విశాఖ నగరం చాలా కాస్ట్‌లీ గురూ..

3 May, 2018 15:20 IST|Sakshi

మొదటి 10 ఖరీదైన నగరాల్లో విశాఖ

దేశంలోనే ఖరీదైన నగరాల్లో 9వ స్థానం

సూరత్‌ను అధిగమించిన సిటీ

రూ.2.79 లక్షల కోట్లు దాటిన జీడీపీ

కాస్మోపాలిటన్‌ సిటీగా గుర్తింపు

యాహూ తాజా సర్వేలో వెల్లడి

వావ్‌.. నగరవాసులకు ఇదో తీపికబురే! భారతదేశంలో అత్యంతధనిక నగరాల్లో విశాఖపట్నానికిచోటు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగాఅత్యధిక నెటిజన్లు కలిగిన యాహూసంస్థ నిర్వహించిన సర్వేలో టాప్‌–10లో నిలిచింది. ఇండియాఫైనాన్స్‌ టీం అంచనా మేరకు స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) ప్రకారం2016 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ఈ సర్వేఆధారంగా భారత దేశంలో టాప్‌–10 ధనిక నగరాల జాబితాను వెల్లడించింది.

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ భారతదేశంలో ఇప్పటి వరకు టాప్‌– 10లో మూడు నగరాలే ఉన్నాయి. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు మాత్రమే దశాబ్దాలుగా టాప్‌–10లో చోటుదక్కుతోంది. తొలిసారిగా విశాఖ  ఈ కాస్మోపాలిటిన్‌ సిటీల సరసన చోటు దక్కించుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మరోసారి దేశంలోని ధనిక నగరంగా రూ. 23.92 లక్షల కోట్ల జీడీపీతో నెం.1 స్థానంలో నిలిచింది. దక్షిణ భారతదేశంలో వరుసగా కర్నాటక రాజధాని బెంగళూరు 4వ స్థానంలో నిలవగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ 5వ స్థానంలో నిలిచింది. చెన్నై ఆరో స్థానంలో నిలవగా, విశాఖ  తొమ్మిదవ స్థానంలో నిలిచింది.     

భారత ఆర్థిక సంస్థ అంచనా ప్రకారం విభజన ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖపట్నం జీడీపీ రూ.2.79లక్షల కోట్లకు చేరడంతో ఈ అరుదైన ఘనత లభించింది. టాప్‌–10లో నిలిచిన  మిగిలిన నగరాలను చూస్తే రూ.19.04 లక్షల కోట్ల జీడీపీతో రెండో స్థానంలో ఢిల్లీ, రూ.9.75లక్షల కోట్ల జీడీపీతో కోల్‌కత్తా మూడో స్థానం, రూ.4.14 లక్షల కోట్లతో అహ్మదాబాద్‌ ఏడో స్థానం, రూ.3.39లక్షల కోట్లతో పుణె నిలిచింది.

విశాఖలో అన్నీ ఖరీదే..
దేశంలో కాస్మోపాలిటిన్‌ నగరాల్లో ఒకటైన సూరత్‌ జీడీపీ 2.6లక్షల కోట్లు కాగా..ఆ నగరాన్ని రూ.2.79లక్షల కోట్ల జీడీపీతో విశాఖ అధిగమించింది. యాహూ లాంటి సంస్థ నిర్వహించిన సర్వేలో టాప్‌–10లో విశాఖకు చోటు దక్కడంపట్ల విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సిటీ నడిబొడ్డున గజం రూ.50వేల నుంచి రూ.లక్షన్నర వరకు ఉంది. జగదాంబ, బీచ్‌రోడ్‌ వంటి అత్యంత ఖరీదైన ఏరియాల్లో లక్షన్నరకుపైగానే పలుకుతోంది. గజం రూ.30 వేల నుంచి రూ.50వేల లోపు కావాలంటే నగర శివారుకు వెళ్లాల్సిందే. అంతే కాదు.. సిటీ పరిధిలో ఓ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ కావాలంటే రూ.50లక్షల నుంచి కోటిన్నర  వరకు ఉంది.  అద్దెలు కూడా ఆ స్థాయిలోనే ఉంటున్నాయి. రూ.20వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతున్నాయి. దిగువ మధ్య తరగతి, సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాల్లో సైతం అద్దెలు రూ.ఐదారు వేల నుంచి రూ.15 వేలకు తక్కువ లేవు.

ఏపీ ఆర్థిక కేంద్రంగా గుర్తింపు
విశాఖపట్నం ఏపీ ఆర్థిక కేంద్రంగా యాహూ గుర్తించింది. గ్రేటర్‌ విశాఖగా రూపాంతరం చెందిన తర్వాత విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్లు, ఐటీ సెజ్‌లు, ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేయడంతో పాటు వాటిలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనతో 2005 నుంచి విశాఖకు పరిశ్రమలు క్యూ కట్టాయి. ఆ సమయంలోనే ఏర్పాటైన విశాఖ శివారు ఐటీ సెజ్‌లో నెలకొల్పిన ఫింటెక్‌ వ్యాలీలో పెద్దఎత్తున ఐటీ కంపెనీలు ముందుకొచ్చాయి. ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు అనువుగా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ)అనేది ఒక నిర్దిష్ట కాలానికి చెందిన చెందిన అన్ని వస్తువులు, సేవల ద్రవ్య ప్రమాణంగా చెప్పొచ్చు.

తలసరిలో టాప్‌–2
2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర జీడీపీ వృద్ధి రేటులో పారిశ్రామిక, సేవా రంగాల్లో నంబర్‌ వన్‌గా నిలిచిన విశాఖ, తలసరి ఆదాయంలో నంబర్‌ 2లో నిలిచింది. 2014–15లో తలసరి ఆదాయం రూ.1, 12,718, 2015–16లో రూ.1,27,378 కాగా, 2016–17లో ఏకంగా రూ.1,42,821లని ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. తలసరి ఆదాయంలో ఏపీలో కృష్ణా జిల్లా పధాన స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాన్ని విశాఖ జిల్లా దక్కించుకుంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో విశాఖ జిల్లా పారిశ్రామిక రంగంలో 35.6 శాతం, సేవా రంగంలో 51.4 శాతం వృద్ధి రేటు సాధించి టాప్‌–1 స్థానంలో నిలిచిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు