వహ్వా.. అనిపించేలా విశాఖ ఉత్సవ్‌

25 Dec, 2019 07:53 IST|Sakshi

ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు

రెండు రోజులపాటు సాంస్కృతిక సంబరం

2 ప్రధాన వేదికల్లో నిర్వహణ

‘సాక్షి’తో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌

సీతమ్మధార(విశాఖ ఉత్తర) : సాగరనగరి హోరెత్తేలా విశాఖ ఉత్సవ్‌ నిర్వహించనున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ, ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు, కళలు ప్రతిబింబించే విధంగా, ఈ ప్రాంత ప్రతిష్టను ఇనుమడింపజేసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆయన మంగళవారం సాక్షితో మాట్లాడారు. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్న ఉత్సవాల విజయవంతానికి ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. 

హాజరు కానున్న హీరో వెంకటేష్‌
ప్రముఖ సినీ హీరోలు వెంకటేష్, రవితేజ, సంగీత దర్శకులు ఎస్‌ఎస్‌ తమన్, దేవి శ్రీ ప్రసాద్‌ ప్రదర్శనల్లో పాల్గొంటారని మంత్రి తెలిపారు. టీవీ యాంకర్లు సుమ కనకాల, శిల్పాచక్రవర్తి, భార్గవ్‌ కార్యక్రమాలను నడిపిస్తారన్నారు. ప్రముఖ గాయనీగాయకులు, కళాకారులతో ప్రేక్షకులకు మంచి అనుభూతి అందించేలా కార్యక్రమాలను రూపొందించామన్నారు. 

ప్రత్యేక ఆకర్షణగా ఫ్లవర్‌ షో
 వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్కులో ఫ్లవర్‌ షో ప్రత్యేక ఆకర్షణ అని ముత్తంశెట్టి చెప్పారు. అక్కడే రెండు రోజులపాటు రమణీయమైన, అద్భుత ఫ్లవర్‌ షో ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో.. ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రముఖ దేవాలయాల నమూనాలను ఆర్‌.కె. బీచ్‌లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుందర విశాఖను సందర్శిస్తూ ఈ ప్రాంత ప్రాముఖ్యతను గురించి తెలియజేసి, ప్రపంచ స్థాయిలో విశాఖ ఘనకీర్తిని తెలియజేసే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ముగింపు రోజు విద్యుద్దీపాలతో పడవలు, బోట్లతో సముద్రంలో ప్రదర్శన ఉంటుందని చెప్పారు. 

ఆర్కే బీచ్, సెంట్రల్‌ పార్కుల్లో వేదికలు
రామకృష్ణ బీచ్‌లో ప్రధాన వేదిక ఉంటుందని, వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్క్‌లో రెండో వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  బీచ్‌లో దేవాలయ నమూనాలు, ఫుడ్‌ కోర్డు, ఫొటో ఎగ్జిబిషన్, స్పోర్ట్స్‌ ఎరీనా మొదలైనవి ఉంటాయన్నారు. వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్కులో స్థానిక కళాకారుల ప్రదర్శనలు, ప్లవర్‌ షో ఉంటాయన్నారు. రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. స్టేజి నిర్వహణ, వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల నిర్వహణకు అధికారులను నియమించామన్నారు. ఉత్సవాలకు ఆహ్వానం సీటింగ్, లైటింగ్‌ ఏర్పాట్లు, పారిశుద్ధ్య నిర్వహణలకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నగరలో ట్రాఫిక్‌  సమస్య లేకుండా బందోబస్తు  ఏర్పాటు చేస్తున్నారన్నారు. విశాఖ ఉత్సవ్‌ తిలకించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ తాగునీరు, వైద్య సదుపాయాల కోసం ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటు చేశామని తెలియజేశారు. డ్వాక్రా మహిళలతో సహా వివిధ శాఖలు, సంస్థలు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను తెలియజేస్తూ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. 

వేదిక1 ఆర్‌.కె.బీచ్‌
ప్రారంభ, ముగింపువేడుకలు
సెలబ్రిటీల సాంస్కృతికకార్యక్రమాలు
సంగీత విభావరులు
ప్రముఖ దేవాలయాల నమూనాలు
తీరం పొడవునా లైటింగ్‌తో పడవల ప్రదర్శన

వేదిక2  వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్క్‌
2 రోజులపాటుపుష్ప ప్రదర్శన
స్థానిక కళాకారులతో నృత్య, నాటక ప్రదర్శనలు

మరిన్ని వార్తలు