం చంద్రశేఖరరెడ్డి, పిల్లల వైద్య నిపుణుల సంఘం సెక్రటరీ.

దోమతెరలు వాడండి 
దోమల ద్వారా డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా, వైరల్‌ జ్వరాలు, ఫైలేరియా లాంటి వ్యాధులు వస్తున్నాయి. దోమల పెరుగుదలకు అపరిశుభ్రమైన వాతావరణమే కారణం. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యం. మురుగు, వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పనికిరాని వస్తువులు, వినియోగించని వాటిని బయటపడేయాలి. టైర్లు, కొబ్బరి బొండాలు దోమలు ఆవాసాలుగా ఉంటాయి. దోమ తెరలు వాడటం చాలా మంచిది. చేతులు పూర్తిగా కప్పి ఉండే వస్త్రాలను ధరించాలి.  
– డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు