ఉప్పొంగిన ఉత్సవ్

24 Jan, 2015 01:35 IST|Sakshi
ఉప్పొంగిన ఉత్సవ్

వైభవంగా విశాఖ ఉత్సవ్ ఆరంభం
నాలుగు ప్రాంతాల్లో సంబరాలు
కళా ప్రదర్శనలతో కళకళలాడిన    ఆర్‌కె బీచ్ పరిసరాలు
వుడాపార్క్‌లో ఫల, పుష్ప ప్రదర్శన
కైలాసగిరిలో లేజర్‌షో ప్రత్యేక ఆకర్షణ

 
విశాఖపట్నం: కడలి కెరటాలతో పోటీపడుతూ ‘విశాఖ ఉత్సవ్’ ఉప్పొంగింది. సంస్కృతి, సంప్రదాయాల కలయికలో సంబరాలు తీసుకువచ్చింది. సంప్రదాయ నృత్యాలు, పౌరాణిక ఘట్టాలు, అభివృద్ధి, సంక్షేమ శకటాలు, యుద్ధ విన్యానాలు, వీనుల విందైన ప్రదర్శనలతో నగరమంతా పండుగ నింపింది. హుద్ హుద్ తుపాను చేసిన గాయాలను మరిపించేలా, ఉజ్వ ల భవిష్యత్‌పై ఆశలు రేకెత్తించేలా విశాఖ ఉత్సవం శుక్రవారం ప్రారంభమైం ది. మూడు రోజుల పాటు ఈ సంబరాలు విశాఖ వా సులను ఆనందడోలికల్లో ముంచెత్తనున్నాయి. కైలాసగిరి, వుడాపార్క్, గురజాడ కళాక్షేత్రం, శిల్పారామంలో ఉత్సవ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవంలో భాగంగా బీచ్ రోడ్డులో భారీ కార్నివాల్ జరిగింది. పౌరాణిక వేషధారణలతో కళాకారులు ఈ కార్నివాల్‌లో పాల్గొన్నారు. కోలాటం భజనలు, శాస్త్రీయ నృత్యాలు, తప్పెటగూళ్లు, గరగ  నృత్యాలు, డప్పు వాయిద్యాలు, థింసా, లంబాడీ  గిరిజన నృత్యాలు కనువిందు చేశాయి. జిల్లా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, లు, నీటి యాజమాన్య సంస్థ, నేవీ, అన్నవరం సత్యదేవుడు రధం, సింహాచలం నర్శింహస్వామి రథం, హరేకృష్ణ మూమెంట్, విశాఖ మెట్రో నమూనా సెకటాలు ప్రదర్శించారు. కార్నివాల్‌లో వివిధ విద్యాసంస్థల విద్యార్ధులు, బ్రహ్మకుమారీలు, జిల్లా అధికారులు కార్నివాల్‌లో పాదయాత్ర చేశారు. విద్యార్ధులు మైమ్ వంటి కళారూపాలు ప్రదర్శించారు.

బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, సర్ఫింగ్ పోటీలు నిర్వహించారు. వివిధ దేవాలయాల నమూనాలు తీరంలో నెలకొల్పారు. స్వైన్‌ఫ్లూ నివారణ మందులు అందించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. నావికాదళం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అణు జలాం తార్గామి అరిహంత్ సముద్రంలో చక్కర్లు కొడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యుద్ధ పరికరాలను నేవీ ప్రదర్శించింది. కైలాసగిరి మీద నిర్వహించిన లేజర్ షో అబ్బురపరిచింది. వుడాపార్క్‌లో ఫల, పూల ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన లక్షలాది రకాల పూలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. వైఎంసిఎ వద్ద గోకార్టింగ్,జోర్బింగ్(వాటర్ గేమ్), బుల్ గేమ్‌లలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. వీటిని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. సగం ధరకే గోకార్టింగ్‌ను నిర్వాహకులు అందిస్తున్నారు. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను వివరిస్తూ, తెలుగు వారి పిండి వంటలను రుచి చూపించే దాదాపు  150 స్టాల్స్‌ను బీచ్‌లో ఏర్పాటు చేశారు. వివిధ సంస్థల వస్తువులు కూడా ఈ ప్రదర్శనలో కొనుగోలుకు ఉంచారు. చిన్నారులు పతంగులు ఎగురవేశారు. తొలి రోజు వేడుకల్లో ఎంపీలు కె.హరిబాబు ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాస్, మంత్రులు గంటా శ్రీనివాసరావు కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, పంచకర్ల రమేష్‌బాబు, పి.విష్ణుకుమార్‌రాజు, బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద్, గణబాబు, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు, రాష్ట్ర హిందీ అకాడమీ చైర్మన్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జడ్పీ చైర్‌పర్సన్ లాలం భవానీ, కలెక్టర్ ఎన్.యువరాజ్, వుడా విసీ టి. బాబూరావునాయుడు, జివిఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు, జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. బీచ్‌లో ఏర్పాటు చేసిన ప్రధాన వేదికపై కైలాసగిరి శివపార్వతుల సెట్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేదిక నుంచే వెంకయ్యనాయుడు ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.  నేవీ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణ కాగా పద్మశ్రీ శివమణి వాయించిన డ్రమ్స్ కుర్రకారును చిందులేయించాయి.
 
 

మరిన్ని వార్తలు