విశాఖ అద్భుతం

1 Aug, 2019 04:26 IST|Sakshi
ఐఎన్‌ఎస్‌ శివాలిక్‌ సిబ్బందితో గవర్నర్‌

వైఎస్సార్‌ పార్క్‌ చాలా బాగుందిఈఎన్‌సీని సందర్శించిన గవర్నర్‌

నేడు ఏయూలో మొక్కలు నాటనున్న విశ్వభూషణ్‌

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విశాఖలో విశ్వభూషణ్‌ హరిచందన్‌ పర్యటించారు. ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్‌కు జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్, పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కె మీనాతో పాటు ఇతర అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకున్నారు. ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఏకె జైన్‌ గవర్నర్‌కు గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ ఇచ్చారు. డేగాలో ఉన్న నేవీ యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లను గవర్నర్‌ బయటి నుంచే సందర్శించారు. డేగా నుంచి బయలుదేరి నేవల్‌ డాక్‌యార్డుని సందర్శించిన గవర్నర్‌ నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరుకున్నారు. యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లను సందర్శించారు.  

అక్కడి నుంచి గవర్నర్‌ బంగ్లాకు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు కైలాసగిరి బయలుదేరి వెళ్లారు. కైలాసగిరిపై ఉన్న తెలుగు మ్యూజియంను సందర్శించి అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి సిటీ సెంట్రల్‌ పార్కుని సందర్శించారు. బ్యాటరీ వెహికల్‌లో పార్క్‌ మొత్తం కలియదిరిగారు. అనంతరం మ్యూజికల్‌ ఫౌంటైన్‌ను తిలకించి పార్కులో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్ని తిలకించారు. అనంతరం గవర్నర్‌ బంగ్లాకు పయనమయ్యారు. అంతకు ముందు కైలాసగిరి పర్వతంపై మీడియాతో గవర్నర్‌ మాట్లాడారు. విశాఖ నగరం ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు. గతంలో 1977లో విశాఖను సందర్శించాననీ.. ఆ తర్వాత ఒకట్రెండు సార్లు వచ్చానని తెలిపారు.

నేడు ఏయూలో.. 
రెండు రోజుల పర్యటనలో భాగంగా..రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయం కులపతి విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి నేడు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌ ఏయూ పరిపాలనా భవనానికి చేరుకుంటారు. రెడ్‌క్రాస్‌ సౌజన్యంతో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఏయూ వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియం ప్రాంగణంలో మొక్కలు నాటి, అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. గవర్నర్‌ పర్యటనలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పాల్గొంటారు.

మరిన్ని వార్తలు