విదేశాల నుంచి వచ్చిన  465 మంది గుర్తింపు 

25 Mar, 2020 10:13 IST|Sakshi
మధురవాడ జోనల్‌ కార్యాలయంలో సమావేశమైన వివిధ శాఖల అధికారులు

సాక్షి, గాజువాక: వివిధ కారణాలతో విదేశాలకు వెళ్లి తిరిగొచ్చిన 465 మందిని గాజువాక ప్రాంత అధికారులు గుర్తించారు. వారిలో కొంతమందిని క్వారంటైన్‌ వార్డుకు తరలించగా, మిగిలినవారిని గృహ నిర్బంధంలో ఉంచారు. గాజువాక, పెదగంట్యాడ, స్టీల్‌ప్లాంట్, కూర్మన్నపాలెం, పరవాడ పరిసర ప్రాంతాలనుంచి వారు పలు దేశాలకు వెళ్లారు. వారిలో కొంతమంది మక్కాను దర్శించుకున్నవారు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. విశాఖ నగరం నుంచి మక్కాకు వెళ్లిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. గాజువాక జోన్‌లో వార్డు, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసిన అధికారులు విదేశాలకు వెళ్లి వచ్చినవారి వివరాలను ఆ కమిటీలద్వారా సేకరించారు. గాజువాకలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురు వ్యక్తులను క్వారంటైన్‌ వార్డులకు తరలించినట్టు అధికారులు తెలిపారు. 

ప్రజలు సహకరించాలి 
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కోరారు. దీనికోసం స్వీయ నిర్బంధం, సామాజిక దూరం, మాస్‌్కలను ధరించడం వంటి సూచనలను విధిగా పాటించాలన్నారు. కరోనా వైరస్‌ను సమూలంగా అదుపు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. వైరస్‌ను ఎదుర్కోవడం కోసం జీవీఎంసీ, మండల రెవెన్యూ, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. విదేశాలనుంచి తిరిగి వచ్చినవారిని గ్రామ సచివాలయాలద్వారా వలంటీర్లు గుర్తించి క్వారంటైన్‌ సెంటర్లకు పంపుతారని, వారికి స్థానికులు సహకరించాలని కోరారు.

గృహ నిర్బంధంలో 74 మంది 
మధురవాడ (భీమిలి):
కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రజలను బయటకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్‌ అనుమానితులను ఇతర శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యం మంగళవారం మధురవాడ జోనల్‌ కార్యాలయంలో జీవీఎంసీ, రెవెన్యు, వైద్య, ప్రజారోగ్యం అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోన్‌ పరిధిలో 88 మంది విదేశాలనుంచి ఇక్కడకు వచ్చారని, వారిలో ఇద్దరు క్వారంటైన్‌ వార్డులో ఉండగా, ఐదుగురు ఇతర ప్రాంతాలకు, ఏడుగురు తిరిగి విదేశాలకు వెళ్లిపోయారన్నారు. ప్రస్తుతం ఇక్కడ 74 మంది గృహ నిర్బంధంలో ఉన్నారని చెప్పారు.  మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్టు జెడ్సీ బి.రాము, విశాఖ రూరల్‌ తహసీల్దార్‌ ఆర్‌.నగరసింహమూర్తి, పీహెచ్‌సీ వైద్యాధికారి అశ్వని శైలజ, ఏఎంహెచ్‌వో జయరామ్‌ తదితరులు వెల్లడించారు. కార్యక్రమంలో వీఆర్‌వో కె. అప్పారావు, ఏపీడీ దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

290 మందిపై వైద్య పర్యవేక్షణ 
పీఎంపాలెం (భీమిలి): మధురవాడ జోన్‌–1 పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ముందుగా గుర్తించిన 54 మందితో కలిపి 290 మంది విదేశాలనుంచి వచ్చిన వారిని గుర్తించామని జోన్‌ జెడ్సీ బీ.రాము  మంగళవారం తెలిపారు. వారందరూ హోమ్‌ క్వారంటైన్‌లోనే ఉన్నారని చెప్పారు. వారిని ఆరోగ్య సిబ్బంది ప్రతి రోజూ ఉదయం సాయంత్రం పర్య వేక్షిస్తున్నారని ఆయన తెలిపిపారు. ఈ నెల 31 వరకూ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆందరూ లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు పరచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

సబ్బవరం, గుల్లేపల్లిలో 13 మంది..
సబ్బవరం(పెందుర్తి): సబ్బవరం, గుల్లేపల్లి పరిధిలో ఇటీవల విదేశాల నుంచి 13 మంది వచ్చారు. వలంటీర్ల సమాచారంతో ఆయా పీహెచ్‌సీల సిబ్బంది అప్రమత్తమయ్యారు. వీరందరినీ క్వారంటైన్‌లో ఉంచారు. వీరిని అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు