ఐటీకి విశాఖ అనుకూలం

21 Feb, 2020 13:16 IST|Sakshi
జ్యోతి ప్రజ్వలనతో సదస్సు ప్రారంభిస్తున్న స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ పి.కె.ర , ఐటీ కార్యదర్శి కోన శశిధర్‌

సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు స్వాగతం

మార్చి నుంచి డ్రాఫ్ట్‌ ఐటీ పాలసీ

పరిశ్రమలు, కంపెనీలు తరలిపోవడం అవాస్తవం

సచివాలయ వ్యవస్థ అద్భుతం

ఈపీఐసీ–2020 సదస్సులో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌ శాఖ కార్యదర్శి కోన శశిధర్‌  

సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే అందమైన ఐటీ సిటీగా విశాఖ అభివృద్ధి చెందనుందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌ శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ పేర్కొన్నారు. గురువారం ఆర్కే బీచ్‌ రోడ్డులోని ఓ హోటల్‌లో కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా వైజాగ్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే “ఎడ్జ్‌ కంప్యూటింగ్, ప్రోసెస్‌ ఆటోమేషన్‌ త్రూ రోబోటిక్స్, ఇండస్ట్రీ 4.0, కాగ్నెటివ్‌ టెక్నాలజీ(ఈపీఐసీ)–2020’ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఆయన విశాఖలో ఐటీ అభివృద్ధి, ఆధునిక టెక్నాలజీలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం శశిధర్‌ మాట్లాడుతూ ఐటీ పరిశ్రమలకు విశాఖ అనుకూలమైన ప్రాంతమని, వాటి ఏర్పాటుకు ఎవరొచ్చినా స్వాగతిస్తామన్నారు. వైజాగ్‌ నుంచి ఐటీ సంస్థలు, పరిశ్రమలు తరలిపోతున్నాయనే వదంతులను నమ్మవద్దని, ఎటువంటి ఐటీ కంపెనీలు ఎక్కడికి వెళ్లిపోవడం లేదని స్పష్టం చేశారు. విశాఖ, తిరుపతి, అనంతపురం తదితర ప్రాంతాల్లో ఐటీ కాన్సెప్ట్‌ సిటీలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో కంపెనీలను నెలకొల్పేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తామన్నారు. విశాఖను ఐటీ, తిరుపతిని ఎలక్ట్రానిక్స్‌ హబ్‌లుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిలికాన్‌ వేలీ సిటీ తర్వాత విశాఖ మాత్రమే ఐటీ రంగానికి అనువుగా ఉంటుందన్నారు. పరిశ్రమలు, ఐటీ రంగాల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను అభివద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి డ్రాఫ్ట్‌ ఐటీ పాలసీని తీసుకురానున్నట్లు చెప్పారు. విశాఖలో ఇంక్యుబేషన్‌ సెంటర్‌లు కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

ఐవోటీ ఏర్పాటుకు నిధులు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నాస్కామ్‌ సంయుక్తంగా ఆంధ్రా యూనివర్సిటీలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(ఐవోటీ)ను ఏర్పాటు చేసేందుకు నిధులు విడుదల చేశామని శశిధర్‌ తెలిపారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ సహకారంతో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ డ్రోన్‌ టెక్నాలజీ తదితర వాటి అభివృద్ధికి రాష్ట్రంలో రెండో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అద్భుతమని, దీని ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారన్నారు. 

ఉత్పత్తి మరింత సులభతరం..
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ పి.కె.రథ్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కులో ఉత్పత్తులు పెంచేందుకు ఆధునిక ఆటోమేషన్‌ టెక్నాలజీ సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. ఉక్కు పరిశ్రమ కారణంగా జాతీయ నికర ఉత్పత్తిలో 2 శాతం వాటా చేకూరుతోందన్నారు. ఆధునికీకరణ క్రమంలో ఆటోమేషన్‌ టెక్నాలజీతో నాణ్యత గల ఉక్కును తయారుచేయడంతో ఉత్పత్తి ఇంకా పెరుగుతుందని చెప్పారు. ఈ ఆటోమేటివ్‌ ఎక్విప్‌మెంట్‌తో ఉత్పత్తి మరింత సులభతరంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం సదస్సు మ్యాగజైన్‌ను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐఎన్‌ఎల్‌ డైరెక్టర్‌(పర్సనల్‌) కె.సి.దాస్, క్వాడ్‌జెన్‌ వైర్‌లెస్‌ సొల్యూషన్స్‌ చైర్మన్‌ సి.ఎస్‌.రావు, ఆర్‌ఎన్‌ఐఎల్‌ డైరెక్టర్‌ కె.కె.ఘోష్, సదస్సు కన్వీనర్‌ బి.గోవర్థన్‌రెడ్డి, సీఎస్‌ఐ విశాఖ చాప్టర్‌ ట్రెజరర్‌ ఎ.ఎన్‌.బిశ్వాల్, వివిధ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు.  

ఆటోమేషన్‌ టెక్నాలజీతో ముందుగానే..
ఆధునిక ఆటోమేషన్‌ టెక్నాలజీ ద్వారా ముందుగానే మలేరియా ప్రభావిత ప్రాంతాలను కనుగొని, ఎంత మంది ప్రభావితులయ్యారో తెలుసుకోవచ్చని కోన శశిధర్‌ పేర్కొన్నారు. గతంలో విశాఖ ఏజెన్సీలో మలేరియా కేసులు అధికంగా నమోదయ్యాయని, అటువంటి ఆరోగ్య సమస్యలను ఈ టెక్నాలజీతో ముందస్తుగానే పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆయా ప్రాంతాల్లో వర్షపాతం నమోదు, భౌగోళిక పరిస్థితులు, ఇతర ప్రభావిత విషయాలను గుర్తించి ముందుగానే తెలుసుకోవచ్చని వివరించారు. ఈ–ప్రగతి ప్రాజెక్టు ద్వారా ఆటోమేషన్‌ టెక్నాలజీతో మరింత సమర్థవంతమైన పాలన అందిస్తామన్నారు.

మరిన్ని వార్తలు