5 స్టార్‌ జస్ట్‌ మిస్‌! 

27 Jun, 2020 08:07 IST|Sakshi

3 స్టార్‌ రేటింగ్‌ నగరాల్లో విశాఖకు నంబర్‌ వన్‌ స్థానం

వచ్చే ఏడాది కచ్చితంగా 5 స్టార్‌.. కమిషనర్‌ సృజన 

సాక్షి, విశాఖపట్నం: చెత్త రహిత నగరాల జాబితాలో కేవలం 16 పాయింట్ల తేడాతో  విశాఖ నగరం 5 స్టార్‌ రేటింగ్‌ కోల్పోయింది.   సవరించిన గార్బేజ్‌ ఫ్రీ సిటీ రేటింగ్స్‌ జాబితాలో సింగిల్‌ స్టార్‌ నుంచి త్రీస్టార్‌ రేటింగ్‌ సాధించిన విశాఖ నగరం.. తృటిలో 5 స్టార్‌ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. మొత్తం మూడు విభాగాల్లో కలిపి 225 పాయింట్లు రావాల్సి ఉండగా.. విశాఖ నగరం 209 పాయింట్లకే పరిమితమైంది. దీంతో  త్రీస్టార్‌ రేటింగ్‌కే పరిమితమైపోయింది. మాండేటరీ విభాగంలో 85 పాయింట్లకు గాను 84, ఎసెన్షియల్‌లో 80కి  70, డిజైరబుల్‌ విభాగంలో 60 పాయింట్లు రావాల్సి ఉండగా 55 పాయింట్లు  విశాఖ నగరానికి దక్కాయి.

దీంతో 5 స్టార్‌ రేటింగ్‌ రానప్పటికీ 3 స్టార్‌ సాధించిన నగరాల జాబితాలో విశాఖ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 72 నగరాలు 3 స్టార్‌ సాధించగా.. విశాఖ మొదటి స్థానంలో, తిరుపతి, విజయవాడ నగరాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. తిరుపతి నగరానికి విశాఖ కంటే 4 పాయింట్లు ఎక్కువ వచ్చినప్పటికీ.. కీలక విభాగాల్లో జీవీఎంసీ మెరుగైన స్థానంలో నిలవడంతో  నంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించింది. కొన్ని విభాగాల్లో 50 పాయింట్లు మాత్రమే సాధించడంతో 5 స్టార్‌ ర్యాంకింగ్‌ కోల్పోయినట్లు జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన, అదనపు కమిషనర్‌ వి.సన్యాసిరావు, సీఎంహెచ్‌వో డా.కేఎల్‌ఎస్‌జీ శాస్త్రి తెలిపారు.

గ్రీవెన్స్‌ పరిష్కారం, ప్లాస్టిక్‌ నిషేధం, కాల్వల  స్రీ‍్కనింగ్‌, తడిచెత్త ప్రాసెసింగ్, డంప్‌సైట్‌ రెమిడియేషన్‌ పద్ధతుల్లో 50 చొప్పున పాయింట్లు మాత్రమే సాధించడంతో 5 స్టార్‌ రేటింగ్‌ సాధించుకోవడంలో విఫలమయ్యామని కమిషనర్‌ వివరించారు. అయితే తొలి జాబితాలో సింగిల్‌ స్టార్‌కు పరిమితమైన సమయంలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ విభాగంలో సున్నా మార్కులు వేశారని.. తాజాగా  సవరించిన మార్కుల జాబితాలో 100 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది కచ్చితంగా 5 స్టార్‌ రేటింగ్‌ సాధిస్తామని సృజన దీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు