విర్రవీగితే నష్టపోతారు

11 Jul, 2015 01:35 IST|Sakshi

తుళ్లూరు : కృష్ణాజిల్లా ముసునూరు  తహశీల్దార్ వనజాక్షిపై దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఉద్యోగులు రోడ్డెక్కారు. శుక్రవారం తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి గ్రంథాలయం సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరిగి సీఆర్‌డీఏ కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. కార్యాలయం గేటు మూసివేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించారు. కార్యాలయం వద్ద బైఠాయించి ‘ఉద్యోగులపై రాజకీయనాయకుల దౌర్జన్యం నశించాలి. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముసులూరు ఎస్‌ఐ ని తక్షణమే సస్పెండ్ చేయాలని’ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా సీఆర్‌డీఏ అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవులు మాట్లాడుతూ తహశీల్దార్ వనజాక్షిపై జరిగిన దాడిని ఉద్యోగవ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించారు. అధికారమదంతో విర్రవీగిన వారంతా కాలగర్భంలో కలిసిపోయారని, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేసేంతవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.13 జిల్లాలకు చెందిన అన్ని శాఖల ఉద్యోగులను సమీకరించి పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగుల పై దాడులు జరిగితే ఉపేక్షించరాదని, ప్రజలు స్పందించి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. చట్టాలు చేసే వాటిని అమలు కాకుండా రాజకీయనాయకులు అడ్డుకోవడం మానుకోవాలని పలువురు డిప్యూటీ కలెక్టర్లు ఈ సందర్భంగా చెప్పారు. తహశీల్దార్ స్థాయి వ్యక్తికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లతో పాటు తహశీల్దార్లు, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు