బాలకృష్ణ యాక‌్షన్‌.. పోలీసుల ఓవర్‌యాక్షన్‌

28 Oct, 2017 09:09 IST|Sakshi

ఏకబిగిన రోజంతా బీచ్‌రోడ్డులో జైసింహ షూటింగ్‌

కురుసురా నుంచి కోస్టల్‌ బ్యాటరీ వరకు రోడ్డు బ్లాక్‌ చేసిన పోలీసులు

సినిమా యూనిట్‌ తప్ప పిట్ట మనిషిని అనుమతించని దారుణం

నరకం చూసిన స్థానికులు, బీచ్‌ సందర్శకులు, వ్యాపారులు

వాహనాల మళ్లింపుతో ఇతర మార్గాల్లో ట్రాఫిక్‌ జామ్‌లు

పూరీ జగన్నాథ్‌ మార్కు డైలాగులా చెప్పాలంటే.. అభిమానులను తనదైన శైలిలో ‘లవ్‌’ చేసే సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన తాజా చిత్రం జైసింహ షూటింగ్‌తో విశాఖ ప్రజలనూ ‘లవ్‌’ చేస్తున్నారు..! సహజ అందాల నగరి విశాఖలో షూటింగ్‌ అంటే.. అది కూడా బీచ్‌ రోడ్‌లో అంటే పర్మిషన్లు తీసుకోవడం.. ఆ మేరకు పోలీసు అధికారులు ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వడం షరామామూలు. కానీ ఇక్కడ సీఎం చంద్రబాబు బావమరిది, మంత్రి లోకేష్‌ మామ, అధికార టీడీపీ శాసనసభ్యుడు, బాక్సాఫీస్‌ బొనాంజా.. నటసింహం.. ఇలా ఎన్నో విశేషణాలు, ప్రత్యేకతలు కలిగిన బాలకృష్ణ సినిమా షూటింగుకు.. అటువంటి నిబంధనలేమీ అక్కర్లేదు..

మహా అయితే షూటింగ్‌కు అనుమతి కోరుతూ ఓ లెటర్‌ పడేసుంటారు.. అంతే ఇక నిబంధనలన్నీ బఖాతర్‌.. బీచ్‌రోడ్డు సమీప ప్రాంతాల ప్రజల కష్టాలు, వ్యాపారుల ఇబ్బందులు, ట్రాఫిక్‌ సమస్యలూ బలాదూర్‌. స్థానిక ప్రజలతోపాటు పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకులు, సందర్శకులతో అత్యంత రద్దీగా ఉండే బీచ్‌ రోడ్డులో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏకబిగిన షూటింగ్‌..అందుకోసం.. అటు కిలోమీటరు.. ఇటు కిలోమీటరు పొడవునా అంతసేపూ ట్రాఫిక్‌ ఆంక్షలు. షూటింగ్‌ చేసే సినిమా యూనిట్‌, పోలీసులు తప్ప.. ఒక్క పిట్ట కూడా రోడ్డుపై నడవడానికి వీల్లేని..కర్ఫ్యూను తలపించే భయానక పరిస్థితి కల్పించేశారు మన పోలీసోళ్లు.. ఫలితం ఆ ప్రాంత ప్రజలకు రోజంతా ప్రత్యక్ష నరకం. ఇతర ప్రాంతాలపై ట్రాఫిక్‌ భారం.. వివరాల్లోకి వెళితే...

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రముఖహీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ 102వ చిత్రం జైసింహ షూటింగ్‌ కోసం శుక్రవారం బీచ్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను ఇష్టానుసారం మార్చేశారు. ఎటువంటి సమాచారం లేకుండా టాఫిక్‌ ఆంక్షలు పెట్టడంతో వాహనదారులు నానా ఇబ్బందులకు గురయ్యారు. ఆర్కే బీచ్‌ ఎన్టీఆర్‌ విగ్రహం పరిసరాల్లో షూటింగ్‌ జరుగుతుండగా... అటు కురుసురా సబ్‌మెరైన్‌.. ఇటు కోస్టల్‌ బ్యాటరీ వరకు రోడ్డు బ్లాక్‌ చేసేశారు. సినిమా షూటింగ్‌కు సంబంధించిన వాహనాలు మినహా మరే ఇతర వాహనాన్నీ పోలీసులు అనుమతించలేదు.

సినీ సన్నివేశం..
రాజకీయ పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వచ్చి ధర్నా చేయడం.. మానవహారంగా నిలబడటం... ఆ తర్వాత రోడ్డుకు అడ్డంగా పడుకుని ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించడం... దీంతో ఓ యాంగ్రీ పోలీస్‌ ఆఫీసర్‌ రంగప్రవేశం చేసి.. ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం.. అందరినీ చెల్లాచెదురు చేయడం. ఇదీ శుక్రవారం ఉదయం బీచ్‌రోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బాలయ్య బాబు తాజా సినిమా జై సింహ షూటింగ్‌ సన్నివేశం..

వాస్తవ దృశ్యం..
కట్‌ చేసి.. వాస్తవంలోకి వస్తే.. సరిగ్గా హీరో ఏ ట్రాఫిక్‌ ఇక్కట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారో.. అదే సీన్‌ షూటింగ్‌ వల్ల ఏర్పడిన ట్రాఫిక్‌ ఇక్కడట్లో నగర ప్రజలు ప్రత్యక్షనరకం చూశారు. ట్రాఫిక్‌ అస్తవ్యస్తం కావడంతో నానా అగచాట్లు పడ్డారు.

అప్పుడలా.. ఇప్పుడిలా..
సహజంగా బీచ్‌రోడ్‌లో సినిమా షూటింగ్‌లు ఎక్కువగానే జరుగుతుంటాయి. అయితే ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఉదయం వేళల్లో షూటింగ్‌లకు అనుమతిస్తుంటారు. ఇటీవల సూర్య సినిమా సింగం–3కి కూడా ఇదే మాదిరి యాక్షన్‌ సన్నివేశాలతో బీచ్‌రోడ్‌లో షూటింగ్‌ చేశారు. అంతెందుకు గతంలో బాలయ్య నటించిన చాలా సినిమాల షూటింగ్‌లు కూడా బీచ్‌రోడ్‌లో చేశారు. లెజెండ్‌ సినిమాలోని హై వోల్టేజ్‌ యాక్షన్‌ సీన్లు ఇక్కడే షూట్‌ చేశారు. అప్పుడు ఒకవైపు రోడ్డు మాత్రమే బ్లాక్‌ చేసి షూటింగ్‌ నిర్వహించారు. కానీ జై సింహ షూటింగ్‌ విషయానికి వస్తే మునుపెన్నడూ లేని విధంగా ఇష్టానుసారం వ్యవహరించారు, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏకబిగిన షూటింగ్‌ నిర్వహించేశారు. అంతవరకు ఒక్క పిట్టను కూడా ఆ రోడ్డులోకి అనుమతించలేదంటే అతిశయోక్తి కాదు.

దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. వాస్తవానికి అంబులెన్సులు, అత్యవసర సర్వీసుల వాహనదారులు సిటీలో ఎక్కువ ట్రాఫిక్‌ ఉంటుందనే ఉద్దేశంతో త్వరగా గమ్యాలకు చేరుకోవడానికి బీచ్‌రోడ్‌ను ఎన్నుకుంటారు. కానీ ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పూర్తిగా బీచ్‌రోడ్‌ను బ్లాక్‌ చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక బీచ్‌రోడ్‌లో అపార్టుమెంట్లలో నివసించేవారు తమ ఇళ్లకు చేరుకోవడానికి చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొందరు అపార్టుమెంట్స్‌ వాసులు తమ కార్లు ఎక్కడ పార్కు చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. బీచ్‌వైపు వచ్చే వాహనాలను దసపల్లా రోడ్‌ మార్గం ద్వారా మళ్లించారు. అయితే ఆ రోడ్డు చాలా చిన్నది కావడంతో విపరీతంగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఇక బీచ్‌కు వచ్చే సందర్శకుల పరిస్థితి దయనీయంగా మారింది. రోడ్డంతా బ్లాక్‌ చేయడం, వాహనాలు ఎక్కడ పార్క్‌ చేయాలో తెలియని స్థితిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్‌ సందర్శకులు లేక వెలవెలబోయింది.

ఖాకీలను మించిన బౌన్సర్ల యాక్షన్‌

ఇక పోలీసులకు మించి సినిమా నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్న బౌన్సర్లు చేసిన ఓవరాక్షన్‌ విమర్శలపాలైంది. ఉదయం 8.20 గంటల సమయంలో నోవోటెల్‌ సమీపంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆ మార్గంలో వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కోరగా, బౌన్సర్లు వారిపై దురుసుగా ప్రవర్తించారు. ఓ దశలో వారిపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. అయితే పరిస్థితి అదుపు తప్పకుండా అక్కడున్న పోలీసులు కలగజేసుకోవడంతో సద్దుమణిగింది.

మునుపెన్నడూ లేని విధంగా..
గతంలో ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు వచ్చినప్పుడు కూడా బీచ్‌ రోడ్డును ఈ విధంగా బ్లాక్‌ చేసిన దాఖలాల్లేవు. అత్యంత ప్రతిష్టాత్మక ఐఎఫ్‌ఆర్‌ నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఇలా బీచ్‌ను దిగ్బంధించిన పరిస్థితి లేదు. కానీ కేవలం బాలకృష్ణ సినిమా షూటింగ్‌ కోసం పోలీసులు ఇలా సాగిలపడటం విమర్శలపాలవుతోంది.

రెండు రోజులు షూటింగ్‌: ఏడీసీపీ మహేంద్రపాత్రుడు

కాగా, రెండు రోజులు(శుక్ర, శనివారం) బీచ్‌రోడ్డులోనే జైసింహ షూటింగ్‌కు అనుమతినిచ్చామని నగర ట్రాఫిక్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ మహేంద్రపాత్రుడు వెల్లడించారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని ప్రస్తావించగా.. వాస్తవమే... ఇబ్బంది పడ్డాం.. శుక్రవారం నాటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా పకడ్బందీ చర్యలు చేపడతామని చెప్పారు.

మరిన్ని వార్తలు