కరోనాపై తొలి విజయం

1 Apr, 2020 10:45 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో నమోదైన కరోనా తొలి బాధితుడిని మంగళవారం డిశ్చార్జి చేశారు. మధ్యాహ్నం 2గంటలకు ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలో జిల్లా వైద్యాధికారి సనపల తిరుపతిరావు డిశ్చార్జి చేశారు. మార్చి 17న కరోనా లక్షణాలతో ఛాతీ ఆస్పత్రిలో చేరిన 65 ఏళ్ల వృద్ధుడు మక్కా యాత్రకు వెళ్లి వచ్చిన తర్వాత కరోనా సోకినట్లు నిర్థారించిన విషయం తెలిసిందే. ఐసోలేటెడ్‌ వార్డులో సేవలందిస్తూనే మూడు సార్లు రక్త నమూనాలను పరీక్షలకు పంపించారు. మొదటిసారి పాజిటివ్‌ వచ్చిన తర్వాత రెండు సార్లు నెగిటివ్‌ రావడంతో డిశ్చార్చి చేశారు. యంత్రాంగం పటిష్టమైన చర్యలు మార్చి 19న అల్లిపురానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ అని తెలిసినప్పటి నుంచి జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టడమే కాకుండా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు చర్యలు చేపట్టింది. (పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్‌)

ఆయన మక్కా నుంచి వచ్చిన తరువాత సన్నిహితంగా మెలిగిన వారు, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి 11 మంది అనుమానితులను ఛాతీ ఆస్పత్రికి, విమ్స్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. వారందరికీ రక్త పరీక్షలు చేశారు. అందులో అందరికీ నెగిటివ్‌ వచ్చినప్పటికీ భార్యకు పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సనపల తిరుపతిరావు మాట్లాడుతూ అల్లిపురం ప్రాంతానికి చెందిన వృద్ధుడు పూర్తిగా కోలుకున్నాడని తెలిపారు. ప్రస్తుతం ఇంటికి పంపించేశామని, 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు.

మరిన్ని వార్తలు