సినీ పరిశ్రమకు విశాఖ వేదిక : బ్రహ్మాజీ

16 Nov, 2014 01:04 IST|Sakshi
సినీ పరిశ్రమకు విశాఖ వేదిక : బ్రహ్మాజీ

అచ్యుతాపురం :  భవిష్యత్తులో సినీ పరిశ్రమకు విశాఖ వేదిక కానుందని ప్రముఖ సినీనటుడు బ్రహ్మాజీ అన్నారు. కొండకర్లలో ‘ఇచ్చా’ స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడి విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే పలువురు విశాఖలో షూటింగ్ చేపడుతున్నారన్నారు. అరకుకు విమాన సౌకర్యాలు మెరుగుపరచగలిగితే పర్యాటకం, సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు.

తన కెరీర్‌లో 25 చిత్రాల్లో గుర్తింపు తెచ్చిన పాత్రలు పోషించినట్టు చెప్పారు. ప్రస్తుతం ‘పండుగ చేసుకో’, యూవీ క్రియేషన్స్ చిత్రాల్లో నటిస్తున్నానన్నారు. వర్ధమాన నటులు ఓపికతో శ్రమపడాల్సి ఉందన్నారు. పైరసీ కారణంగా పరిశ్రమ దెబ్బతింటుందని వాపోయారు. హుదూద్ తుఫాన్ కారణంగా విశాఖకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. విశాఖను పునర్నిర్మించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. అంతకు ముందు ఆయన అనాథ ఆశ్రమంలోని పిల్లల్ని దగ్గరకు తీసుకుని కాసేపు వారితో సరదాగా గడిపారు. అనాథలు, వికలాంగులకు మరింత సేవలందేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి మథూ టుక్నైట్‌ను అభినందించారు.

మరిన్ని వార్తలు