-

ప్రతి ప్రయాణికుడికి థర్మల్‌ స్కానింగ్‌..

21 Mar, 2020 17:19 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: రైల్వే స్టేషన్‌కు వచ్చి, బయటకు వెళ్లే ప్రతి ప్రయాణికుడిని థర్మల్‌ స్కానర్‌ ద్వారా తనిఖీ చేస్తున్నామని విశాఖ రైల్వే ష్టేషన్‌ చీఫ్‌ మేనేజర్‌ సురేష్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌-19( కరోనా వైరస్‌) నిరోధానికి విశాఖ రైల్వే స్టేషన్‌లో  ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైల్వేస్టేషన్ ప్రధాన గేటు1, వెనుక వైపు జ్ఞానాపురం గేటు ను మాత్రమే తెరిచి ఉంచామని తెలిపారు. (రేపు జనతా కర్ఫ్యూ పాటిద్దాం: గౌతం సవాంగ్‌)

ప్రయాణికుల తనిఖీకి నాలుగు ధర్మల్ స్కానర్లను అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులను పరీక్షించడానికి నలుగురు చొప్పున పది బృందాలను మూడు షిఫ్ట్‌ల్లో ఉంచామని చెప్పారు. ప్రతీ బృందంలో ఆర్‌పీఎఫ్ పోలీసులు, సివిల్‌, డిఫెన్స్, టిక్కెట్ కలెక్టర్లను ఏర్పటు చేశామన్నారు.
(రైళ్లలో కరోనా రోగులుంటారు జాగ్రత్త : ప్రయాణం ప్రమాదం)

రేపటి ‘జనతా కర్ఫ్యూ’ నేపథ్యంలో విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే జన్మభూమి, రత్నాచల్, గోదావరి, విశాఖ, ఎల్‌టీటీ రైళ్లను రద్దు చేశామన్నారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగే 50 వరకు రైళ్లు రద్దు అయ్యాయని తెలిపారు. రేపు ప్రజలంతా స్వచ్ఛందంగా ‘కర్ఫ్యూ ’  పాటించి కరోనాని నియంత్రించాలని సురేష్‌ పిలుపునిచ్చారు. (కరోనా: రైళ్లు రద్దు.. డబ్బు వాపస్‌!)

మరిన్ని వార్తలు