అభివృద్ధిని కోరుకుంటున్న గిరిజనం

9 Dec, 2019 08:44 IST|Sakshi

మావోయిస్టుల వారోత్సవాల్లో గిరిజనులు పాల్గొనకుండా యువత అడ్డుకుంది

జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ

సాక్షి, విశాఖపట్నం: గిరిజన ప్రజలంతా అభివృద్ధిని కోరుకుంటున్నారని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ అన్నారు. ఈ నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకూ మావోయిస్టులు నిర్వహించిన ప్రజా విముక్తి గెరిల్లా దళాల (పీఎల్‌జీఏ) వారోత్సవాల్లో గిరిజనులెవరూ పాల్గొనకుండా యువత అడ్డుకుందని.. ఈ విజయం గిరిజనులుదేనన్నారు. ఎస్పీ మీడియాతో ఆదివారం మాట్లాడారు. వారోత్సవాల సందర్భంలో గిరిజనులను మావోయిస్టులు బెదిరించి, భయపెట్టి సభలు, సమావేశాలు, స్థూపాల ఆవిష్కరణ అంటూ జనసమీకరణ చేస్తుంటారన్నారు. అలాగే  ప్రశ్నించే గిరిజన యువకులను పట్టుకుని ఇన్‌ఫార్మర్ల ముద్రవేసి చంపుతారని.. కానీ ఈసారి మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనుల నుంచి పెద్దఎత్తున నిరసనలు ఎదురయ్యావన్నారు.

సభలు, సమావేశాలు అంటూ తమను ఇబ్బంది పెట్టవద్దని, ప్రశాంతంగా తాము బతుకుతామని గిరిజనులు ఎదురించినట్టు పేర్కొన్నారు. వారోత్సవాలతో తమకు ఒరి గేదేమీలేదని చాలా గ్రామాల్లో మావోయిస్టు అగ్రనాయకులను గిరిజనులు ప్రశ్నించినట్లు సమాచారం ఉందని ఎస్పీ చెప్పారు. తమకు అభివృద్ధి కావాలని, అడ్డుకోవద్దంటూ గిరిజన యువత మావోయిస్టులను అడిగినట్లు తెలిసిందన్నారు. ఈ పరిణామాలకు మావోయిస్టులు ఏమి చెప్పాలో పాలుపోక వెనుదిరిగి వెళ్లిపోయినట్టు తెలిసిందని చెప్పారు. వారోత్సవాల పేరుతో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడుతుండేవారని, ఈమధ్య ఇన్‌ఫార్మర్లంటూ గిరిజనులను చంపడంతో కోపొద్రిక్తులైన గిరిజన యువత పెద్దఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేశారన్నారు.

వారోత్సవాల రోజుల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా మద్దిగురవు, బొయితిలి, బొంగరం, పాడేరు, చింతపల్లి, గూడెం, డుంబ్రిగుడ, కొయ్యూరు ప్రాంతాల్లో గిరిజన యువత పెద్దఎత్తున నిరసనలకు దిగడం ప్రత్యేకతగా నిలిచిందన్నారు. ఇంత పెద్దఎత్తున గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడం చూస్తుంటే మావోయిస్టులు చెప్పే బూటకపు మాటలు గిరిజనులు నమ్మడం లేదని అర్థమవుతుందన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు, ఆచరణకు సాధ్యంకాని మాటలు, పాటలతో జీవితాలు నాశనమవుతున్నాయని గ్రహించడం వల్లే ఈ వారోత్సవాల్లో గిరిజనలెవ్వరూ పాల్గొనడంలేదని యువత ద్వారా తెలియవచ్చిందన్నారు. వారోత్సవాల్లో మావోయిస్టులు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా గిరిజన యువత ముందుకొచ్చి సహకరించినందుకు ధన్యవాదాలని, ఈ విజయం గిరిజనులదేనని ఎస్పీ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మావోయిస్టులు గిరిజనుల మనసు తెలుసుకొని జనజీవన స్రవంతిలో కలిసి గిరిజనాభివృది్ధకి సహకరించాలన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.  

మరిన్ని వార్తలు