పాడి రైతుకు అండ

27 Apr, 2020 12:06 IST|Sakshi
రైతులకు బోనస్‌ను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మజ్జి శ్రీనివాసరావు, అడారి ఆనంద్‌కుమార్‌ తదితరులు

కరోనా సమయంలో పాడిరైతుకు విశాఖ డెయిరీ ప్రోత్సాహం

మూడు నెలల ముందుగానే రూ.7.62 కోట్ల బోనస్‌ పంపిణీ

జిల్లాలో డెయిరీ పరిశ్రమ స్థాపనకు ప్రజాప్రతినిధుల వినతి

పశువిత్తనోత్పత్తి యూనిట్‌ ఏర్పాటుకు యాజమాన్యం అంగీకారం

మెరకముడిదాం: వ్యవసాయంతో పాటు పాడిరైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. పాడి పరిశ్రమను బలోపేతం చేసి రైతుల తో బాటు సంబంధిత పరిశ్రమలకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోంది. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన విశాఖ డెయిరీ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా ప్రభావంతో అన్ని వర్గాలతో బాటు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న పాడిరైతు లు కుదేలవ్వకూడదన్న ఆశయంతో విశాఖ డెయిరీ ఏడాదికి రెండుసార్లు ఇచ్చే బోనస్‌ను ముందుగానే ఇచ్చి వారిని ఆదుకుంటోంది. సాధారణంగా ఏడాదిలో జనవరి, జూన్‌లో బోనస్‌ ఇవ్వడం ఆనవాయితీ. 2020కు సంబంధించి జనవరిలో పాడిరైతులకు బోనస్‌ ఒకసారి, మళ్లీ జూన్‌లో ఇవాల్సినది మూడు నెలల ముందుగానే ఇచ్చేసింది. ఇలా జిల్లాలోని 34 మండలాల్లోగల 63,967 మంది రైతులకు రూ.7.62 కోట్లు బోనస్‌ చెల్లించింది.

జిల్లాలో 1,86,798 లీటర్ల పాలసేకరణ
జిల్లాలో 862 పాల సేకరణ కేంద్రాల నుంచి విశాఖ డెయిరీ 1,86,798 లీటర్ల పాలను రోజూ సేకరిస్తోంది. 63,967 వేల మంది పాడిరైతులు పాలు పోస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల్లో అత్యధికంగా పాడి రైతులు పాలు పోస్తున్నారు. ఈ నెల 25న మెరకముడిదాం మండలంలో జరిగిన బోనస్‌ పంపిణీ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నా యకులు జిల్లాలో డెయిరీ పరిశ్రమను స్థాపించాలని, అభివృద్ధి పనులు చేపట్టాలని విశాఖ డెయిరీ సీఈఓ ఆడారి ఆనందకుమార్‌ను కోరగా దానికి అంగీకరించడంతో పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

20 ఏళ్లుగా పాలు పోస్తున్నాం
20 సంవత్సరాలుగా విశాఖడెయిరీకి పాలు వేస్తున్నాను, అప్పటినుంచి ఇప్పటివరకూ నాకు అన్ని విధాలా తోడ్పడుతోంది. అందరికంటే ఎక్కువ పాలు వేస్తున్నందుకు డెయిరీ యాజమాన్యం బహుమతి కూడా ఇచ్చింది. మేమంతా గతంలో శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరగా 2012లో గర్భాంలో ఏర్పాటు చేశారు.  – చందకసాంబ, రైతు, గర్భాం,మెరకముడిదాం మండలం  

అభివృద్ధికి తోడ్పడాలి
పాడినే ఆధారంగా చేసుకుని జీవిస్తున్న లక్షలాది మంది రైతుల కోసం విశాఖ డెయిరీ ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని విశాఖ డెయిరీ యాజమాన్యాన్ని కోరాం. జిల్లాలో పాడి రైతుల సంక్షేమంతో బాటు ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాటుకు చొరవ చూపాలని. చీపురుపల్లి నియోజకవర్గంలోని ఎంతో వెనుకపడి ఉన్న మెరకముడిదాం మండలంలో రైతుల కోసం పరిశ్రమతో బాటు కల్యా ణ మండపాన్ని నిర్మించాలని సీఈఓ ఆనందర్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లాం. దానికి సూత్రప్రాయంగా అంగీకరించారు.– మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త

పాడి రైతుల అభ్యున్నతే ధ్యేయం
జిల్లాలోని పాడి రైతుల అభ్యున్నతికి వైఎస్సార్‌సీపీ నేతల సూచనల మేరకు అవసరమైన చర్యలు చేపడతాం. పశువిత్తనోత్పత్తి యూనిట్‌ ను చీపురుపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తాం. పాడిరైతుల కోసం మెరకముడిదాం మండలంలో కల్యాణ మండపాన్ని నిర్మిస్తాం. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు సూచనలు మేరకు జిల్లాలో అవసరమైన అన్ని చర్యలు చేపడతాం.
– ఆడారు ఆనంద్‌కుమార్, సీఈఓ,విశాఖ డెయిరీ, విశాఖపట్టణం

మరిన్ని వార్తలు