సవతే హంతకురాలు

28 Aug, 2019 07:34 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్‌

పుష్ప హత్యకేసును ఛేదించిన పోలీసులు

వివరాలు వెల్లడించిన పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్‌

సాక్షి, అరకులోయ: అరకులోయలో సమీపంలో శనివారం జరిగిన కిల్లో పుష్ప హత్యకేసును పోలీసులు ఛేదించారు. మహేష్‌ మొదటి భార్యే ఈ హత్య చేసినట్టు  పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్‌ మంగళవారం రాత్రి విలేకరులకు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహేష్‌కు  కిల్లో పుష్ప రెండో భార్య.  మహేష్, రాజేశ్వరి  ప్రేమించుకుని 2014లో వివాహం చేసుకున్నారు. అయితే చినలబుడు గ్రామానికి చెందిన గిరిజన యువతి కిల్లో పుష్పను మహేష్‌ రెండో పెళ్లి చేసుకుని, ఈనెల 1న అరకులోయ ‘సి’ కాలనీలో వేరే కాపురం పెట్టాడు. మొదటి భార్య రాజేశ్వరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహేష్‌ రెండో పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక రాజేశ్వరి, రెండో భార్యగా వచ్చిన కిల్లో పుష్పపై కక్ష పెంచుకుంది.

ఈనెల 23వతేదీ రాత్రి 9గంటల సమయంలో భర్త మహేష్‌కు ఆరోగ్యం బాగోలేదని నమ్మించి,  సి కాలనీలో ఉన్న పుష్పను శరభగుడలో ఉన్న తన ఇంటి వైపునకు రాజేశ్వరి తీసుకెళ్లింది.  ఆ మార్గంలోని నీలగిరి తోటల వద్ద పుష్పపై దాడి చేసి,ఆమె చున్నీతో గొంతు నులిమి హత్య చేసినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ చెప్పారు.పుష్పను హత్య చేసిన రాజేశ్వరి...లైంగికదాడిగా నమ్మించే ప్రయత్నంలో ఆమె శరీరంపై దుస్తులు తొలగించిందని తెలిపారు. పుష్పపై లైంగికదాడి జరగలేదని,రెండవ భార్యగా వచ్చిందనే కోపంతోనే పుష్పను, మహేష్‌ మొదటి భార్య రాజేశ్వరి హత్య చేసిందని డీఎస్పీ తెలిపారు.

గిరిజన మహిళ అయిన కిల్లో పుష్పను హత్యచేసిన రాజేశ్వరి గిరిజనేతర మహిళ కావడంతో ఆమెపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి,అరెస్ట్‌ చేశామని తెలిపారు. కేసు విచారణ కొనసాగుతుందని,  ప్రాథమిక దర్యాప్తులో రాజేశ్వరి మొదటి నిందితురాలిగా గుర్తించామని, విచారణ పూర్తయిన వెంటనే ఈకేసులో మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు.ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు కావడంతో హత్యకు గురైన గిరిజన మహిళ  కిల్లో పుష్ప కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.ఈ సమావేశంలో అరకు సీఐ,ఎస్‌ఐలు పైడయ్య,అరుణ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా