ఉత్సవ్‌ తరంగం..

30 Dec, 2019 08:24 IST|Sakshi

 విశాఖ ఉత్సవ్‌ వైభవోపేతం

సాగరతీరంలో సాంస్కృతిక తరంగం

పుష్ప సోయగ సందర్శనకు ఉరకలేసిన జనం

గతం కంటే ఘనమని ప్రశంసల వర్షం

నలుదిశలా జన ఉప్పెనతో స్తంభించిన నగరం

 సకాలంలో స్పందించిన పోలీస్‌ యంత్రాంగం 

సాక్షి, విశాఖపట్నం: జనమా.. తీరాన వీచిన ప్రభంజనమా! నగరమా.. నవ్యోత్సాహ తరంగాల సాగరమా! ఆదివారం సాయంత్రం అగుపించిన విచిత్రాన్ని చూస్తే కలిగిన సందిగ్ధమిది. చలికాలం సాయంత్రం ఉప్పొంగిన ఉత్సాహాన్ని చూస్తే తలెత్తిన సందేహమిది. ఉత్సవ సంరంభంతో విశాఖ అంతా హోరెత్తిపోయింది. అపూర్వరీతిలో ఎగసిన ఉత్తేజంతో సాగర నగరమంతా ఉప్పొంగిపోయింది. ఆవంక సాగర తీరంలో రాత్రివేళ.. సాంస్కృతిక కార్యక్రమాల హరివిల్లు విరిస్తే.. ఇటు నగర మధ్యంలోని వైఎస్సార్‌ పార్క్‌లో ఉప్పొంగిన పూల కెరటం ఉల్లాసపు జల్లుల్ని కురిపించింది. బీచ్‌లో వేల దీపాల వెలుగుల మధ్య జిగేల్‌మన్న సాంస్కృతిక సంరంభం.. ప్రజానీకాన్ని సమ్మోహితుల్ని చేసింది. విభిన్న కళా ప్రదర్శనలకు వినోదం మిళితం కాగా.. సాగరతీరం ఉత్సాహంతో ఊగిపోయింది. ప్రముఖుల ఆటామాటా మరింత సంతోషాని్న చ్చింది. ఉత్సవ ఉత్సాహంతో ఊరంతా సాగరతీరం వైపే ఉరకలేయగా.. ట్రాఫిక్‌ స్తంభించింది. ఎక్కడికక్కడ జన గమనానికి ఆటంకం కలిగింది. పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి చక్కబడింది. అపూర్వమైన సంబరాన్ని తిలకించిన సంభ్రమంతో నగరం పరవశించింది.  

వెంకిమామ సందడి  
విశాఖ ఉత్సవ్‌ ముగింపు వేడుకల్లో హీరో వెంకటేష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జోక్స్‌తో ప్రేక్షకుల్ని నవి్వంచారు. విశాఖతో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. వైజాగ్‌ వస్తే సొంత ఇంటికి వచ్చినట్లు ఉంటుందన్నారు. సంప్రదాయాలను పాటించడం, వినోదాన్ని పంచడంలో విశాఖవాసుల ప్రత్యేకతే వేరని కొనియాడారు. వెంకి మామ చిత్రంలోని పలు డైలాగ్స్‌ను చెప్పి ప్రేక్షకుల్ని అలరించారు.  

ఉత్సవ్‌ సాగిందిలా... 
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన విశాఖ ఉత్సవ్‌–2019 ఆదివారం అంగరంగ వైభవంగా ముగిసింది.  
ఆర్కేబీచ్‌లోని ప్రధాన వేదికపై సాయంత్రం 5.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అనేలా సాగాయి.  
వైఎస్సార్‌ విగ్రహం నుంచి ఆర్కేబీచ్‌ వరకు జనం పోటెత్తారు.  
​​​​​​​‘ఆట’ సందీప్‌ టీం వినాయక పాటతో ప్రదర్శన ప్రారంభించింది.  
​​​​​​​హైదరాబాద్‌కు చెందిన థీరి బ్యాండ్‌ ప్రదర్శన శ్రోతల్ని సంగీతలోకంలో ఓలలాడించింది. ఈ ప్రదర్శన 45 నిమిషాల పాటు సాగింది.  
​​​​​​​థింక్‌ బిగ్‌ టీమ్‌.. మహిళల సంరక్షణ కోసం రూపొందించిన అత్యవసర అలారమ్‌ వినియోగంపై అవగాహన కలి్పంచింది.  
​​​​​​​ఎంజె5 బృందం ప్రదర్శించిన డ్యాన్సులతో సందర్శకులు ఊగిపోయారు.  
​​​​​​​సౌత్‌ ఆఫ్రికాకు చెందిన జరన్‌ టీం ప్రదర్శన అద్భుతంగా సాగింది.  
​​​​​​​ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ తమన్‌ తన బృందంతో 45 నిమిషాల పాటు సాగరతీరాన్ని హోరెత్తించారు. సింహా, గీతా మాధురి, శ్రీకృష్ణ, ఆదిత్య, హనుమాన్‌ తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు.  
​​​​​​​ఉత్సవ్‌ని విజయవంతంగా నిర్వహించిన జిల్లా ఉన్నతాధికారులను మంత్రి ముత్తంశెట్టి సన్మానించారు.  
​​​​​​​ఉత్సవ్‌ ముగింపు కార్యక్రమంలో భాగంగా సాగరతీరంలో ఏర్పాటు చేసిన బాణసంచాతో తీరం మెరిసిపోయింది.  
​​​​​​​20 నిమిషాల పాటు సాగిన లేజర్‌ షోతో విశాఖ ఉత్సవ్‌ ముగిసింది.
​​​​​​​ముగింపు వేడుకల్లో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కలెక్టర్‌ వినయ్‌చంద్, జేసీలు వేణుగోపాల్‌ రెడ్డి, శివశంకర్, ఎమ్మెల్యేలు అమర్‌నాథ్, నాగిరెడ్డి, అదీప్‌ రాజ్, వైఎస్సాసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ట తదితరులు పాల్గొన్నారు.
​​​​​​​
 

>
మరిన్ని వార్తలు