జననేతపై ఘాతుకం విశాఖ ఆగ్రహోదగ్రం

26 Oct, 2018 09:17 IST|Sakshi
ఎయిర్‌పోర్టులో బారికేడ్లను తోసేస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు

ఎయిర్‌పోర్టులో అందరి సమక్షంలోనే హత్యాయత్నం

అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం.. భుజంపై తీవ్ర గాయం

ఘాతుకాన్ని చిన్నదిగా.. అభిమాని పనిగా పోలీసులు, సర్కారు వక్రభాష్యం

ప్రతిపక్షనేత భద్రతలో వైఫల్యం.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహావేశాలు

వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆందోళనలతో అట్టుడికిన ఎయిర్‌పోర్టు, హైవే

ఫర్నిచర్, బోర్డులు ధ్వంసం, గంటల తరబడి నిలిచిపోయిన ట్రాఫిక్‌

ఆందోళనకారులను బలవంతంగా తరలించిన పోలీసులు

జననేతపై దాడికి జిల్లావ్యాప్తంగా నిరసనలు

ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు

జగన్‌మోహన్‌రెడ్డి కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు

కడుపులో కత్తులు పెట్టుకొని.. పైకి చేతులు కలిపినట్లు.. నీళ్ల సీసా మాటున కత్తి దాచుకొచ్చాడు.. తియ్యటి మాటలతో దగ్గరకొచ్చాడు.. అన్నా.. అంటూ ఆఘాయిత్యానికి తెగబడ్డాడు. అటు నేవీ, ఇటు సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా వలయంలో ఉండే ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లోనే భౌతిక దాడికి తెగబడ్డాడు. పదునైన కత్తితో కుత్తుక కోయబోయాడు.. అద్వితీయమైన జనాభిమానమే శ్రీరామరక్షగా భావించే జననేత అప్రమత్తతే ఆయన ప్రాణాన్ని కాపాడింది.. పదునైన కత్తిదాడికి మాత్రం గురికాక తప్పలేదు. ఆయన ఎడమ భుజంపై తీవ్ర గాయమైంది.

వందలాది ప్రయాణికులున్నారు.. చుట్టూ పార్టీ నేతలున్నారు.. ఊహించనిరీతిలో జరిగిన ఈ ఘాతుకం వారిని హతాశులను చేసింది. ఎయిర్‌పోర్టు రెస్టారెంట్‌ వెయిటరే ఇలా హత్యాయత్నానికి తెగబడతాడని ఊహించని వారు.. వెంటనే తెప్పరిల్లి దుండగుడిని పట్టుకున్నారు. అంత బాధలోనూ చెదరని చిరునవ్వుతో దుండగుడిని ఏమీ చేయవద్దని జగన్‌మోహన్‌రెడ్డి వారించారు.

కత్తి గాయం తీవ్రంగా సలుపుతున్నా.. దాన్ని పంటిబిగువునా భరిస్తూ.. ప్రాథమిక చికిత్స చేయించుకుని జననేత హైదరాబాద్‌కు పయనమయ్యారు.

జననేత జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన ఈ హత్యాయత్నం సమాచారం క్షణాల్లో అక్కడి పరిస్థితిని మార్చేసింది. ప్రశాంతతకు మారుపేరైన విశాఖ ఆగ్రహంతో రగిలిపోయింది. సమాచారం తెలిసిన తక్షణం వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పరుగు పరుగున ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

తమ నేతపై దాడిని తట్టుకోలేకపోయిన వారంతా.. భద్రతా వైఫల్యంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత, ఒక ప్రధాన పార్టీ అధినేతకు రక్షణ కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్న రాష్ట్ర సర్కారు దుర్నీతిపై మండిపడ్డారు. ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ఎయిర్‌పోర్ట్‌ ఆవరణలో బైఠాయించారు.. సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. నిరసనలు, ఆందోళనలతో ఎయిర్‌పోర్టు, జాతీయ రహదారి అట్టుడికిపోయాయి. గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ప్రతిపక్ష నేతపై అతని అభిమానే పబ్లిసిటీ కోసం దాడి చేశాడని దర్యాప్తు మొదలుకాకముందే తేల్చేసిన పోలీసులు.. ఇక్కడ ఆందోళనకారులపై మాత్రం ఉక్కుపాదం మోపారు. అరెస్టులు చేసి బలవంతంగా తరలించారు.

మరోవైపు జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఊరూవాడా ఖండించాయి.. టీడీపీ మినహా అన్ని పార్టీలు, సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఖండించాయి. సర్కారు కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు జిల్లావ్యాప్తంగా రోడ్ల మీదికొచ్చి నిరసన ప్రకటించాయి. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలతో అన్ని ప్రాంతాలు దద్దరిల్లాయి.         – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): ప్రశాంత విశాఖలో హత్యా రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ నాంది పలికింది. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై  టీడీపీకి చెందిన ఓ నాయకుడి వద్ద పనిచేస్తున్న శ్రీనివాస్‌ (శ్రీనివాస్‌ తండ్రి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎంపీపీ) విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో హత్యాయత్నంలో జగన్‌మోహన్‌రెడ్డి తప్పించుకోవడం.. చేతికి తీవ్ర గాయమై బాధపడతుంటే.. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎదురుదాడికి దిగడంపై విశాఖ ఒక్కసారిగా భగ్గుమంది. అత్యంత ప్రజాదరణ గల నాయకుడిపై దాడి జరగడాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దాడిని నిరసిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు..మానవహారాలు..రాస్తారోకోలు..నిరసనలు చేపట్టింది. విశాఖలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. జగన్‌మోహన్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆలయాలు, చర్చ్‌లు, మసీదుల్లో ప్రార్థనలు జరిపారు. జగన్‌పై దాడి జరిగిందన్న వార్త తెలియడంతో పలువురు మహిళలు, యువకులు కంటతడిపెట్టారు. అభిమాన నేత త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే నడుస్తున్నారంటూ దుయ్యబట్టారు.

విశాఖ దక్షిణలో..
పార్టీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ పైడి వెంకట రమణమూర్తి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లవరపు జాన్‌వెస్లీ, యువజన విభాగం నగర అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహ్మద్‌ షరీఫ్‌తో పాటు పలు వార్డుల అద్యక్షులు, మైనార్టీ, మహిళ విభాగం నాయకులు పాల్గొన్నారు.

విశాఖ తూర్పులో..
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రమంలో జరిగిన దాడిని ఖండిస్తూ తూర్పు నియోజకవర్గంలో నిరసన ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గ పరిధి 1, 2, 3 వార్డుల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్‌డౌనంటూ నినదించారు. ఆరిలోవ కాలనీ చివరి బస్టాప్‌ నుంచి నెహ్రూనగర్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. అంబేడ్కర్‌ కూడలి విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మూడో వార్డులో కొవ్వొత్తుల ప్రదర్శన జరిపారు. ఒకటో వార్డు లీలా సుందరయ్యనగర్‌ ఆర్‌సీఎం చర్చిలో జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం బాగుండాలని కోరుతూ అభిమానులు ప్రార్థనలు చేశారు.

పశ్చిమ నియోజకవర్గంలో..
జగన్‌పై దాడిని ఖండిస్తూ మల్కాపురం,శ్రీహరిపురం ప్రధాన కూడళ్లి వద్ద రోడ్డుపై పార్టీ శ్రేణులు బైటాయించి నినాదాలు చేశారు. శ్రీహరిపురం వద్ద జరిగిన నిరసన కార్యాక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి మళ్ల ధనలత పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో..
వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి గెడ్డం ఉమ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు నోటికి నల్ల రిబ్బన్‌ ధరించి  మౌన ప్రదర్శన నిర్వహించారు. డాబాగార్డెన్స్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు మౌన ప్రదర్శన చేపట్టి, అనంతరం గాంధీ మహాత్మునికి శ్వేతపత్రం అందజేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.  

భీమిలి నియోజకవర్గంలో..
నియోజకవర్గపరిధి వేములవలస జంక్షన్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల పాల్గొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎయిర్‌పోర్టుకు వెళ్తారనే విషయాన్ని పసిగట్టి దారుణానికి ఒడిగట్టారని, ఇది తెలుగుదేశం పార్టీ కుట్రేనని నిరసిస్తూ చేతకాని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తోందంటూ, హింసను ప్రేరేపిస్తున్న చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేశారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పార్టీ అధినేతపై జరిగిన దాడిని తట్టుకోలేక నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల కన్నీటి పర్యంతమయ్యారు. రాజన్న పాలనకు అహర్నిశలు కష్టపడుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని అంతమొందించడానికి మనసు ఎలా వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.

చేతికి సంకెళ్లతో నిరసన
ఏయూక్యాంపస్‌(విశాఖ తూర్పు):  ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, హత్యా రాజకీయాలు తగవని ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిశోధకులు నినదించారు. గురువారం సాయంత్రం ఏయూ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద చేతికి తాళ్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షనాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి జరపడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ తగిన భద్రత, రక్షణ కల్పించడం ఎంతో అవసరమన్నారు. జగన్‌ మోహన రెడ్డిపై జరిగిన దాడిని ఖండించారు. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని నినాదాలు చేశారు. నిరసనలో పరిశోధకులు వి.ఏ రాజుగౌడ్, అబ్రహం సుమంత్, ఆరేటి మహేష్, మండే సురేష్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతపై దాడి నేపథ్యంలో వర్సిటీలో పోలీసు భద్రత పెంచారు.

మరిన్ని వార్తలు