బలవంతపు వసూళ్లకు పాల్పడటం లేదు:గంటా

19 Jan, 2015 14:03 IST|Sakshi
బలవంతపు వసూళ్లకు పాల్పడటం లేదు:గంటా

విశాఖపట్నం: ఈ నెల 23, 24, 25వ తేదీల్లో విశాఖ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు.  ఆర్కే బీచ్, మధురవాడ జాతర, ఉడా పార్కు, కైలాసగిరి, గురజాడ  కళాక్షేత్రం తదితర వేదికల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయన ఆయన సోమవారం ఇక్కడ వెల్లడించారు. 23వ తేదీ మధ్యాహ్నం వెయ్యిమంది కళాకారులు, నేవీ బ్యాండుతో ప్రారంభమయ్యే కార్నివాల్ తో విశాఖ ఉత్సవ్  ప్రారంభమవుతుందని గంటా తెలిపారు.  మూడు రోజులపాటు జరిగే ఈ 'ఉత్సవ్' కు సాంస్కృతిక కళాకారులు, సినీ నటులు హాజరవుతారని పేర్కొన్నారు.
 

ఈ కార్నివాల్ ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారని గంటా  తెలిపారు. విశాఖ ఉత్సవ్ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను వైజాగ్ మున్సిపల్ కౌన్సిల్, ఉడా సంయుక్తంగా నిర్వహిస్తాయన్నారు. కార్యక్రమ నిర్వహణకు ఎవరినుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడడం లేదని తెలిపారు.

ఉత్సవ్ ప్రధాన వేదిక నిర్మాణం విషయంలో బీచ్కు ఎలాంటి ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఈ సందర్భంగా గంటా హామీ ఇచ్చారు. ఉత్సవాల కోసం బీచ్ రోడ్డు, చిల్డ్రన్స్ పార్కులో 100 అడుగుల కరెంటు ప్రభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీ 300 మంది మహిళలతో ముగ్గుల పోటీలు,  22న ఉత్తరాది ప్రజలతో కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మంత్రి గంటా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు